నిత్యజీవితంలో ఉపనిషత్తుల ప్రాధాన్యత ఏమిటి? వాటిని ఎందుకు నేర్చుకోవాలి?-what is the importance of upanishads in daily life why learn them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నిత్యజీవితంలో ఉపనిషత్తుల ప్రాధాన్యత ఏమిటి? వాటిని ఎందుకు నేర్చుకోవాలి?

నిత్యజీవితంలో ఉపనిషత్తుల ప్రాధాన్యత ఏమిటి? వాటిని ఎందుకు నేర్చుకోవాలి?

HT Telugu Desk HT Telugu

ఉపనిషత్తులు అంటే ఏంటి? నిత్య జీవితంలో వీటి ప్రాధన్యత ఏంటి? వీటిని నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

ఉపనిషత్తుల ప్రాధాన్యత (pixabay)

విశ్వాంతరాళంలో మనిషికి గల స్థానాన్ని ఉపనిషత్తుల్లో వివరించారని, ప్రకృతి రహస్యాలు ఎన్నో ఉపనిషత్తుల అధ్యయనం వలన తెలుసుకోవచ్చని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలియజేశారు.

ఉపనిషత్తుల పఠనం జరిగేచోట దుష్టశక్తులు (నెగిటివ్‌ ఎనర్జీ) దూరమవుతాయి. మంగళకరమైన లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని ఆయన తెలిపారు. విద్య ప్రాధాన్యతను ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయన్నారు. ఇక్కడ విద్య అంటే విజ్ఞానం అని తెలిపారు. మానవుడికి సుఖశాంతులు కలిగించే విద్యను ఉపనిషత్తులలో వివరించారన్నారు.

విద్య అనే మంత్రంతో పరిష్కరించలేనిది ఏదీ లేదని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. ప్రకృతికి మానవుడికి విడదీయరాని సంబంధం ఉందని, ప్రకృతి పరిరక్షణకు మంత్రపూర్వకంగా కొన్ని ప్రార్థనల ద్వారా ప్రకృతితో సామరస్యం ఎలా సాధించవచ్చో ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. మనం శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటి వాటిని ఆశ్రయిస్తున్నాం. వీటిని గురించి కొంచెం పెద్దయ్యాక తెలుసుకుంటున్నాం. అయితే మన హైందవ సంప్రదాయంలో బాల్యంలోనే వీటి గురించి పిల్లలకు తెలియజేసి ఆచరింపజేసేవారు. అలాగే సంకల్పం, ఏకాగ్రత పెరగడానికి ఉపనిషత్తులు ఎంతగానో తోడ్పడతాయని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.

ఉపనిషత్తుల పఠనంతో శారీరక, మానసిక సమస్యలు, ఒత్తిడులు దూరమవుతాయని ఆయన అన్నారు. ఉపనిషత్తులు సూచించిన ప్రార్థనలను సూర్యోదయ వేళ బహిరంగ ప్రదేశాల్లో చేస్తారని, అప్పుడు సూర్యరశ్మినుంచి మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మానవ శరీరం తనకు తానుగా తయారుచేసుకోలేని ‘డి’ విటమిన్‌ సూర్యకిరణాల ద్వారా అందుతాయి. అలా ప్రకృతి నుంచి మనకు సాంత్వన లభిస్తుందని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.

మంచి సమాజం రూపొందడానికి విద్యార్థి యోగ్యుడైనవాని (గురువు)నుంచి శారీరక సంబంధం, కామం వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. లైంగిక విజ్ఞానాన్ని గురువులే బోధించడం, దానిగురించి చర్చించడం ద్వారా ఆనాటి సమాజం ఈ అత్యవసర విజ్ఞానం విషయంలో ఎంత ముందు ఉందో తెలుస్తుంది. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వ్యవస్థ లేనందునే అకృత్యాలు పెరిగి సామాజిక శాంతి దూరమవుతోందని ఆయన అన్నారు.

మాటల పొదుపు ఆవశ్యకతను ఉపనిషత్తులు తెలియజేస్తాయి. ‘మన శక్తిలో చాలాభాగం మాటల మూలంగా వృథా చేస్తున్నాం. అలా కాకుండా దానిని పొదుపు చేస్తే మంచి అవసరాలకు వాడుకోవచ్చు’ అని మాటల పొదుపు ఆవశ్యకతను ఉపనిషత్తులు వివరిస్తున్నాయన్నారు. ప్రకృతి శక్తిని గ్రహించడం, దానిని గౌరవించడం, దానిని పరిరక్షించుకోవడం మనిషి కర్తవ్యమని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయన్నారు. అలా నేటి ‘పర్యావరణ పరిరక్షణ’ అనే అంశానికి ఉపనిషత్తులు బీజం వేశాయని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు.

ఈ రోజుల్లో డబ్బే ప్రధానమైపోయింది. విద్య విత్తం చుట్టూ తిరుగుతోంది. కానీ ఉపనిషత్తులు సర్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షించాయని ఆయన తెలిపారు. ‘ఓం సహనావవతు.. సహనౌభునక్తు’ అంటూ విద్యను ఆర్జించవలసిన విధానాన్ని, ‘సర్వేజనాః సుఖినోభవన్తు’ అంటూ కుల, మత, జాతి, లింగ, దేశాలకు అతీతంగా మానవులందరూ సుఖంగా ఉండాలని ఉపనిషత్తులు మానవుడి కర్తవ్యాన్ని నిర్దేశించాయని ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు.

యోగాభ్యాసం, ధ్యానం వంటి విషయాలను కైవల్యోపనిషత్తు, దానం ఎవరికి ఎలా చేయాలో తైత్తరీయోపనిషత్తు తెలియజేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు. సమాజంలో స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ విద్య ఆవశ్యకతను ఉపనిషత్తులు చాటిచెబుతున్నాయని పంచాంగకర్త, బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు. కొన్ని ఉపనిషత్తులను గార్గి, మైత్రేయి వంటి మహిళలే ప్రవచించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ మన సంప్రదాయం స్త్రీవిద్య ప్రాధాన్యతను ఎంతగా గుర్తించిందో దీనివల్ల తెలుస్తుందన్నారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ