October month: అక్టోబర్ లో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? వీరి లక్కీ నెంబర్ ఎంతో తెలుసా?
October month: దేవీ నవరాత్రులు జరిగే అక్టోబర్ నెల చాలా ముఖ్యమైనది. ఇక ఈ నెల నుంచి వరుసగా పండుగలు వస్తూ ఉంటాయి. దేవతారాధనకు కీలకమైన నెల ఇది. అటువంటి ఈ నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? వీరి లక్కీ నెంబర్ ఏంటి? లక్కీ కలర్స్ ఏంటో తెలుసుకుందాం.
October month: మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగియబోతుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ పదో నెల. తెలుగు వారి పంచాంగం ప్రకారం ఏడవ నెల ఆశ్వయుజ మాసం. దేవీ ఆరాధనకు అత్యంత ప్రాధాన్యమైనది. చంద్రుడు అశ్విని నక్షత్రంలో కలిసి ఉన్న రోజు వల్ల ఆ నెలను ఆశ్వయుజ మాసం అని పిలుస్తారు. ఈ నెల పాడ్యమి నుంచి నవమి వరకు ఆది పరాశక్తిని కొలుస్తూ దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఇక చివరి రోజు వచ్చే అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకాన్ని చెప్పేందుకు వాళ్ళు పుట్టిన సమయం, నెల, తేదీ వంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి మన వ్యక్తిత్వాన్ని బాగా ప్రభావితం చేస్తాయని అంటారు. అలా అక్టోబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి గుణగణాలు ఏంటి? లక్కీ నెంబర్, లక్కీ కలర్ వంటి అనేక ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
అక్టోబర్ లో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందంటే?
అక్టోబర్ లో జన్మించిన వారి జీవితం చాలా ఆశాజనకంగా ఉంటుంది. వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. ఏదో మంత్రం వేసి మాయ చేశావే అంటారు చూశారా అలా వీరి మనస్తత్వం ఉంటుంది. వీరిలో కొద్దిగా అసూయ ఉన్నప్పటికీ తమను తాము అందరికంటే ఉన్నతంగా ఊహించుకుంటారు. ఎవరైనా తమను మించిపోతే అసలు సహించలేరు. అక్టోబర్ లో జన్మించి వారి మీద బుధ, శుక్ర గ్రహాల మిశ్రమ ప్రభావం ఉంటుంది. అందువల్ల వీరి మాటలు మధురం, ప్రేమ జీవితం అమరం.
ప్రేమలో వీళ్ళు ఎవరికీ ద్రోహం చేయరు. ఒక్కసారి చెయ్యి పట్టుకున్నారంటే చివరి వరకు అండగా నిలుస్తారు. భావోద్వేగ నియంత్రణ వీరికి ప్రత్యేకత. ఏదైనా సహాయం కోరి వీరి వద్దకు ఎవరైనా వస్తే వారిని నిరాశపరచరు. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. నిజాయితీగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు.
ఖర్చులు ఎక్కువే
అక్టోబర్ లో జన్మించిన వ్యక్తులకు కాస్త చేతి ఖర్చులు ఎక్కువే. హాబీల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు. ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఖరీదైన వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతారు. సరికొత్త వాహనాలు, దుస్తులు వంటివి ఏవైనా కనిపించాయి అంటే అవి వారి దగ్గర ఉండి తీరాల్సిందే. సుఖవంతమైన, విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇష్టపడతారు.
లక్కీ నెంబర్ ఇదే
అక్టోబర్ లో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు 6, 1. ఒకటి నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. 6 అనేది ప్రత్యేక లక్షణాలను చూపిస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చే రంగులు పింక్, మెరూన్, పీకాక్ గ్రీన్, రాయల్ బ్లాక్. కలిసి వచ్చే రోజులు గురు, శుక్ర, మంగళవారాలు.
పరిహారాలు ఇవే
మీరు అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు అయితే ఏవైనా సమస్యలు ఇబ్బంది పెడుతుంటే కొన్ని పరిహారాలు పాటించడం ఉత్తమం. పేద విద్యార్థులను చదివించే బాధ్యతను తీసుకోవచ్చు. అలాగే చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయవచ్చు. అలాగే పేద బ్రాహ్మణులకు బట్టలు, ఆహారం దానం చేయడం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.