Jwala thoranam: కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలా తోరణం విశిష్టత ఏంటి? దీన్ని ఎందుకు దాటతారు?-what is the significance of jwala thoranam on kartika purnima ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jwala Thoranam: కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలా తోరణం విశిష్టత ఏంటి? దీన్ని ఎందుకు దాటతారు?

Jwala thoranam: కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలా తోరణం విశిష్టత ఏంటి? దీన్ని ఎందుకు దాటతారు?

Gunti Soundarya HT Telugu
Nov 12, 2024 11:15 AM IST

Jwala thoranam: కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా జ్వాలా తోరణం ఉత్సవం నిర్వహిస్తారు. దీన్ని దర్శించుకుంటే భాగ్యం కోసం అందరూ ఎదురుచూస్తారు. అలాగే ఈ జ్వాలా తోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

జ్వాలా తోరణం అంటే ఏంటి?
జ్వాలా తోరణం అంటే ఏంటి? (youtube)

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో వచ్చే ప్రతి తేదీ, తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టతమైనది. ఈరోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తారు. శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం ఆచారంగా వస్తోంది.

జ్వాలా తోరణం అంటే ఏంటి?

ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు. దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలా తోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయాలకు చేరుకుంటారు.

శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు. దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చూడతారు. దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు. దీన్నే జ్వాలా తోరణం, యమ ద్వారం అని కూడా పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకుని ఈ తోరణం కింద మూడు సార్లు అటూ ఇటూ తిరుగుతారు. ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం.

ఈ జ్వాలా తోరణం దాటిన వారికి యమ లోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెబుతారు. ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుంది. దీని ద్వారానే లోపలికి అడుగుపెడ్తారు. పాపాలు చేసే వారికి వేసే మొదటి శిక్ష ఇదేనణి పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ జ్వాలా తోరణం దాటితే యమలోకం అడుగు పెట్టె అవసరం రాదని పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంటారు.

జ్వాలా తోరణం దర్శించుకునా, దాని కింద నడిచినా సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే చాలా మంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత, ప్రేత, పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు. కార్తీకపౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలా తోరణం మూడు సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

జ్వాలా తోరణం వెనుక కథ

జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం వెనుక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. క్షీర సాగర మథనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది. అది చాలా విషపూరితమైనది, వినాశనాన్ని సృష్టిస్తుంది. దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు. 

అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నారు. అది చూసి భయపడిపోయిన పార్వతీ దేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింది నుంచి దూరి వెడతానని మొక్కుకుంది. అలా పార్వతీ దేవి చేయడం వల్ల శివుడికి విషయం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలా తోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తోంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner