కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే చలిమిళ్ల నోము, కేదారేశ్వర స్వామి వ్రతం విశిష్టత ఇదే
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. ఈ ఏడాది నవంబర్ 15 కార్తీక పూర్ణిమ వచ్చింది. ఈరోజు చాలా మంది మహిళలు తమ ఆచారాల ప్రకారం నోములు నోచుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే చలిమిళ్ల నోము, కేదారేశ్వర స్వామి వ్రత విశిష్టత గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసం పరమేశ్వరుడికి ప్రియమైనది. పూజలు, జపాలు, దానాలు, స్నానాలు, నోములు వంటి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలతో ఈ మాసం నిండి ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసం ఆచరిస్తూ శివకేశవులను ఆరాధిస్తారు.
ఈ మాసంలో ప్రాంతాల వారీగా, కుటుంబ ఆచారాల ప్రకారం కొన్ని నోములు చేసుకుంటారు. వాటిలో ఎక్కువగా వినిపించేవి కేదారేశ్వర స్వామి వ్రతం, చలిమిళ్ల నోము. ఇవి రెండూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరుపుకుంటారు. కొందరు ఆచారం ప్రకారం కేదార వ్రతం దీపావళి సమయంలో కూడా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు దీనితో పాటు మరికొందరు కృత్తికా దీపాల నోము కూడా చేసుకుంటారు.
చలిమిళ్ల నోము ఎలా చేసుకుంటారు?
సంతాన, సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు చలిమిళ్ల నోమును మహిళలు చేసుకుంటారు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. మొదటి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఐదుగురు ముత్తైదువులకు ఐదు మానికలతో చలిమిడి చేసి వాయినంగా ఇస్తారు. రెండో సంవత్సరం పది మందికి పది మానికల చలిమిడిని, మూడో సంవత్సరం పదిహేను మంది ముత్తైదువులకు పదిహేను మానికల బియ్యంతో చలిమిడి చేసి వాయనంగా ఇస్తారు. మూడో సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు గౌరీ పూజ చేసుకుని ఆ తర్వాత వాయనం ఇస్తారు. ఇది ఉద్యాపనగా భావిస్తారు. అనంతరం చలిమిళ్ల నోము కథ చదువుకుని అక్షింతలు తల మీద వేసుకుంటారు.
కేదారేశ్వర స్వామి వ్రతం
కార్తీక పౌర్ణమి రోజు కొందరు తమ ఆచారం ప్రకారం కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు కుటుంబం అంతా కఠినమైన ఉపవాసం ఉండి కేదార రూపంలో పరమేశ్వరుడిని పూజిస్తారు. ఈ నోము చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం. భార్యాభర్తలు కలిసి ఈ నోము చేసుకుంటారు. ఈరోజు 21 అనే సంఖ్యకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. 21 పేట్ల దారాన్ని తోరంగా కట్టుకుంటారు. గోధుమ పిండితో 21 అరిసెలు చేయాలి. ఇలా 21 సంవత్సరాల పాటు వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం ఆచరించడం వల్ల పార్వతీ దేవి శివుని శరీరంలో అర్థ భాగం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి.
కృత్తికా దీపాల నోము
కార్తీక పౌర్ణమి రోజు మరికొందరు కృత్తికా దీపాల నోము చేసుకుంటారు. ఈరోజు శివాలయంలో సాయంత్రం వేల 120 దీపాలు వెలిగిస్తారు. తర్వాత సంవత్సరం 240, మరుసటి సంవత్సరం 360 దీపాలు ఇలా రెట్టింపు దీపాలు పెంచుకుంటూ నోము చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మరణం అనంతరం కైలాస ప్రవేశం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం, దీప దానం చేయడం, ఉసిరి కాయలు దానం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.