Bhadra kalam: భద్ర ఎవరు? ఈ కాలాన్ని ఎలా లెక్కిస్తారు? ఎందుకు ఈ సమయం అశుభంగా చెప్తారు?
Bhadra kalam: హిందూ శాస్త్రం ప్రకారం భద్ర కాలం అశుభమైనదిగా చెప్తారు. అసలు ఈ భద్ర ఎవరు? ఈ కాలాన్ని ఎలా లెక్కిస్తారు. భద్ర కాలంలో ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.
Bhadra kalam: అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ముఖ్యమైన పండుగ రక్షాబంధన్. ఈ ఏడాది ఆగస్ట్ 19వ తేదీ వచ్చింది. అయితే ఈరోజు భద్ర కాలం కూడా వచ్చింది. భద్ర నీడలో రాఖీ కట్టేందుకు అనువైన సమయం కాదు. అసలు ఈ భద్ర ఎవరు? ఈ సమయాన్ని ఎందుకు అశుభమైనదిగా పరిగణిస్తారు? దీని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.
సనాతన ధర్మంలో భద్ర కాలానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఇది అశుభకరమైన సమయంగా పరిగణిస్తారు. భద్ర కాలంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని చెబుతారు.
శని సోదరి భద్ర
మతపరంగా భద్ర శని దేవుడి సోదరి, సూర్య దేవుడి కుమార్తె. శని దేవుడి మాదిరిగానే భద్రకు కూడా అధికమైన కోపం. శివుడు ప్రసాదించిన వారి గర్వంతో హోమాలు, యజ్ఞాలు ఏవి జరగకుండా అడ్డుకుంటూ ఉండేది. దీంతో సూర్య దేవుడి విజ్ఞప్తి మేరకు భద్రను బ్రహ్మ ఆపేందుకు ఆమెను ఆకాశంలో ఉండేలాగా చేశాడు. కానీ కొన్ని రోజులు భూమి మీద మరి కొన్ని రోజులు ఆకాశంలో ఉంటుందని చెప్తాడు. అలా భద్ర భూమి మీద ఉన్న సమయాన్ని భద్రకాలంగా పరిగణిస్తారు.
భద్రకాలాన్ని ఎలా లెక్కిస్తారు?
చంద్రుడు ఉన్న రాశికి అనుగుణంగా భద్ర నివాసం నిర్ణయిస్తారు. కర్కాటకం, సింహం, కుంభం లేదా మీనంలో చంద్రుడు ఉన్నప్పుడు భద్ర భూమిపై నివసిస్తుందని నమ్ముతారు. అలాగే మేషం, వృషభం, మిథునం, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భద్ర స్వర్గంలో ఉంటుంది. కన్య, తుల, ధనుస్సు లేదా మకర రాశిలో ఉన్నప్పుడు భద్ర నివాసం పాతాళంలో ఉంటుందని నమ్ముతారు.
భూమ్మీద భద్ర నివాసం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. పంచాంగాన్ని చూసేటప్పుడు భద్ర ప్రాముఖ్యతను కూడా పరిశీలిస్తారు. భద్రకాలం సుమారు 5 గంటలపైనే ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడం నిషేధం. శుక్లపక్షంలోని చతుర్థి, ఏకాదశి, తృతీయ తిథి, శుక్ల పక్షంలోని దశమి తిథిలో భద్రకాలం శుభప్రదమైనదిగా పరిగణిస్తారు.
భద్రకాలంలో ఏం చేయరు?
భద్ర సమయంలో పుట్టి వెంట్రుకలు తీయడం, గృహప్రవేశాలు చేయడం, వివాహ వేడుకలు, పెళ్ళికి సంబంధించి చర్చలు జరపడం, రక్షాబంధన్ వేడుక, శుభప్రయాణాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంతోపాటు అన్ని రకాల శుభకార్యాలు ఈ సమయంలో నిషిద్ధంగా పరిగణిస్తారు. భద్ర సమయంలో చేసే పనులు అశుభ ఫలితాలు ఇస్తాయని బలంగా విశ్వసిస్తారు. భద్ర కాలంలో ఏ పని తలపెట్టిన నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అవి నష్టాన్ని మిగులుస్తాయని నమ్ముతారు.
భద్ర కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించకూడదు. అలాగే ఉద్యోగంలోనూ చేరకూడదు. ఇది ఆశుభఫలితాలను ఇస్తుంది. అలాగే ప్రయాణాలు చేసేందుకు కూడా ఇది అశుభమైన ముహూర్తం. ఈ సమయంలో ఏదైనా పని గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చెడు ఫలితాలను ఇస్తాయి.
రావణాసురుడి అంతం
రావణాసురుడి సోదరి శూర్పణఖ భద్ర సమయంలోనే తన సోదరుడి చేతికి రాఖీ కట్టింది. అందువల్లే రావణుడి వంశం మొత్తం అంతమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని పండితులు సూచిస్తారు.
ఈ ఏడాది రాఖీ పండుగ కూడా భద్ర నీడలోనే వచ్చింది. మధ్యాహ్నం 1.30 వరకు భద్రకాలం ఉంటుంది. అందువల్ల రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టేందుకు ఉదయం సరైన సమయం కాదు. మధ్యాహ్నం మాత్రమే సోదరి తమ సోదరుడికి రాఖీ కట్టేందుకు అనువైన కాలం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్