శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? ఎప్పుడు, ఎక్కడ చేయాలి?-who should do shrardha karmas and when and where check full details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? ఎప్పుడు, ఎక్కడ చేయాలి?

శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? ఎప్పుడు, ఎక్కడ చేయాలి?

HT Telugu Desk HT Telugu

శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? ఎప్పుడు, ఎక్కడ చేయాలి అనేది చిలకమర్తి తెలియజేసారు. పుత్రుడే శ్రాద్ధ కర్మ చేయాలి. పుత్రుడు లేకపోతే భార్య చేయవచ్చును. భార్య లేకపోతే సోదరుడు చేయవచ్చును. సోదరులు కూడా లేకపోతే బంధువులు, శిష్యులు చేయవచ్చును అన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవిగో.

శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి? ఎప్పుడు, ఎక్కడ చేయాలి? (pinterest)

పుత్రుడే శ్రాద్ధ కర్మ చేయాలి. పుత్రుడు లేకపోతే భార్య చేయవచ్చును. భార్య లేకపోతే సోదరుడు చేయవచ్చును. సోదరులు కూడా లేకపోతే బంధువులు, శిష్యులు చేయవచ్చును.మిత్రుడు కూడా పిండప్రదానం చేయడానికి అర్హుడు. ఎవ్వరూ లేకపోతే గ్రామ పురోహితుడు చేయవచ్చును. ఒకసారి సోదరులు విడిపోతే, విడివిడిగానే శ్రాద్ధ కర్మలు చేయాలి.

రెండవ జామున స్నానం చేసి శుచిగా, దక్షిణ దిక్కు తిరిగి, ఒక వేదికలా వేసి, ఆవుపేడతో అలికి, దాని మీద ఒక ఆకువేసి, దాని మీద దర్భలు వేసి ఆసనాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఆసనం మీద బ్రాహ్మణుని కూర్చోపెట్టాలి. ఆకు చివరి భాగంలో పిండాలు ఉంచడానికి దర్భలు వేయాలి.

ప్రేత యొక్క గోత్రనామాలు చెప్పి, అన్నంతో గాని, పిండితో గాని పిండాన్ని చేసి ఉంచాలి. ఆ పిండాన్ని పూజించాలి. తరువాత దానిని కాకులకు పెట్టాలి. అన్నం, వస్త్రం, జలం ఏవైనా ప్రేత పేరు చెప్పి ఇవ్వాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేసారు.

తొమ్మిది రోజులు చేయాలి

మొదటి రోజు పిండప్రదానం చేసినట్లే తొమ్మిది రోజులు చేయాలి. తొమ్మిదవ రోజున తలంటుకుని బయట స్నానం చేసి, దర్భలను, పేలాలను తీసుకుని, ఇంటికి వచ్చి, వాటిని ఇంట్లో వదలాలి. పదవ రోజున మినుములతో పిండ ప్రదానం చేయాలి. పది రోజులు బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పదకొండవ రోజున వృషోత్సర్జనం చేయాలి. ఎద్దుని దానం చేయాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేసారు.

తరువాత సపిండీకరణం చేయాలి. స్నానం చేసి, చనిపోయిన ప్రేతన్ని అలకాలి. కాళ్లు కడిగి, ఆచమనం చేసి, విశ్వేదేవుని పూజించి, భూమిమీద కూర్చుని ఆచమనం చేయాలి. తరువాత వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులైన పితృ, పితామహ, ప్రపితామహులకు, మృతునికి పిండప్రదానం చేయాలి.

ప్రేత పిండాన్ని మూడు భాగాలుగా చేసి, పితామహాది పిండాలలో వేరువేరుగా కలపాలి. తరువాత పితృ తర్పణం చేసి, అతిథికి భోజనం పెట్టి, దక్షిణ, తాంబూలాలు ఇవ్వాలి. తరువాత కర్మ చేసిన బట్టలు తీసి, కొత్త బట్టలు కట్టుకోవాలి. గొడుగు, చెప్పులు, నూతన వస్త్రాలు, పంచపాత్ర మొదలైనవి బ్రాహ్మణునికి దానమియ్యాలి.

మాసిక శ్రాద్ధం

సపిండీకరణం తరువాత సంవత్సరం వరకు ప్రతి నెల మాసిక శ్రాద్ధం చేయాలి. సంవత్సరం పూర్తికాగానే మొదటి ఆబ్దికం జరిపించాలి. ప్రతి ఆబ్దికంలోను మూడు పిండాలు సమర్పించాలి. గయలో శ్రాద్ధకర్మ చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేసారు.

కుమారుడు లేకపోతే, దగ్గర బంధువులెవరైనా శ్రాద్ధకర్మ చేయవచ్చు. మేనల్లుడు, దౌహిత్రుడు, మామగారు, అల్లుడు, మేనమామ చేయవచ్చు. వారూ కూడా లేకపోతే, ఒక తపస్వి అయిన బ్రాహ్మణుడు చేయవచ్చును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.