Radha krishna photo: రాధాకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెట్టుకున్నారంటే మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది-which direction is best for hanging radha krishna love photo as per vastu shastram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Radha Krishna Photo: రాధాకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెట్టుకున్నారంటే మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది

Radha krishna photo: రాధాకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెట్టుకున్నారంటే మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది

Gunti Soundarya HT Telugu
Aug 24, 2024 11:18 AM IST

Radha krishna photo: కలహాలు లేని ప్రశాంతమైన దాంపత్య జీవితం కావాలంటే మీ బెడ్ రూమ్ లో రాధాకృష్ణుడి ఫోటో పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ ఫోటో ఏ దిశలో పెట్టుకోవాలి? ఇది ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

రాధాకృష్ణుడి ఫోటో ఏ దిశలో పెట్టుకోవాలి?
రాధాకృష్ణుడి ఫోటో ఏ దిశలో పెట్టుకోవాలి? (pixabay)

Radha krishna photo: ఆచంచలమైన ప్రేమకు రాధాకృష్ణులు చిహ్నంగా భావిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమ పెరగడం కోసం పడక గదిలో రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ఆర్థిక సమస్యల నుంచి బయట పడటం కోసం, వైవాహిక జీవితంలో ఇబ్బందులను అధిగమించేందుకు, ఇంట్లో సుఖ శాంతులు పొందటం కోసం దేవుళ్ళ చిత్ర పటాలను పెట్టుకుంటారు.

దేవుళ్ళ విగ్రహాలు లేదా చిత్ర పటాలు పెట్టుకునేందుకు సరైన వాస్తు నియమాలు పాటించాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యేందుకు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేందుకు రాధాకృష్ణుడి చిత్రాన్ని ఇంట్లోని ఏ దిశలో పెట్టుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

రాధాకృష్ణుడి ప్రేమ అంకిత భావం, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. అటువంటి పవిత్రమైన ఈ ఫోటో మీరు పడకగదిలో పెట్టుకోవచ్చు. సాధారణంగా బెడ్ రూమ్ లో ఎటువంటి దేవుని విగ్రహాలు ఉంచకూడదు. కానీ పడకగదిలో మాత్రం రాధాకృష్ణుడి చిత్రాన్ని పెట్టుకోవచ్చు. ఇది ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రాధాకృష్ణుడి పెయింటింగ్ గదిలో పెట్టుకోవడం అనేక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

ఈ దిశ ముఖ్యం

రాధాకృష్ణుడి చిత్రపటాన్ని ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదం. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవలు సద్దుమణుగుతాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అయితే పడకగదిలో బాత్ రూమ్ గోడ మీద మాత్రం పెట్టుకోకూడదు. అయితే ఈ ఫోటోకు పూజలు చేయకూడదు. రాధాకృష్ణుడి ఫోటోలో వాళ్ళు ఇద్దరూ తప్ప వేరే దేవతలు, గోపికలు ఉండకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. రాధాకృష్ణుడి ఫోటో వైపు మీరు పాదాలు పెట్టి నిద్రించకూడదు. ఇలా చేస్తే ఇంట్లో పేదరికం వస్తుందని అంటారు.

కొత్తగా పెళ్ళయిన జంట తమ బెడ్ రూమ్ లో ఈ పెయింటింగ్ వేలాడదీస్తే వైవాహిక జీవితంలో మీకు అపారమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. రాధ, కృష్ణుడు ఇద్దరూ స్వయంగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అవతారాలు. ఈ చిత్రాన్ని వేలాడదీయడం వల్ల జంటల మధ్య ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి. అదే అవివాహిత స్త్రీ లేదా పురుషుడు ఈ చిత్ర పటాన్ని పెట్టుకుంటే మీకు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి వస్తుంది.

గర్భిణీలు అయితే ఈ ఫోటో పెట్టుకోండి

గర్భిణీలు వీలైనంత వరకు చిన్న పిల్లల ఫోటోలు చూడాలని చెప్తారు. అందుకే వీరి బెడ్ రూమ్ లో చిన్ని కన్నయ్య ఫోటో పెట్టుకోవచ్చు. ఈ ఫోటోను నిరంతరం చూస్తూ ఉండటం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణుడి బాల రూపం చూడటం వల్ల కడుపులోని బిడ్డ మీద దీని ప్రభావం కూడా ఉంటుంది.

గీతను బోధిస్తున్న ఫోటో

శ్రీకృష్ణుడు ఆర్జనుడికి గీత బోధిస్తున్నట్టుగా ఉన్న చిత్ర పటం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ ఫోటోను ఇంట్లో ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగం, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు అధిగమించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంట్లో సంతోషం, శ్రేయస్సు నిలుస్తాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్