Sita navami 2024: ఈ ఏడాది సీతా నవమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలు ఏంటి?-when is sita navami this year what is its importance and rules to follow ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sita Navami 2024: ఈ ఏడాది సీతా నవమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలు ఏంటి?

Sita navami 2024: ఈ ఏడాది సీతా నవమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలు ఏంటి?

Gunti Soundarya HT Telugu

Sita navami 2024: ఈ ఏడాది సీతానవమి మే 16వ తేదీన వచ్చింది. ఆరోజు భార్యాభర్తలు ఉపవాసం ఉండి ఆచారాలు పాటించడం వల్ల వైవాహిక జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి.

సీతా నవమి 2024 ఎప్పుడు వచ్చింది? (pinterest)

Sita navami 2024: మత విశ్వాసాల ప్రకారం వైశాఖ మాసం తొమ్మిదో రోజున సీతా దేవి జన్మించిందని అంటారు. సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమి లేదా జానకి నవమి అని కూడా పిలుస్తారు.

పురాణాల ప్రకారం అమ్మవారికి 108 రూపాలు ఉన్నాయి. వీరిలో సంపద, శ్రేయస్సు కలిగిన దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. త్రేతాయుగంలో దుఖం, కరువు కాటకాలు, అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న సమస్త జీవరాశుల సంక్షేమం కోసం లక్ష్మీదేవి వైశాఖ మాసం తొమ్మిదో రోజున మిథిలా నగరంలో సీతాదేవిగా అవతరించిదని చెబుతారు. శ్రీరామనవమి వచ్చిన నెల రోజుల తర్వాత సీతా నవమి వస్తుంది. ఈ రెండూ పండుగలు నవమి తిథి రోజునే రావడం విశేషం.

ఈ ఏడాది సీతా నవమి మే 16వ తేదీ వచ్చింది. సీతాదేవిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్హు కోసం ఈరోజు ఉపవాసం చేస్తారు. సంతాన ఉత్పత్తికి, స్వచ్ఛతకు, పరిశుభ్రతకు సీతాదేవి ప్రతీకగా భావిస్తారు. సకల జీవరాశులకు తల్లి సీతామాత అని భక్తులు నమ్ముతారు. ఆమె తన భక్తులకు సంపద, ఆరోగ్యం, తెలివితేటలు, శ్రేయస్సు మొదలైన వాటిని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

సీతా నవమి శుభ సమయం

నవమి తిథి ప్రారంభం మే 16 ఉదయం 6. 22 గంటల నుంచి

తిథి ముగింపు మే 17 ఉదయం 8:48 గంటలు.

శుభ సమయం ఉదయం 10.56 గంటలనుంచి మధ్యాహ్నం 1.39 గంటల వరకు ఉంది.

శుభకరమైన యోగాలతో సీతా నవమి

ఈ ఏడాది సీతా నవమి రెండు అద్భుతమైన యోగాలతో జరుపుకోనున్నారు. ఉదయం 8.23 గంటలకు ధ్రువ యోగం ఏర్పడుతుంది. అలాగే సాయంత్రం 6.14 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5. 29 గంటల వరకు రవి యోగం ఉంది. అది మాత్రమే కాకుండా ఉదయం నుంచి సాయంత్రం 6.14 గంటలవరకు మాఘ నక్షత్రం ఉంటుంది. తర్వాత పూర్వా ఫాల్గుణి నక్షత్రం వస్తుంది.

సీతా నవమి రోజు పాటించాల్సిన నియమాలు

సీతా నవమి రోజు ఉపవాసం ఉండటం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉంటారు. భార్యాభర్తలు కలిసి సీతానవమి ఉపవాసం ఆచరించి పూజ చేయడం వల్ల వైవాహిక జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కలహాలు, అపార్థాలు తొలగిపోతాయి. పూజ సమయంలో ఓం సీతాయై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్దలతో పఠించాలి.

సీతా నవమి రోజు సీతాదేవితో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిమో పూజిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, బీహార్ లోని సీతా సమితి, భద్రాచలం తమిళనాడులోని రామేశ్వరంలో సీతా నవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సీతా నవమి రోజు శ్రీరామ దర్బార్ చిత్ర పటాన్ని ఉంచి పూజ చేయొచ్చు. అందులో సీతా దేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి. కొన్నిచోట్ల రామ దర్భార్ విగ్రహాన్ని రథంలో అలంకరించి శోభా యాత్ర నిర్వహిస్తారు.