గురువులు ఎన్ని రకాలు? అష్టవిధ గురువులు అంటే ఎవరు?-who are ashtavidha gurus in spiritual base ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గురువులు ఎన్ని రకాలు? అష్టవిధ గురువులు అంటే ఎవరు?

గురువులు ఎన్ని రకాలు? అష్టవిధ గురువులు అంటే ఎవరు?

HT Telugu Desk HT Telugu

శాస్త్రాల ప్రకారం గురువులు ఎన్ని రకాలు, అష్టవిధ గురువులు అంటే ఎవరు అనే వివరాలు గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

గురువులు ఎన్ని రకాలు (pixabay)

వేమన శతకం ప్రకారం కాదు గురువు 'క' గుణింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప ముక్తి మార్గమునకు దారిచూపు మూలము గురువురా విశ్వదాభిరామ! వినురవేమ !! దీని ప్రకారము ఆధ్యాత్మిక సాధనకు, ముక్తి మార్గానికి మరియు మోక్షమునకు దారి చూపించేటటువంటి గురువే ఉత్తమ గురువు అని కూడా పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఇలా మోక్ష మార్గాన్ని జగత్తుకు అందించటం చేత శంకరభగవత్సాదులవారు అనగా ఆది శంకరాచార్యులవారు జగత్‌ గురువు అని చిలకమర్తి తెలిపారు. కృష్ణం వందే జగద్గురుమ్‌ అని కృష్ణుడు భగవద్గీత బోధించడం ద్వారా శ్రీకృష్ణుడు కూడా జగద్గురువు అయ్యాడు అని చిలకమర్తి తెలిపారు. సనాతన ధర్మం ప్రకారం ప్రతీ మానవుడికి తన జీవితములో అష్టవిధ గురువులు (8 రకాల గురువులు) ఉంటారని పంచాంగకర్త చిలకమర్తి తెలిపారు.

అష్టవిధ గురువులలో కారణ గురువులను పొందడం, కారణ గురువును పట్టుకోవడం మరియు ఆయన ద్వారా విద్యను పొంది ప్రకృతి మాయా అనేటువంటి వాటిని తొలగించుకుని ముక్తి మార్గంలోకి ప్రవేశించి మోక్షమును పొందువాడు ధన్యుడు అని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి తెలిపారు. అష్టవిధ గురువులు ఈవిధముగా ఉన్నారు.

1. బోధక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్దార్థములను మాత్రము చక్కగ బోధించు గురువు బోధక గురువు.

2. వేదక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్ధార్థములు చక్కగ బోధించు తత్త్వమును దర్శింపజేయువాడు వేదక గురువు.

3. నిషిద్ధ గురువు : వశ్యము, ఆకర్షణము మొదలగు మంత్రములచేత ఇహలోకమందును పరలోకమందును సుఖదుఃఖముల నిచ్చువాడు నిషిద్ధ గురువు.

4. కామ్యక గురువు : పుణ్యకర్మములను చేయుమని చెప్పి పుణ్యకర్మలు చేయించి తద్వారా ఇహలోక పరలోక సుఖములనిచ్చువాడు కామ్యక గురువు.

5. సూచక గురువు : వేదాంత శాస్త్రముల అంతరార్థమును తెలుపుచు జ్ఞానమును కలుగజేసి తద్వారా శమ, దమ, ఉపరతి, తితీక్ష్మ శ్రద్ధ సమాధానము అను షడ్గుణములను కలుగజేసి ఆత్మావలోకన చేయుటకు సూచించువాడు సూచక గురువు.

6. వాచక గురువు : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధి గోచరా చిత్తాహంకారంబులనెడి అంతరింద్రియముల యొక్కయు విషయములగు శబ్ద స్వర్ణ రూప రస గంధంబులు, వచన దాన గమనాగమన విసర్జన ఆనందములు, సంకల్ప వికల్ప నిశ్చయ చంచల కర్తృత్వములయందు వైరాగ్యము గలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయమగునట్లు చేయు మహానుభావుడు వాచక గురువు.

7. కారణ గురువు : అహంబ్రహ్మాస్మి యను మొదలుగా గల వాక్యములను బోధించి జీవేశ్వరైక్యమును తేటతెల్లముగ తెలిపి జీవన్ముక్తి యనుభవమును కలుగజేసిన పరమపురుషుడు కారణ గురువు.

8. విహిత గురువు : శిష్యునికి గల సకల సంశయములను నివృత్తి చేసి ఆ సచ్చిష్యుని యేమాత్రము సందేహము లేనివానిగా జేసి తద్వారా విదేహమూర్తి కైవల్యము నిచ్చునట్టివాడు విహిత గురువు. వానినే సాక్షాత్తు పరమశివుడనియు చెప్పనగును. అట్టివాని వర్ణించుట కాదిశేషునికైన నలవిగాదు. కాబట్టి బ్రహ్మవిద్యా ప్రవీణులయొద్ద తేరి రహస్యములను తెలిసికొనవలెను. కుమ్మరవాడు ఎంతటి తెలివిగలవాడయినను సాధనములైన దండము, చక్రము, మృత్తికయు లేక కుండలు చేయలేనట్లు ఎంత సూక్ష్మబుద్ధి గలవానికిని సాధన చతుష్టయ సంపత్తి లేక బ్రహ్మజ్ఞానము కలుగనేరదు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000