Vastu tips for steps: ఇంట్లో మెట్లు ఎక్కడ, ఎలా ఉండాలి? ఎన్ని ఉంటే ఇంటికి మంచి చేస్తుంది?
Vastu tips for steps: ఇంటి మెట్లకు సంబంధించిన అనేక ముఖ్యమైన చిట్కాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. మెట్లను నిర్మించేటప్పుడు వాస్తుతో పాటు కొన్ని ప్రత్యేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని నమ్ముతారు. మెట్లు సరైన దిశలో నిర్మించినప్పుడే ఆ ఇంటికి క్షేమాన్ని ఇస్తుందని అంటారు.

Vastu tips for steps: ఇంట్లోకి ప్రవేశించడానికి ముందుగా ఉండేవి మెట్లు. ఇవి ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఇంటిని నిర్మించేటప్పుడు ఏ విధంగా వాస్తు నియమాలు చూస్తారో అదే విధంగా మెట్లు విషయంలో కూడా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
మెట్ల నిర్మాణం కోసం వాస్తులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మెట్లు వేసేటప్పుడు ఈ వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని నమ్ముతారు. తప్పు దిశలో మెట్ల నిర్మాణం ఇంట్లో ప్రతికూలతను పెంచుతుందని, ఇంట్లో వాస్తు దోషాలను సృష్టిస్తుందని చెబుతారు. అందువల్ల మెట్లకు సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను విస్మరించకూడదు.
మెట్లకు సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా కుటుంబ సమస్యలను అధిగమించవచ్చు. ఏ దిశలో మెట్లు ఉంటే ఇంటికి కలిసి వస్తుంది. ఏ దిశలో మెట్లు ఏర్పాటు చేయకూడదు. ఎన్ని మెట్లు ఉండేలా చూసుకోవాలి. వాటికి ఎలాంటి రంగులు ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
మెట్లకు సంబంధించిన వాస్తు చిట్కాలు
వాస్తు ప్రకారం మెట్ల వెడల్పు ఒక చేతి నుండి మూడు చేతుల మధ్య ఉండాలి. అదే సమయంలో మెట్లు ఎల్లప్పుడూ 11, 13, 15, 17 లేదా 21 వంటి బేసి సంఖ్యలను కలిగి ఉండాలి. ఈశాన్య మూలలో మెట్లు నిర్మించడం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతిలో మెట్లు నిర్మించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
కొంతమంది అష్ట వంకర్లుగా కట్టేసుకుంటారు. కానీ వాస్తులో వంకర మెట్ల నిర్మాణం అశుభం. మెట్ల కింద పూజ గదిని నిర్మించవద్దు. వాస్తు ప్రకారం విరిగిన మెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి. కాబట్టి వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ ఇంటి మధ్యలో మెట్లు నిర్మించకూడదు అది అశుభంగా పరిగణిస్తారు. అలాగే ప్రధాన ద్వారం నుంచి మెట్లు చూడటం కూడా మంచిది కాదు.
అంతే కాకుండా ఇంట్లో బ్రహ్మ స్థానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ స్థలంలో మెట్లు నిర్మించకూడదు. వాస్తు ప్రకారం టాయిలెట్, స్టోర్ రూమ్ లేదా డస్ట్‌బిన్ వంటి ప్రతికూల శక్తి ఉన్న వస్తువులు, గదులు మెట్ల క్రింద ఉంచకూడదు. ఈ మధ్య కాలంలో చాలా మంది గేటు దగ్గర ఉండే మెట్ల కింద టాయిలెట్ నిర్మించుకుంటున్నారు. కానీ అది ఇంటికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
మెట్ల ప్రారంభంలో, చివర తలుపులు వాస్తు నియమాల ప్రకారం ఉండాలని నమ్ముతారు. దిగువ తలుపు ఎగువ తలుపు కంటే సమానంగా లేదా కొంచెం పెద్దదిగా ఉండాలి. మెట్లకు వేసే రంగులు కూడా ముఖ్యం. వాటికి తెలుపు, లేత గోధుమ రంగు, బూడిద రంగు వేసుకోవడం మంచిది. ఎరుపు, నలుపు వంటి వాటిని నివారించాలి. ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తాయి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్