శబరిమలకి 18 సంఖ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
sabarimala temple: శబరిమల అనగానే గుర్తుకు వచ్చేది 18 మెట్లు మీద కూర్చున్న అయ్యప్ప స్వామి. ఈ ఆలయానికి 18 అనే సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Sabarimala Temple: ప్రపంచ సుప్రసిద్ధ ఆలయాలలో కేరళలోని శబరిమల ఒకటి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కడ చూసిన అయ్యప్ప మాల ధరించిన భక్తులు కనిపిస్తూ ఉంటారు. ఈ మూడు నెలలు శరణం.. శరణం.. అంటూ అయ్యప్ప భజనలే వినిపిస్తాయి.
అయ్యప్ప మాల ధారులు కఠినమైన నియమ నిష్టలతో భక్తిగా అయ్యప్పని పూజించాలి. జనవరిలో దీక్ష విరమించేందుకు అయ్యప్ప భక్తులు శబరిమల వెళతారు. అయ్యప్ప అనగానే గుర్తుకు వచ్చేది స్వామి వారి 18 మెట్లు.
18 కి శబరిమలకి ఉన్న సంబంధం ఏంటి?
శబరిమలకి 18 అనే సంఖ్యకి చాలా విశిష్టత ఉంది. 18 కొండలు ఎక్కి 18 మెట్లపై అధిష్టించి కూర్చున్న మణికంఠుడుని దర్శించుకుంటారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాలాధారణతో ప్రత్యేక పూజలు చేస్తారు.
శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లుని పదునెట్టాంబడి అని పిలుస్తారు. 18 మెట్లు 18 పురాణాలని సూచిస్తాయని చెబుతారు. దుష్ట సంహారం కోసం 18 ఆయుధాలు ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి.
సాధారణ భక్తులు ఈ మెట్లు ఎక్కేందుకు అనుమతించరు. కేవలం అయ్యప్ప మాల ధరించిన భక్తులు మాత్రమే ఈ మెట్లు ఎక్కి దైవదర్శనం చేసుకుంటారు. జనవరిలో శబరిమలకి భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయం కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. జనవరిలో కనిపించే మకర దర్శనం కోసం ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు అక్కడికి చేరుకుంటారు.
అయ్యప్ప స్వామి 18 ఆయుధాలు
అయ్యప్ప స్వామి 18 అస్త్రాలని వదిలి 18 మెట్ల మీదుగా నడుచుకుంటూ వెళ్లారని అంటారు. ఆ 18 ఆయుధాలు ఏమిటంటే..
- శరం
- క్షురిక
- డమరుకం
- కౌమోదకం
- పాంచజన్యం
- నాగాస్త్రం
- హలాయుధం
- వజ్రాయుధం
- సుదర్శనం
- దంతాయుధం
- నఖాయుధం
- వరుణాయుద్ధం
- వాయువ్యాస్త్రం
- శార్ఘ్నాయుధం
- బ్రహ్మాస్త్రం
- పాశుపతాస్త్రం
- శూలాయుధం
- త్రిశూలం
18 మెట్ల ప్రాముఖ్యత
సన్నిధానంలో అయ్యప్ప స్వామి పానవట్టంపైన కూర్చుని ఉంటారు. అయ్యప్ప దీక్ష వేసుకున్న భక్తులు 18 మెట్లు ఎక్కుతూ స్త్రోతాలు పఠిస్తూ ఎక్కుతారు. అలా ఎక్కిన వారి కోరికలు తీరతాయని భక్తుల నమ్ముతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కే ఒక్కో మెట్టుకి ఒక్కో విశిష్టత ఉంటుంది. స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాలతో మెట్లు నిర్మించారు. కుడి కాలు పెట్టి స్వామి వారి మెట్లు ఎక్కాలి.
తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలతో సమానం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మానికి ప్రతీకగా నిలుస్తాయి. తర్వాతి ఎనిమిది మెట్లు రాగ ద్వేషాలకి సంబంధించినవి. తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారాన్ని సూచిస్తాయి. మరో మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలకి ప్రతీకగా నిలుస్తాయి. చివరి రెండు మెట్లు విద్య, అజ్ఞానాన్ని సూచిస్తాయి. ఇవి ఎక్కడం వల్ల ముక్తి మార్గం పొందుతారని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
18 కొండలు దాటాలి
అయ్యా స్వామి ఆలయాన్ని చేరుకోవాలంటే 18 కొండలు దాటి వెళ్ళాలి. ఆ కొండల పేర్లు
1. పొన్నాంబళమేడు
2. గౌదవమల
3. నాగమల
4. సుందరమల
5. చిట్టంబలమల
6. దైలాదుమల
7. శ్రీపాదమల
8. ఖలిగిమల
9. మాతంగమల
10. దేవరమల
11. నీల్కల్ మల
12. దాలప్పార్ మల
13. నీలిమల
14. కరిమల
15. పుత్తుశేరిమల
16. కాళైకట్టి మల
17. ఇంజప్పార మల
18. శబరిమల
ఈ 18 కొండలు దాటి ఆలయానికి చేరుకుని 18 మెట్లు ఎక్కి అయ్యప్పని దర్శించుకుంటే పుణ్య దర్శనమని భక్తుల విశ్వాసం.