Varahi deeksha: వారాహి దీక్షలో పవన్ కళ్యాణ్, ఏమిటీ దీక్ష? ఎందుకు చేస్తారు?
Varahi deeksha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి విజయ దీక్షను చేపట్టబోతున్నారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి? ఎందుకు చేస్తారు అనే వివరాలు మీ కోసం.
Varahi deeksha: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి విజయ దీక్షను చేపట్టనున్నారు. జూన్ 26 నుంచి పదకొండు రోజుల పాటు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈ సమయంలో పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు. అసలు వారాహి దీక్ష అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఈ దీక్ష చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎన్ని రోజులు చేస్తారు? అనే విషయాలు తెలుసుకుందాం.
వారాహి అమ్మవారు ఎవరు?
హిందూ మత నమ్మకాల ప్రకారం శక్తి ప్రతి రూపాలలో వారాహి రూపం ఒకటని నమ్ముతారు. సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. ఈ అమ్మవారి ముఖం వరాహం రూపంలో ఉంటుంది. ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది. శంఖం, నాగలి, పాశం, సుదర్శన చక్రం, రోకలి, అంకుశ, వరద, అభయ హస్తాలతో అమ్మవారు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శుంభనిశుంభు రాక్షసులను వారాహి అమ్మవారు సంహరించారని చెప్తారు. గుర్రం, పాము, సింహం, దున్నపోతు వంటి వాహనాల మీద అమ్మవారు దర్శనమిస్తారు.
వారాహి అంటే భూదేవి అని కూడా చెప్తారు. మార్కండేయ పురాణం ప్రకారం మహా విష్ణువు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారని చెప్తారు. వారాహి అమ్మవారు వరాలని ఇచ్చే తల్లిగా కొలుస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వారాహి అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి. ఒడిశా, వారణాని, మైలాపూర్ లో ఉన్న వారాహి ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితా దేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉన్నారని చెబుతారు. అందుకే లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన కూడా వస్తుంది.
ఈ దీక్ష ఎప్పుడు చేపడతారు?
వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర్లో చేపడతారు. నవరాత్రులు మాదిరిగా కొంతమంది తొమ్మిది రోజులు దీక్ష చేపడతారు. మరికొందరు పదకొండు రోజులు దీక్ష చేపడతారు. ఈ దీక్షా కాలంలో సాత్విక ఆహారం మితంగా మాత్రమే తీసుకుంటారు. నేలపై నిద్రించాలి. కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాలి. ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి.
వారాహి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు పఠిస్తూ పూజ చేయాలి. నియమ నిష్టలు ఆచరిస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శత్రువుల మీద విజయం సాధించేందుకు, జీవితంలో ఎదురయ్యేఅడ్డంకులను అధిగమించేందుకు వారాహి అమ్మవారికి సంబంధించిన ఈ దీక్ష చేపడతారు. నర దిష్టి, చెడు దిష్టి తగలకుండా ఉండేందుకు ఈ దీక్ష చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవని చెప్తారు.
వారాహి దీక్ష చేపట్టడం వల్ల ఏ పని తలపెట్టినా అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారని నమ్ముతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని విశ్వసిస్తారు. శత్రుభయం అనేది ఉండదు. ఆషాడ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహి దేవి నవరాత్రులుగా పిలుస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.