ఆధ్యాత్మిక, జ్ఞాన సంపన్నుడు అష్టావక్ర మహర్షి గురించి మీకు తెలుసా?-who is ashtavakra know the significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆధ్యాత్మిక, జ్ఞాన సంపన్నుడు అష్టావక్ర మహర్షి గురించి మీకు తెలుసా?

ఆధ్యాత్మిక, జ్ఞాన సంపన్నుడు అష్టావక్ర మహర్షి గురించి మీకు తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 28, 2024 11:05 AM IST

అష్టావక్ర మహర్షి యొక్క విశిష్టత గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఈ అష్టావక్రుడికి కహోలుడు అనే పేరు కూడా ఉంది.

అష్టావక్రుడు
అష్టావక్రుడు (By Unknown author - https://www.britishmuseum.org/collection/object/A_1880-0-2073, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=22363886)

శరీరంలో ఎనిమిది భాగములు వక్రముగా అనగా వంకరగా జన్మించుట చేత అష్టావక్రుడికి ఆ పేరు వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చగ్రవర్తి శర్మ తెలిపారు. ఈ అష్టావక్రునికి కహోలుడు అని ఇంకొక పేరు. అష్టావక్రుడు గొప్ప విద్యాశక్తిసంపన్నుడైన మహర్షి. తండ్రి ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు. నిరంతర తపోనిరతుడు. వేదవేత్త. ఉద్దాలకుడి చెల్లెలు సుజాతను పెళ్ళిచేసుకున్నారు. ఏకపాదుని దగ్గరకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనం చేస్తూ ఉండేవారు.

శిష్యకోటితో కాలక్షేపం చేస్తూ భార్య సుజాతతో కలసి జీవించసాగారు ఏకపాదుడు. సుజాత గర్భవతి అయ్యింది. అష్టావక్రుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే తన తండ్రి ఏకపాదుడు తన శిష్యులచే నిరంతరము వేదాధ్యయనము చేయించటం విని తండ్రితో ఇలా పలికాడు. ‘తండ్రీ! నిరంతర వేదాధ్యయనముచే శిష్యులను బాధించుచున్నారు. అందువలన వారి ఆరోగ్యము పాడగును’ అని అంటాడు.

ఆమాటలకు ఏకపాదునికి కోపంవచ్చి నా అధ్యాపనమును గురించి వక్రభాష్యం చేశావు కావున నీవు అష్టవక్రములతో పుడుతావు అని తల్లి గర్భమున ఉన్న శిశువును శపించారు. కొంత కాలానికి అష్టావక్రుడు పుట్టకముందే భార్య కోరిక మేరకు ధనార్జన కోసం జనక మహారాజు సభకు వెళ్ళారు. అ సభలో వరుణుని కుమారుడైన ‘వంది’ చేతిలో వాదనలో ఓడిపోయారు. నియమం ప్రకారం ఆ ఏకపాదుడు జలములందు ముంచివేయబడ్డారు.

ఎనిమిది వంకరలతో పుట్టిన అప్టావక్రుడూ తన మేనమామ ఉద్దాలకుడి ఇంటిలో అతని కుమారుడైన శ్వేతకేతువుతో కలసి వేదాభ్యాసము చేసారు. ఒక సందర్భములో శ్వేతకేతు మాటలకు కోపితుడై అష్టావక్రుడు వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళి నా తండ్రి ఎవరు? ఎక్కడ ఉన్నారు? అని అడుగుతారు. దానికి సుజాత ‘నీ తండ్రి ఏకపాదుడు. ధనార్జన కోసం జనకుని రాజ్యమునకు వెళ్ళారు’ అని చెబుతుంది. తత్వజ్ఞాని ఐన అష్టావక్రుడు విషయం గ్రహించి శ్వేతకేతుతో కలిసి జనకుని రాజ్యమునకు వెళ్తారు.

తిన్నగా ఆస్థానము లోపలికి వెళ్ళబోతుంటే ద్వారపాలకులు అడ్డుపడి పిల్లలకు ప్రవేశార్హత లేదని చెపుతారు. వారితో అనేక శాస్త్ర విషయాలు చెప్పేసరికి మారు మాట్లాడకుండా అప్టావక్రునికి లోపలికి వెళ్ళటానికి దారినిస్తారు. అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు దగ్గరకు వెళ్ళి “వంది”తో వాదిస్తానని చెబుతారు. ఇంత చిన్న బాలుడవు వందితో వాదనకు కుదరదు అన్న జనక మహారాజుతో వాదించి తన శక్తి సామర్థ్యాలు తెలియచేశారు.

అష్టావక్రుడు జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత. ఆత్మజ్ఞానాన్ని అందించే సంకీర్తనము, శాంతి, నిర్వేదము, జీవన్ముక్తి మొదలైన విషయాలపైన ఎన్నో వేదాంత విషయ వివరణలు ఈ గ్రంధములో ఉన్నాయి. జనకుడు వందితో వాదనకు అంగీకరించారు. వాద ప్రతివాదనలలో చివరకు వందిని బాలుడైన అష్టావక్రుడు ఓడించారు. జలమజ్జితుడైన తన తండ్రి ఏకపాదుని విడిపించారు.

జనకుడు అష్టావక్రుడి చేత అద్వైత వేదాంత సిద్ధాంత రహస్యములను తెలుసుకున్నారు. తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతో సంతోషించి నదిలో స్నానం చేయించి తన కుమారుని అష్టవంకరలు పోయేటట్లు చేశారు. సుందరాకారము పొందిన అష్టావక్రుడు వదాన్య మహర్షి కుమార్తె ఐన సుప్రభను వివాహమాడి పుత్రులను పొందారు. ఆదర్శప్రాయమైన గృహస్థాశ్రమాన్ని సాగించాక అష్టావక్రుడు పుష్కర తీర్ధములో తపస్సు చేసి మనస్సు పరమాత్మయందు లయం చేసి కృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి మరణించి గోలోకమునకు పోయి మోక్షమును పొందారు.

అష్టావక్రుని గురించి పురాణ కథలు

ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా, ఇతడి రూపమును చూసి రంభాది అప్సరసలు నవ్వుతారు. దీంతో అష్టావక్రుడు వారిని శపిస్తారు. దొంగలచే పట్టుబడుతారని శపిస్తారు. అనంతరము వారు క్షమించమని వేడి నృత్యగీతములను అష్టావక్రుడికి వినిపించారు. అందుకు సంతోషించిన మహర్షి ఏమి కావాలి అని అడుగగా వారందరూ విష్ణుమూర్తితో పొందును కోరారు. వారి కోరిక విన్న అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జన్మించి అతడిని పొందగలరు అని పలుకుతారు.

ఆయన అనుగ్రహం కారణంగా గోపికారూపులై కృష్ణుని భార్యలుగా అవుతారు. అయితే శాపం కారణంగా కృష్ణ నిర్యాణానంతరము కృష్ణుని ఆజ్ఞ ప్రకారం వారిని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతున్నప్పుడు వారు దొంగలచేత పట్టుబడి నగలు తదితర వస్తువులను సర్వము కోల్పోతారు. అంత ధీరుడైన అర్జునుడు దొంగల చేతిలో ఓడిపోయి ఏమీ చేయలేని స్థితికి చేరుతారు.

WhatsApp channel

టాపిక్