శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి పేరు అర్థం ఏమిటి?-what is the meaning of sri veera venkata satyanarayana swamy name ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి పేరు అర్థం ఏమిటి?

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి పేరు అర్థం ఏమిటి?

HT Telugu Desk HT Telugu
May 29, 2024 09:31 AM IST

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి పేరు అర్థం ఏంటి? సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి పేరు అర్థం
శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి పేరు అర్థం (temples guide(youtube))

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి అనే పేరులోని ప్రతి పదమూ చెప్పలేనంత అర్ధాన్ని కలిగి ఉంది. శ్రీ ఇది ఓ పదం కాదు. అక్షరమే కదా అనుకుంటాం కాదు. సంపూర్ణంగా అర్ధాన్ని తెలియజేయగల శక్తి ఉన్నట్లయితే అలాంటి అక్షరాన్ని పదమే అనాలంటుంది శాస్త్రం. ఆ కారణంగా శ్రీ అనేది ఓ పదమే. శుభాన్నీ మంగళాన్నీ భక్తులకి కలగజేసేది సామాన్యమైన అర్ధం కాగా శ్రీ తన భార్య అయిన ఆద్యాద్యనంత లక్ష్మీ సత్యవతితో ఎప్పుడూ కూడి ఉండే వాడే తప్ప ఇద్దరూ వేర్వేరుగా ఏనాడూ ఉండడమనే విధానమే లేనివాడని దీనర్ధం అని చిలకమర్తి తెలిపారు.

సౌభాగ్యం కావాలంటే పార్వతీదేవిని ఆరాధించాలి. ధనం లభించాలంటే లక్ష్మీదేవిని సేవించాలి. ఇక విద్య సిద్ధించాలంటే సరస్వతీదేవిని స్తుతించాలి. శ్రీ అంటే అమ్మవారిని సేవిస్తే ఈ ముగ్గురి రూపమూ అయిన ఆమె మూడుతీరుల ప్రయోజనాలనీ కలగజేస్తుంది. అనంత (ఏనాడూ అంతమే లేని) అయిన ఏ స్త్రీ దేవత ఉందో ఆమె పార్వతీదేవి కదా! అలాంటి సౌభాగ్యాన్ని ఈయగల దేవతతో కూడి ఉంటాడు నిరంతరం స్వామి. అదే తీరుగా ఆద్యాది అనంతలక్ష్మీ అనేది అమె పేరులోనే ఉంది. లక్ష్మీరూపిణి అయిన ఆమె ధనాన్ని ఇస్తుంది. నిజానికి లక్ష్మీదేవి ధనాన్నియ్యదు.

లక్ష్మీ అనే పదం ద్వారా ధనాన్ని సంపాదించగల బుద్ధినిస్తుందని గ్రహించాలి. ఆ తల్లి పేరులో ఆద్యాద్యనంత లక్ష్మీ సరస్వతి అని ఉన్న కారణంగా ప్రవహించే విధంగా జ్ఞానాన్ని అందించే చదువుల తల్లి అయిన సరస్వతీ దేవి కూడా అమె అని చెప్తోంది ఈ పేరు. అలాంటి సత్యలోకంలో ఉండే బ్రహ్మ భార్య అయిన కారణంగా ఈమె సత్యవతి అయింది. ప్రవాహం అనేది ఎలా ఒక్కచోటునే ఉండకుండా నిరంతరం సాగిపోతూ ఉంటుంది.

చదువు అనగానే మనం చదువుకునే పరీక్షలకి సంబంధించిన చదువులని భావించకూడదు. వృత్తి ఉద్యోగ, వ్యాపారపరమైన ఆ తీరు విద్యలని అందించగల శక్తికలదని దానర్థం. అందుకే ముందుగా ఈ స్వామిని దర్శించబోతూ ఆయన పక్మనే నిరంతరం ఉండే ఆ తల్లిని సౌభాగ్యం కావాలనే దృష్టి కోరికతో లేదా ధన దృష్టితో లేదా విద్యా! సజ్ఞానదృష్టితో చూస్తూ అమ్మా! ఇప్పించు! అని ప్రార్ధిస్తే అందించ గలుగుతుంది ఆ తల్లి. ఆ మూడూ కావాలనిగాని కోరుకోదలిస్తే ఎంత సొమ్ము చెల్లిస్తే అంత విలువైన వస్తువు లభించేటట్లు ప్రార్థన చేయాలి. అలాంటి ముగ్గురమ్మలతో ఉంటాడు ఈ స్వామిని శ్రీ అంటారు అదే దాని అర్థం అని చిలకమర్తి తెలిపారు.

“వీర” జాగ్రత్తగా ఈయన్ని పరిశీలిస్తే ధనుస్సూ బాణం కూడా ఉంటాయి. భుజానికి, మనకి నిరంతరం మనో బాధని, అందోళననీ కలిగిస్తూ శాంతి అనేదే లేకుండా గనుక ఎవరైనా చేస్తూంటే ఆ శత్రువుల బాధనుండి తప్పించగల శక్తిమంతుడు తానేనని తెలియజేస్తుంది. దీన్ని నిరూపిస్తూనే విగ్రహంలో స్వామి వారికి మీసాలుంటాయి. లోకంలో శంకరునికి మాత్రమే మీసాలుంటాయి. (శ్మథువాన్సీలలోహితః). ఈయనకు కూడా ఉండటానికి కారణం పరాక్రమవంతుడని తెలియజేసుకుంటూ నమ్మితే మీమీ శత్రు నాశనాన్ని చేస్తానంటాడు స్వామి. ఈయన దానగుణంలో కూడా వీరుడే అయిన కారణంగా మనం కోరికలని దానం చేయగల దానవీరుడన్నమాట. ఎంత కోరిక తీరాలంటే అంతగానూ స్వామిని సేవిస్తూ ఉండాలనేది మరిచిపోరాని మాట. పండుగ రోజున మాత్రమే ఈ దైవాన్నీ మరో మరో దైవాన్నీ కాకుండా అన్నీ ఆయనే అనే ఏకదైవారాధన బుద్ధిని కలిగి సేవిస్తుంటే తప్పక అన్ని కోరికలూ తీరతాయి. ఇలాంటి శత్రు నాశన శక్తిగల వీరుడూ, దీనవీరుడూ ఈయన అని వీర పదానికర్థం.

వేంకట.. వేం అనే అక్షరానికి పాపాలని అర్ధం. కట అనే పదానికి నాశనం చేయడమని అర్థం. వేంకట అనే పదానికి పాపాలని పోగొట్టగలవాడనేది అర్థం. దీన్ని పట్టుకుని ఎందరెందరో ఫలాన్ని స్తోత్రాన్ని ముమ్మారు చదివితే 3 కోట్ల జన్మల పాపాలు పోతాయంటూ చెప్పేస్తుంటారు. వేం+కట అనే పదానికర్థం మనం మనకి తెలియకుండా చేసిన పాపాలని తొలిగించేవాడు అని అర్థమని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సత్య+ నారాయణ మనకి 7 లోకాలున్నాయి. భూలోకం నుండి పైకి ఈ అన్ని లోకాల్లోనూ నారాయణుడున్నాడు. భూ లోకాన్ని పరిపాలించే నారాయణుడు అశ్వత్థ నారాయణుడు, భువోలోకం దీని మీదిది ఇక గడి నారాయణుని పేరు మరున్నారాయణుడని (భువ ఇతివాయౌ) అదే క్రమంలో సువో లోకాన్ని పరిపాలించే నారాయణునిపేరు సూర్యనారాయణుడని, మహోలోకాధిపతి అయిన నారాయణుడు ధాత్భ నారాయణుడు కాగా (మహ ఇతి బ్రహ్మణి) జనోలోకాధిపతి లోకనారాయణుడూ, తపోలోకాధిపతి బదరీనారాయణుడూ అవుతారు.

ఇక అన్ని లోకాలకీ సత్యలోకాధిపతి అయిన నారాయణుడెవరో ఆయనే “సత్యనారాయణుడు”. సత్యనారాయణుని పూజని చేయదలిస్తే అష్టదిక్బాలకులూ, నవగ్రహాలూ, పంచలోక పాలకులూ బ్రహ్మాది దేవతలూ అందరూ విచ్చేస్తారు. వివాహం, గృహప్రవేశం వంటి కార్యక్రమాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.

“స్వామి” స్వామిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ స్వామి ముంజేతికి ఓ కంకణం ఉంటుంది. యధార్థమైన భక్తితో తనని గనుక సేవిస్తే నిశ్చయంగా వాళ్ళ కోరికలను (తగిన అర్హతని వాళ్ళు కలిగి ఉన్న పక్షంలో) తీరుస్తానంటూ ఆ దైవం తన ముంజేతికి కంకణం కట్టుకుని కన్పిస్తాడు. ఇలా దైవాన్ని నఖశిఖ పర్యంతమూ చూడాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel

టాపిక్