Vratam: ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి? ఈ వ్రత విధి విధానాలు ఏంటి?
Vratam: ఏడు శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి? ఈ వ్రత ఆచార విధి విధానాలు ఏంటి? ఆచరించాల్సిన పద్ధతులు గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ చక్కగా తెలియజేశారు.
Vratam: ఏడు శనివారముల వ్రతం చేయాలనుకుంటే ఆరోజు ముఖ్యముగా వారము శనివారము అయి ఉండాలి. శనివారం ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ అయినచో మంచిది. శనివారం మాసశివరాత్రి, పుష్యమీ నక్షత్రము అయినచో మంచిది. శనివారం అనురాధా నక్షత్రము అయినచో మంచిది.

శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రము అయినచో మంచిది. శనివారం అమావాస్య తిథి అయినచో మంచిది. శనివారం శ్రవణా నక్షత్రము అయినచో మరీ మంచిదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఏడు శనివారములు వ్రతం ఎవరు ఆచరించాలి?
ఏలినాటి శని జరుగుచున్నవారు, అర్థాష్టమ శని జరుగుచున్నవారు, అష్టమ శని జరుగుచున్నవారు (గోచారరీత్యా)(జాతకరీత్యా), శని మహర్ధశ జరుగుచున్నవారు, శని అంతర్దశ జరుగుచున్నవారు (జాతకరీత్యా), శని విదశ జరుగుచున్నవారు (జాతకరీత్యా), మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన, లగ్న జాతకులు చేస్తే చాలా మంచిది.
మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశి జాతకులు ఆచరిస్తే చాలా మంచిది. జాతకరీత్యా లగ్నాత్తు అష్టమ శని ఉన్నచో చేసిన చాలా మంచిది. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది. ఎక్కువగా కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది అని చిలకమర్తి తెలిపారు.
శ్రీ ఏడుకొండలస్వామి వారి ఏడు శనివారముల వ్రతం నియమాలు
ఏ వయస్సులో ఉన్నవారైన స్త్రీలు, పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చును. శనివారం తెల్లవారకముందే తలస్నానం చేయాలి. 7 శనివారములు తులసీమాల ధరించవలెను. పగలు నిద్రపోరాదు. మధ్యాహ్నం భోజనం చేయరాదు. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ధరించవలెను. శనివారం ఉదయం 6గం. నుండి 7 గం. లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలి. అలానే సాయంత్రం 6గం. నుండి 7 గం. లోపుగా సాయంత్రం వ్రతము ప్రారంభించాలి.
ఉదయం పూజకు నల్లని వస్త్రములు ధరించి చేయాలి. సాయంత్రం పూజకు మనము పసుపు వస్త్రములు ధరించి చేయాలి. ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి (నువ్వులతో) ఏడు ఉండలు నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం, మధ్యాహ్నం భోజనం చేయరాదు. సాయంత్రం వ్రతమునకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు 7 నైవేద్యంగా సమర్పించాలి. మగవారు 7 శనివారములు ఎటువంటి ఆటంకములు లేకుండా ఆచరించాలి.
స్త్రీలు అయినచో ముఖ్యముగా ఎనిమిది వారములు ఆటంకములు లేకుండా ఆచరించాలి. ఏ శనివారము అయినా వ్రతము ప్రారంభించవచ్చును. ఉదయం నిరాహారముగా ఉండాలి. స్త్రీలకు ఆటంకము కలిగిన ఎడల ఆ వారము మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చును. సాయంత్రం వ్రతము కాగనే ఒక అతిథిని పిలిచి (ఎవరయినా ఫర్వాలేదు) భోజనమును పెట్టవలెను. ఆహ్వానించిన అతిథికి అరటి ఆకులోగాని, విస్తరాకులో భోజనము పెట్టవలెను.
ముందుగా స్వామివారి తీర్ధము, ప్రసాదము అతిథికి సమర్పించాలి. 7 శనివారములు ఇంటిలో వ్రతం చేసిన తరువాత 7 వ్రత పుస్తకములు ఏడుగురు స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో, దక్షిణతో తాంబూలములో ఉంచి సమర్పించవలెనని చిలకమర్తి తెలియచేశారు.
ఉదయం వ్రత విధానము :
1) తలస్నానం
2) నల్లటి వస్త్రములు తిరునామం, తులసి మాల సాయంత్రం
(1) మామూలు స్నానం 2) పసుపు వస్త్రములు తిరునామం తులసి మాల ధరించాలి.
3) ఉదయం 6 గంటల లోపు, సాయంత్రం 7 గంటల లోపు పూజ చేయాలి.
4) చిమ్మిలి ఉండలు (నువ్వులతో)
5) మధ్యాహ్నం భోజనం చేయరాదు
6) నల్లటి ద్రాక్ష 1 1/4 కేజి
7) 7 ప్రమిదలలో 7 రంగుల వత్తులు కలిపి 7 దీపారాధనలు
8) నువ్వులనూనెతో దీపారాధన
9) సాయంత్రం అతిథిని భోజనమునకు ఆహ్వానించాలి. ఉదయం అవసరంలేదు.
10)వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవింద నామాలు, వేంకటేశ్వర స్తోత్రము, వేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రము, శనిధ్యాన శ్లోకం, శని స్తోత్రము, శని సప్తనామావళి పారాయణం చేయాలి
11) 7 అగరబత్తిలు సాంబ్రాణి ధూపం వేయాలి
12) నైవేద్యానికి కొబ్బరికాయలు
13) ఉదయం కలశస్థాపన చేయాలి
14) ఉదయం పూజ మాత్రమే
15) పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు అని చిలకమర్తి తెలియజేశారు.
సాయంత్రం :
1) మామూలు స్నానం
2) పసుపు వస్త్రములు తిరునామం తులసి మాల ధరించాలి.
3) సా 6గం. నుండి 7 గం. లోపుగా వ్రతము
4) ఏడు శనగ పిండి లడ్డులు, చక్కెర లడ్డూలు
5) వ్రతము అయిన పిదప భోజనము చేయవచ్చును
6) 7 అరటిపండ్లు
7) రెండు ప్రమిదలలో 7 నల్లటి వత్తులతో దీపారాధన
8) నువ్వుల నూనెతో దీపారాధన
9) వ్రతమునకు అతిథిని ఆహ్వానించవలెను
10) విష్వక్సేనారాధన, షోడశోపచార పూజ, అధాంగపూజ, వేంకటేశ్వర స్వామి అష్టోత్తరం, శ్రీలక్ష్మీ పద్మావతి అష్టోత్తరములు, మంగళ హారతి, వ్రతకథ పారాయణం చేయాలి
11) 7 అగరబత్తిలు సాంబ్రాణి ధూపం
12)నైవేద్యంగా వండిన భోజన పదార్ధములు
13) సాయంత్రం మళ్లీ కలశస్థాపన చేయనవసరం లేదు.
14) సాయంత్రం అక్షతలు, పసుపు పువ్వులు కావాలి.
15) వ్రతము అయిన పిదప వండిన పదార్థములు స్వీకరించగలరు. పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు
16) సాయంత్రం వ్రత విధాన పూజచేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చరక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్