Vaikunth Chaturdashi:ఈ సారి వైకుంఠ చతుర్దశి ఎప్పుడు జరుపుకోవాలి- దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం
Vaikunth Chaturdashi: ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం వైకుంఠ చతుర్దశి నవంబర్ 14న వచ్చింది. ఈ రోజు విష్ణువు మరియు శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మిక.
కార్తీకమాసం వచ్చిందంటే ప్రత్యేక పూజలు, దీపారాధనలకు కొదవే ఉండదు. ఈ మాసంలో దాదాపు అన్ని రోజులు ప్రత్యేక పూజలు, వ్రతాలకు శుభప్రదమైనవిగా వస్తుంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు. ఈ ఏడాది వైకుంఠ చతుర్దశి నవంబర్ 14న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీమహా విష్ణువు మరియు పరమశివుడి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల ప్రకారం.. వైకుంఠ చతుర్దశి రోజున విష్ణువును, శివుడిని పూజించడం వల్ల భక్తులకి స్వర్గప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే చివరికి మహావిష్ణువు నివాసంలో స్థానం లభిస్తుందని చెబుతుంటారు.
ప్రతి ఏటా వైకుంఠ చతుర్ధశి రోజున పుణ్యకార్యాలు, దానధర్మాలు, యజ్ఞాలు వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు అందుతాయి. ఈ రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పరమశివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రాలను, విష్ణు మూర్తికి తామర పువ్వులను సమర్పించే ఏకైక రోజు వైకుంఠ చతుర్దశి. ఈ ఏడాది వైకుంఠ చతుర్దశి జరుపుకునేందుకు శుభ సమయం ఏంటో తెలుసుకుందాం..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు జరుపుకోవాలి?
ద్రిక్ పంచాంగం ప్రకారం, కార్తీక మాసం శుక్ల పక్షంలో చతుర్దశి తిథి నవంబర్ 14 2024న ఉదయం 09:43 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నవంబర్ 15 2024 తేదీన సాయంత్రం 06:19 గంటలకు ముగుస్తుంది. కనుక ఈ సమయంలో నవంబర్ 14న వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు.
వైకుంఠ చతుర్దశి జరుపుకునే శుభ యోగాలు:
ఈ సంవత్సరం వైకుంఠ చతుర్దశిని మూడు శుభ యోగాలలో జరుపుకుంటారు. ఈ రోజున సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం ఏర్పడతాయి.
సిద్ధి యోగం - ఉదయం 06:35 నుండి ఉదయం 11:30 గంటల వరకు
సర్వార్థ సిద్ధి యోగం - ఉదయం 06:35 నుండి 12:33 వరకు, నవంబర్ 15
రవియోగం - ఉదయం 06:35 నుండి 12:33 వరకు, నవంబర్ 15
వైకుంఠ చతుర్దశి ప్రాముఖ్యత:
హరిహరులిద్దరికీ ఒకే సారి పూజించడం చాలా అరుదుగా జరుగుతుంది. పురాణాల ప్రకారం.. విష్ణువు మరియు శివుడిని వైకుంఠ చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలలతో పూజించాలి. ఈ రోజున భగవద్గీతతో పాటు శ్రీ సూక్త పారాయణం చేస్తే శుభప్రదమని భక్తులు నమ్ముతారు. ఈ తిథిన శ్రీమహావిష్ణువు యొక్క మంత్రం మరియు స్తోత్రాన్ని పఠించడం ద్వారా స్వర్గ ప్రాప్తిని పొందుతాడని నమ్ముతారు. ముఖ్యంగా తామర పువ్వులతో విష్ణుమూర్తిని పూజిస్తే ఆయన సంతోషిస్తాడని, భక్తులను మనసారా ఆశీర్వదిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చని చెబుతుంటారు. అలాగే శివ నామ జపం చేస్తూ బిల్వ పత్రాలతో ఆరాధన చేస్తే కోరిన కోరికలు తీరడమే కాకుండా ఐశ్యర్యం, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా సత్యం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వాటిని దత్తత తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణుల సలహా తీసుకోవాలి.
టాపిక్