కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ఏం చేయాలి?
కార్తీకమాసంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈరోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సమేతంగా పూజ చేస్తారు. అలాగే తులసి వివాహం జరిపించేది కూడా ఈరోజునేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి, బృందావన ద్వాదశి అంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
క్షీరాబ్ది ద్వాదశి వ్రతం హిందూ సంప్రదాయంలో పవిత్రమైన వ్రతం అని భావిస్తారు. ఇది కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశి రోజున జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మి దేవతలను ఆరాధించడానికి భక్తులు నిర్వహిస్తారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు శ్రీవిష్ణువు కృపను సంపాదించడానికి అలాగే కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యాన్ని పొందడానికి సాక్షాత్కార ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.
పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసింది ఈరోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రీమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే. ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీకి సమానురాలైన తులసిని పూజించవలెను అని చిలకమర్తి తెలిపారు.
పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి వనమందుండగా వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని యడుగగా వ్యాసుడు 'నాయనా ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు వ్రతము చెప్పినాడు. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు.
ఏమనగా - ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసి పూజచేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతమును ఆచరించి శుభఫలములు విజయము పొందెను అని చిలకమర్తి తెలియజేశారు.
క్షీరాబ్ది ద్వాదశి, చిలుక ద్వాదశి వ్రత విధానం
1. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండాలి.
2. దీపారాధన చేయాలి. దానికోసం దీపం వెలిగించి విష్ణువు, లక్ష్మీదేవి సమక్షంలో పెట్టాలి.
3. విష్ణు దేవుడి సమక్షంలో పాలు, తులసి దళాలు సమర్పించి, ప్రత్యేక పూజ చేయాలి.
4. ఈ రోజున "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి వివాహం నిర్వహించడం ద్వారా కుటుంబంలో సౌభాగ్యం కలుగుతుందని, వివాహ బంధం శ్రేయస్సుగా ఉండాలని భక్తులు విశ్వసిస్తారు. తులసి మొక్కకు శ్రీ మహావిష్ణువు రూపమైన శాలిగ్రామంతో వివాహం చేస్తారు. తులసి వివాహం చేసిన వారు పాప విమోచనం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి పొందెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.