పురాణాలలో ఉన్న ఈ చిరంజీవులు ఇప్పటికీ భూమి మీద ఉన్నారు.. ఎక్కడో తెలుసా?-who are the seven immortals in hindu mythology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పురాణాలలో ఉన్న ఈ చిరంజీవులు ఇప్పటికీ భూమి మీద ఉన్నారు.. ఎక్కడో తెలుసా?

పురాణాలలో ఉన్న ఈ చిరంజీవులు ఇప్పటికీ భూమి మీద ఉన్నారు.. ఎక్కడో తెలుసా?

Gunti Soundarya HT Telugu
May 30, 2024 04:16 PM IST

హిందూ పురాణాల ప్రకారం ఏడుగురికి అమరత్వం వరం ఉంది. వారిని చిరంజీవులు అంటారు. ఇప్పటికీ ఆ చిరంజీవులు బతికే ఉన్నారని భూమి మీద నివసిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.

పురాణాలలో ఉన్న చిరంజీవులు వీళ్ళే
పురాణాలలో ఉన్న చిరంజీవులు వీళ్ళే (pixabay)

పురాణాల ప్రకారం ఏడుగురికి అమరత్వం వరం వచ్చిందని చెబుతారు. వారినే చిరంజీవులుగా పిలుస్తారు. ఈ చిరంజీవులు ఇప్పటికీ భూమిపై ఉన్నారని, ప్రజల మధ్య జీవిస్తున్నారని కానీ అందరూ వారిని చూడలేరని అంటారు. ఇంతకీ ఎవరు ఆ చిరంజీవులు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అనేది తెలుసుకుందాం.

హనుమంతుడు

కలియుగంలోనూ హనుమంతుడు జీవించే ఉన్నాడని ఇప్పటికీ చాలామంది నమ్ముతుంటారు. శ్రీరాముడు తన నివాసానికి తిరిగి వెళ్లే ముందు హనుమంతుడికి అమరత్వం వరం ప్రసాదించాడు. వివిధ నమ్మకాల ప్రకారం శ్రీరాముని నామం జపించిన ప్రతి చోటా హనుమంతుడు ఉంటాడు. కానీ గ్రంధాల ప్రకారం హనుమంతుడు గంధమాదమ్ పర్వతాలలో నివసిస్తూ రామనామాన్ని జపిస్తూ ఉంటాడని అంటారు. తన భక్తులు ఎవరైనా అపాయంలో ఉన్న, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడని చెబుతారు. మరికొందరు హిమాలయాలు, కిష్కింద వంటి ప్రాంతాల్లో తిరుగుతుంటాడని అంటారు.

అశ్వథ్థామ

ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వథ్థామ మహాభారత యుద్ధ సమయంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీంతో శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు. ఈ శాపం ప్రకారం అతను కలియుగం ముగిసే అంతవరకు భూమిపై జీవించాల్సి ఉంటుంది. ఆ సమయం వరకు అతను తన గాయాల బాధను, యుద్ధ సమయంలో అతని చర్యల భారాన్ని భరించాల్సి ఉంటుంది. అశ్వథ్థామ అడవులు, నిర్జన ప్రదేశాలలో ముఖ్యంగా నర్మదా నది చుట్టూ తిరుగుతున్నాడని అనేక పురాణాలు కథలు చెబుతున్నాయి.

మహాబలి

మహాబలి రాజు కూడా హిందూ మతంలో అమరత్వం పొందిన చిరంజీవి. ఓనం పండుగ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను సందర్శించే వరం ఇవ్వబడింది. గ్రంథాల ప్రకారం మహాబలి పాతాళంలో ఉన్నాడంటారు. అక్కడే నివసిస్తున్నాడు. కానీ అతని ప్రజలను ఆశీర్వదించడానికి పండుగ సమయంలో భూమిపైకి వస్తాడు.

వేదవ్యాసుడు

మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షి హిమాలయాల్లో ఎక్కడో ఏకాంతంలో నివసిస్తున్నాడని నమ్ముతారు. వేదవ్యాసుడు బద్రీనాథ్ కంటే ముందు బద్ర అనే ప్రాంతంలో మనుషులు చేరుకోలేని ప్రదేశంలో నివసిస్తున్నాడని చెబుతారు. అతను ఇప్పటికీ మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశాలకు వస్తాడని, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అతని ఉనికి ఉంటుందని ప్రజలు విశ్వసిస్తారు.

విభీషణుడు

రావణుడి సోదరుడు విభీషణుడు. శ్రీరాముడి సైన్యంలో చేరి ధర్మం వైపు నిలబడ్డాడు. అందువల్ల అమరత్వం వరం పొందాడు. విభీషణుడు కూడా చిరంజీవుడు. రావణుడి పరాజయం తర్వాత అతనికి లంక పగ్గాలు లభించాయని చాలా మంది నమ్ముతారు.

కృపాచార్య

మహాభారతంలోని గొప్ప ఉపాధ్యాయులు, యోధులలో కృపాచార్యులు ఒకరు. వేదాలను అధ్యయనం చేయడం, బోధించడంలో అంకితభావం ప్రదర్శించడంతో అమరత్వం వరం పొందారు. కృపాచార్య తన ఆదర్శాలకు కట్టుబడి ఉన్న ఏకైక వ్యక్తి. ఎటువంటి దివ్యాస్త్రాలు ఉపయోగించలేదని చెప్తారు. ఎప్పుడు యుద్ధ నియమాలను పాటించాడు. స్థిరంగా నిష్పక్షపాతంగా ఉన్నాడు. కలియుగం చివరి వరకు జీవిస్తాడని కానీ మానవ కంటికి ఎప్పటికీ కనిపించడని నిర్జనమైన ప్రదేశంలో ఉంటాడని చెబుతారు.

పరశురాముడు

ప్రపంచాన్ని అవినీతి క్షత్రియ పాలకుల నుండి విముక్తి కల్పించేందుకు యోధుడైన పరశురాముడు బాధ్యత తీసుకున్నాడు. తన పనిని పూర్తి చేసిన తర్వాత పరుశురాముడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అతను మహేంద్రగిరి పర్వతాలలో ఇతర మారుమూల ఆశ్రమాలలో నివసిస్తూ నిరంతరం తన స్థలాలను మారుస్తూ ఉంటాడని విస్తృతంగా నమ్ముతారు.

WhatsApp channel