ద్వారకా తిరుమల క్షేత్ర వైభవం ఏమిటి? అక్కడి బ్రహ్మోత్సవాల విశిష్టత ఏమిటి?
ద్వారకా తిరుమల క్షేత్ర వైభవం, అక్కడ జరిగే బ్రహ్మోత్సవాల విశిష్టత గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
కలియుగ దైవమైనటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధించిన దివ్య క్షేత్రాల్లో ద్వారకా తిరుమల చాలా ప్రత్యేకమైందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఇక్కడ వేంకటేశ్వర స్వామి స్వయంభూగా ప్రత్యక్షమైనట్లు స్థలపురాణం తెలియజేస్తుందని చిలకమర్తి తెలిపారు. ద్వారకా అనే ముని చీమల పుట్ట నుంచి వేంకటేశ్వర స్వామిని వెలికి తీయడం చేత ఈ ఆలయానికి ద్వారకా తిరుమల క్షేత్రమని పేరు వచ్చిందని చిలకమర్తి తెలిపారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం.. ఈ ఆలయం దశరథ మహారాజు కాలం నాటిదని చెప్పబడుతుంది. ద్వారకుడనే రుషి తపస్సు చేసి స్వామివారి పాదాలను తాను నిరంతరం సేవించాలనే వరాన్ని పొందాడు. ఆ వరం ద్వారా వేంకటేశ్వర స్వామి పాదాలను పూజించే హక్కు అతనికి దొరికిందని. అందువల్లనే అక్కడి ఆలయంలో స్వామివారి పై భాగాన్ని మాత్రమే దర్శించుకోవడం జరుగుతుందని చిలకమర్తి తెలిపారు.
విశిష్టాద్వైత బోధకులు రామానుజాచార్యుల వారు ఓ సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు చిలకమర్తి తెలిపారు. వేంకటేశ్వర స్వామి పాద పూజ చేసుకునే భాగ్యం అందరికీ కలగాలని భావించిన రామానుజాచార్యుల వారు నిలువెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్రువ మూర్తికి వెనుక వైపు పీఠంపై వైఖానస ఆగమం ప్రకారం ప్రతిష్ఠించారని పురాణాల్లో చెప్పబడినట్టుగా చిలకమర్తి తెలిపారు. స్వయంభూగా వెలసిన పాదములు కనిపించని స్వామివారిని దర్శించడం వలన మోక్షం కలుగుతుందని, దానితోపాటు రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించిన స్వామివారి ప్రతిమను కొలిచినందు వల్ల ధర్మార్థ కామ పురుషార్ధాములు సమకూరుతాయని పెద్దలు తెలియజేసినట్టుగా చిలకమర్తి వివరించారు.
ద్వారకా తిరుమల క్షేత్రానికి పౌరాణికంగా శేషాచలమని పేరుందని చిలకమర్తి తెలిపారు. ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలున్న అరుదైన క్షేత్రమిది. దక్షిణాభిముఖుడై వేంకటేశ్వరుడు వెలసినందువల్ల నిత్యం ఉత్తరద్వార దర్శనమిస్తాడు. గర్భాలయానికి కుడివైపు అర్ధమంటపంలో తూర్పుముఖంగా పద్మావతీ, ఆండాళ్ అమ్మవార్లు కొలువై ఉన్నారు. గర్భాలయంలో ఇద్దరు ధృవమూర్తులు ఉంటారు. కనుక ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చిలకమర్తి తెలిపారు.
స్వయం వ్యక్తమూర్తి వైశాఖ మాసంలో దర్శన మిచ్చినందువల్ల వైశాఖ మాసంలోనూ స్వామివారికి ఇక్కడ కల్యాణం జరుగుతుంది. వైశాఖశుద్ధ దశమి నుంచి విదియ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అలాగే సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వీయుజ మాసంలో ప్రతిష్ఠించినందువల్ల ఆ మాసంలోనూ స్వామికి మరోమారు కల్యాణోత్సవం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా మారిందని చిలకమర్తి తెలిపారు.
ద్వారకా తిరుమలేశుని వైశాఖ కల్యాణోత్సవాలు వైఖానస ఆగమ పద్ధతిలో పాంచరాత్ర దీక్షతో నిర్వహిస్తారు. ఆ ఎనిమిది రోజులు పాటు ద్వారకా తిరుమలలో ఆర్జిత సేవలను, నిత్యకల్యాణోత్సవాలను రద్దు చేస్తారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు రోజుకోక వాహనంపై ద్వారకా వీధులలో స్వామి వివిధ అలంకారాలతో గ్రామోత్సవంలో భాగంగా ఊరేగుతారు.