సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడు? మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని ఎందుకు అంటారు? విశేష ఫలితాల కోసం ఏం చేయాలి?
షష్టి నాడు కుమారస్వామిని ఆరాధిస్తే నాగ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇలా ఉపవాసం ఉండి పూజ చేస్తే జ్ఞానం కలుగుతుంది. కుజ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
సుబ్రహ్మణ్య స్వామికి వివిధ పేర్లు ఉన్నాయి. షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి ఇలా అనేక పేర్లతో సుబ్రమణ్య స్వామి వారిని పిలుస్తూ ఉంటాము. పంచమినాడు ఉపవాసం చేసి. షష్టి నాడు కుమారస్వామిని ఆరాధిస్తే నాగ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇలా ఉపవాసం ఉండి పూజ చేస్తే జ్ఞానం కలుగుతుంది. కుజ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.
ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడు వచ్చింది?
మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. ఈ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్టి డిసెంబర్ 6 మధ్యాహ్నం 12:07కు మొదలైంది. డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 నిమిషాల దాకా ఉంటుంది. సూర్యోదయం తిధి ప్రకారం పండుగను జరుపుకోవాలి కనుక డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్టి వచ్చింది. ఉదయం ఐదు నుంచి తొమ్మిది వరకు పూజ చేసుకోవడానికి మంచి సమయం.
స్వామివారిని మంగళవారం ఎందుకు ఆరాధిస్తారు?
స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యం కుజ గ్రహానికి అధిపతి. అందుకే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తాము. ప్రతి నెలలో షష్టి రోజున దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరుపుతారు.
సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చు?
సుబ్రమణ్య స్వామిని అందరూ ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యకించి మంగళవారం నాడు ఆరాధిస్తూ ఉంటారు. ప్రతీ నెలా షష్టి నాడు విశేషమైన పూజలు, అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వలన చర్మ సమస్యలతో పాటుగా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. అలాగే, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సుబ్రమణ్యం స్వామిని ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చాలా మంది స్వామి వారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరును పుట్టిన పిల్లలకు పెడుతూ ఉంటారు.
సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం
మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్టి నాడు సుబ్రహ్మణ్యస్వామి పుట్టారట. అందుకనే ఆయన జన్మదినాన్ని ఇలా సుబ్రహ్మణ్యం షష్టిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సుబ్రహ్మణ్య షష్టి నాడు పైన చెప్పినట్లుగా స్వామివారిని ఆరాధిస్తే, విశేష ఫలితాలు పొందవచ్చు.
ఇలా పూజిస్తే మంచిది
సుబ్రమణ్య స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజ గ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. చాలామంది భక్తులు పాలు, పండ్లు, పూలు, వెండి పడగలు, వెండి కళ్ళు వంటి వాటిని మొక్కుబడులుగా సమర్పిస్తారు.
తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్టి
తమిళనాడులోని కావడి మొక్కులు తీరుస్తూ ఉంటారు. షష్టి నాడు కుమారస్వామి ఆలయానికి కావడిని తీసుకుని వెళ్తారు. దీనిలో కుండలిని పెట్టి పంచదారతో, పాలతో వాటిని నింపుతారు. మొక్కుని బట్టి తీసుకు వెళ్తూ వుంటారు. అలాగే సుబ్రహ్మణ్య షష్టి నాడు దానాలకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. శక్తి కొద్ది ఎదుటి వాళ్ళకి దానం చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి. దానం చేస్తే గ్రహ బాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. దుప్పట్లతో పాటుగా చలి నుంచి రక్షించే దుస్తులని సుబ్రహ్మణ్య షష్టి నాడు చాలా మంది దానం చేస్తారు.