విద్యార్థులు చదువులో రాణించాలంటే ఏ దైవాన్ని ప్రార్థించాలి?
Overcome exam fear: పరీక్షల సమయం ఆసన్నమైంది. కొంతమంది విద్యార్థులు ఎంత చదివినా కూడా గుర్తు ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు విద్యలో రాణించాలంటే ఈ దైవాలని ప్రార్థించాలని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నేటి ఆధునిక జీవితంలో విద్య, ఉద్యోగం లేదా వ్యాపారం ప్రతీ మానవుని జీవన విధానంలో ఒక భాగంగా మారింది. ఆధ్యాత్మిక కాలంలోను అక్షరాస్యత, నిరక్షరాస్యత అనే విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం విద్యకు సారకత్వం వహించేటటువంటి గ్రహాలలో బుధ, గురు, శుక్రులు చాలా ప్రాధాన్యమైనవని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పాప గ్రహాలైనటువంటి శని, రాహువులు కూడా విద్యకు సారకత్వం వహిస్తాయని చిలకమర్తి తెలిపారు. జ్ఞానవైరాగ్యాలతో కూడినటువంటి విద్య పొందటానికి శాస్త్ర, తత్త్వ , సైన్స్, సాంకేతం, మీడియా, పుస్తక రంగాలు, టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యలు పొందటానికి బృహస్పతి కారణం. వ్యాపార, వాణిజ్య, మేనేజ్‌మెంట్ స్పెక్యులేషన్ వంటి విద్యలో ఉన్నతి పొందడానికి బుధగ్రహం కారకుడిగా వ్యవహరిస్తాడు.
మెడికల్, సైన్స్, డాక్టర్, ఆయుర్వేదం, ఆరోగ్యం, సినిమా, రాజకీయ రంగాలకు, విలాస, భోగ వ్యాపారాలకు శుక్ర గ్రహం కారకుడిగా ఉంటాడు. సైనిక, ప్రభుత్వరంగ, నౌకాదశ, ఆయిల్, గ్యాస్, ఇంధనం, కర్షక, వ్యవసాయ, సెక్యూరిటీ, పోలీస్ వంటి విద్యలకు శని గ్రహం కారణం. యుద్ధ విద్య, విమాన, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్రానిక్స్, మంత్ర శాస్తం వంటి వాటికి రాహు గ్రహ విద్యకు సారకత్వం వహిస్తుందని చిలకమర్తి తెలిపారు.
విద్యకు సంబంధించిన ముఖ్య గ్రహాలు వాటి విశేషత గురించి తెలుసుకున్నారు. ఆ గ్రహాల ప్రభావం చేత విద్య అనుకూలంగా లభించడం కోసం ఆరాధించి విద్యలో రాణించాలంటే ప్రార్ధించవలసిన దైవాలు సరస్వతీదేవి, మహావిష్ణువు, హయగ్రీవుడు, దక్షిణామూర్తి అని చిలకమర్తి తెలిపారు. బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, మహావిష్ణువును పూజించటం చేయాలి.
గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించటం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే మంచిది. శుక్రవారం రోజు సరస్వతీదేవిని ప్రార్ధించడం, సరస్వతీ నామాలను పఠించడం, ఆదివారం రోజు హయగ్రీవ ఉపాసన చేయడం వల్ల విద్యార్థులు విద్యలో రాణిస్తారని ఉన్నత విద్య వంటివి పొంది జీవితంలో స్టిరపడతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.