Diwali festival: 2024 లో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది?-when is diwali festival in 2024 what is the significance of diwali ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali Festival: 2024 లో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది?

Diwali festival: 2024 లో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది?

Gunti Soundarya HT Telugu
Published Dec 27, 2023 11:28 AM IST

Diwali: చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చిందంటే..

దీపావళి పండుగ
దీపావళి పండుగ (pixabay)

Diwali: హిందువుల ప్రధాన పండుగల్లో దీపాల పండుగ దీపావళి ఒకటి. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కలిసి సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రామాయణంలోను దీపావళి పండుగ గురించి ప్రస్తావించారు. పద్నాలుగేళ్ల వనవాసం పూర్తి చేసుకుని, రావణాసురిడిని సంహరించి శ్రీరాముడు అయోధ్య చేరిన ఆనందంతో ఈ పండుగని జరుపుకుంటారు.

దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. 2024 లో దీపావళి పండుగ నవంబర్ 1వ తేదీ వచ్చింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు దీపావళి పండుగ ఉత్సవాలు జరుగుతాయి. ధనత్రయోదశితో మొదలైన ఈ పండుగ బాయ్ ధూజ్ తో ముగుస్తుంది.

ధనత్రయోదశి

దీపావళి పండుగ ప్రారంభం రోజు ధన త్రయోదశి జరుపుకుంటారు. ఆ రోజున కుబేరుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. 2024 లో ధన త్రయోదశి అక్టోబర్ 29 న వచ్చింది. ఈరోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ధంతేరాస్ అని కూడ పిలుస్తారు. ఇంటిని చక్కగా శుభ్రం చేసి సామాన్లు అన్ని శుభ్రం చేసుకుంటారు. కొత్తగా కొనుగోలు చేసిన బంగారు, వెండి వస్తువులు పూజలో పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఆరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారని చెబుతారు.

చోటీ దీపావళి

చోటీ దీపావళినే నరక చతుర్ధశి అని కూడా పిలుస్తారు. భూదేవి, వరాహ స్వామికి నరకాసురుడు జన్మిస్తాడు. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. చావు లేదనే గర్వంతో ముల్లోకాల మీద ఆధిపత్యం చేయాలని చూశాడు. నరకాసురుడి బాధలు భరించలేక దేవతలు అందరూ వెళ్ళి శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాళ్ళ మొర ఆలకించిన విష్ణుమూర్తి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరించేలా చేస్తాడు. నరకాసుర సంహారంతో అందరూ సంతోషంగా దీపావళి చేసుకుంటారు. చీకటిని పారద్రోలుతూ వెలుగు తెచ్చే పండుగగా, చెడు మీద మంచి విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారు. ఈరోజు హనుమంతుడిని కూడా పూజిస్తారు.

గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్

చోటీ దీపావళి తర్వాత గోవర్ధన్ పూజ చేస్తారు. ఆ మరుసటి రోజు భాయ్ ధూజ్ నిర్వహిస్తారు. 2024 లో నవంబర్ 2వ తేదీన గోవర్దన్ పూజ జరిపితే, నవంబర్ 3 న భాయ్ ధూజ్ చేస్తారు. శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఒక వేలితో ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గోవర్థన్ పూజ చేస్తారు.

గోవర్థన పూజ చేసిన తర్వాత భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఉత్తర భారతీయులు ఈ పండుగ ఎక్కువగా జరుపుకుంటారు. దీనికి ఉన్న మరొక పేరు భగినీ హస్త భోజనం పేరుతో ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ రోజు సోదరులకి తమ సోదరీమణులు స్వయంగా తమ చేత్తో వంట చేసి తినిపిస్తారు. అందుకు ప్రతిగా సోదరులు తమ సోదరీమణులకి బహుమతులు ఇస్తారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా దీన్ని జరుపుకుంటారు.

Whats_app_banner