Krishnashtami: కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి? కృష్ణుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం-what to do on krishnashtami day let us know what is special about krishna ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Krishnashtami: కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి? కృష్ణుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం

Krishnashtami: కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి? కృష్ణుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం

HT Telugu Desk HT Telugu
Aug 25, 2024 05:16 PM IST

Krishnashtami: కృష్ణుడు జన్మించిన రోజును గోకులాష్టమి, కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఆగస్ట్ 26న కృష్ణాష్టమి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈరోజు ఏం చేయాలి? ఎలాంటి పనులు చేస్తే కృష్ణుడి ఆశీర్వాదం దక్కుతుందో ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి?
కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి?

Krishnashtami: శ్రావణ మాస బహుళ పక్ష అష్టమ తిథి నాడు రోహిణి నక్షత్రం వృషభ రాశి వృషభ లగ్నం నందు లగ్నంలో గురు చంద్రులు కలిసి ఉండగా శ్రీమన్నారాయణుడు దేవకీ, వసుదేవుల గర్భం నందు అష్టమ సంతానంగా అష్టమ తిథి నాడు కంసుడి చెరసాలలో జన్మించినట్టు ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అలా శ్రీ కృష్ణుడు జన్మించిన రోజు కాబట్టి కృష్ణాష్టమిని విశేషంగా జరుపుకుంటారు. శ్రీమన్నారాయణుడి దశావతారాలు మత్స్య, కూర్మ, వారాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ బలరామ కల్కి అవతారాలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ అవతారం చాలా విశేషమైనది ప్రత్యేకమైనదని చిలకమర్తి తెలిపారు. శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి కారకుడు, ఈలోకంలో ధర్మ స్థాపన చేయడం కోసం లోక సంరక్షణార్థం అనేక అవతారాలు ఎత్తి లోకాన్ని రక్షించినట్టుగా పురాణాలు తెలియజేశాయి.

కృష్ణుడి ప్రత్యేకత

శ్రీకృష్ణ అవతారం ప్రత్యేకత ఏమిటి అనగా ద్వాపర యుగంలో జన్మించి కలియుగాన్ని దృష్టిలో ఉంచుకుని కలియుగంలో మానవులు తరించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువాడు. కృష్ణావతారం వల్లనే మహా భారతం జరిగిందని నాహం కర్త, కృష్ణః కర్త అనే వాక్యాన్ని అనుసరించి కృష్ణుడే అన్నీ జరిపించినట్టుగా చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు.

శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని పట్టుకుని ఉన్నటు వంటి ధర్మరాజు, భీముడు, ఆర్జనుడు, నకల సహదేవులను రక్షించి ఈ లోకాలను ఉద్ధరించేనని చిలకమర్తి తెలిపారు. కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రోజు.. అటువంటి కృష్ణాష్టమి రోజు బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడిని పూజించాలని, బాలుని రూపంలో ఉన్న కృష్ణుడికి షోడశ ఉపచారాలు చేయాలని చిలకమర్తి తెలిపారు.

కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి?

బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి మధుర బృందావనం నుంచి తెచ్చుకున్న బాలకృష్ణుడిని పూజా మందిరంలో ఉంచుకుని ఆ కృష్ణుడిని ఉయ్యాల ఊపుతూ కృష్ణ నామ స్మరణ చేస్తూ పూజించనటువంటి వారికి కృష్ణుడి అనుగ్రహంచే జ్ఞాన వైరాగ్యం, సుఖ సౌఖ్యాలు కలుగునని చిలకమర్తి తెలిపారు.

కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించడం కృష్ణుడికి పాలు, వెన్న వంటివి నివేదనగా సమర్పించాలి. పాలతో చేసిన క్షీరాన్నం, అటుకుల పరవాన్నం నివేదన చేయడం చాలా మంచిదని చిలకమర్తి తెలిపారు. ఈరోజు బాలకృష్ణుడిని అష్టోత్తర శతనామావళితో పూజించిన వారికి అభిశతి సిద్ధిస్తుందని చిలకమర్తి తెలిపారు. కృష్ణాష్టమి రోజు పోతన రాసిన భాగవతం, వ్యాసుల వారు అందించిన మహా భారతం, భగవద్గీత పారాయణం చేసిన వారికి కృష్ణాయనుగ్రహం కలుగుతుందని చిల కమర్తి తెలిపారు.

కృష్ణాష్టమి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఈరోజు కృష్ణుడిని 1008 నామాలతో తులసి దళాలతో అర్చించినటు వారికి సకల కోరికలు నెరవేరతాయని చిలకమర్తి తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు అందించినటువటువంటి గొప్ప జ్ఞాన నిధి భగవద్గీత. దీని ద్వారా విషాద, సాంఖ్య, జ్ఞాన, రాజయోగ, రాజగుహ్య, సన్యాస, కర్మ యోగ వంటి అనేక విషయాలను శ్రీకృష్ణ పరమాత్ముడు జగత్తుకు అందించాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అని అంటారు.

కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి ఎవరైతే ప్రత్యేకంగా కొలుస్తారో వారికి కృష్ణుడి అనుగ్రహంతో జ్ఞాన వైరాగ్యాలు కలిగి భక్తి మార్గం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ