Ujjain temple: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఉజ్జయినీ జ్యోతిర్లింగ క్షేత్ర మహిమ, విశిష్టత ఏమిటి?
Ujjain temple: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఉజ్జయినీ జ్యోతిర్లింగ క్షేత్ర మహిమ, దాని విశిష్టత, ఇక్కడ ఉన్న ప్రముఖ దర్శనీయ క్షేత్రాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.
శ్లో; అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశమ్ ॥
భావము : అకాల మృత్యువు నుండి రక్షించి సజ్జనులకు ముక్తినిచ్చుటకు అవంతీ నగరము (ఉజ్జయినిలో) అవతరించిన మహాకాలుడను పేరు గల దేవదేవునకు నమస్కరిస్తున్నాను. (ఇక్కడి అమ్మవారు మహాకాళి) ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి మోచేయిపడిన చోటు.
పురాణ గాథ: మాళవ దేశంలోని అవంతీ (నేటి ఉజ్జయిని) నగరం శిప్రానది ఒడ్డున ఉంది. భారతదేశంలోని మోక్షదాయకములైన ఏడు నగరాలలో ఈ అవంతీ నగరం ఒకటి.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తెతే మోక్షదాయకాః ॥
అనే పురాణ వచనం వలన ఈ అవంతిక నగరం మోక్షదాయకమని తెలుస్తుంది. స్కంద పురాణంలోని అవంతీ ఖండం ఈ నగరం గొప్పదనాన్ని ఎంతగానో వివరించింది. శివపురాణంలోను, మహాభారతంలోను ఈ అవంతీ (ఉజ్జయినీ) నగర మహిమ గురించి వివరించారు.
ఉజ్జయినీ విశిష్టత
ఇక్కడి శిప్రా (క్షిప్రా) నదీస్నానం అన్ని పాపాలను నశింపజేస్తుందనీ అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాలలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు సాందీపుని వద్ద చదువుకున్నారని భాగవతం చెప్తోంది. ఆ సాందీపుని ఆశ్రమం ఈ నగరంలో శిప్రా నది ఒడ్డున ఉంది. చరిత్ర ప్రసిద్ధిగన్న విక్రమాదిత్య మహారాజు ఈ ఉజ్జయినీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతని సోదరుడు “భట్టి మంత్రిగా, మరొక సోదరుడు భర్తృహరి విరాగియైన మహా పండితుడుగా, కాళిదాసాది మహాకవులు అతని అస్థాన నవరత్నాలుగా చరిత్ర ప్రసిద్ధము. ఈ భట్టి విక్రమార్కుల చరిత్రకథలుగా దేశములో చెప్పుకొంటూ ఉంటార్అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
విక్రమాదిత్యుని కాలంలో వరాహమిహిరాది జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఆ శాస్త్రానెంతో అభివృద్ధి చేశారు. ఒక నక్షత్రశాలనే ఉజ్జయినిలో నిర్మించారు. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ఆయువుపట్టు అయిన "దేశాంతర శూన్యరేఖ” ఉజ్జయిని నుండే ప్రారంభమైనది. జ్యోతిష్య శాస్త్రంలో సున్నా డిగ్రీగా పరిగణించేది ఆ ఉజ్జయినీ లంకారేఖయే.
ఉజ్జయినీ నగర నివాసము శిప్రా (క్షిప్రా/చ్చిప్రా) నదీస్నానము, మహాకాళేశ్వర ధ్యానము/దర్శనము, అక్కడ మరణించుట సర్వపాపహరమనీ, అష్టైశ్వర్యప్రదమనీ, మోక్షప్రదమనీ స్కంద పురాణము అవంతికా ఖండము 26వ అధ్యాయం 17, 18, 19 శ్లోకములలో వివరింపబడింది.
జ్యోతిర్లింగం ఎలా వెలిసిందంటే..
ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో వేదవేదాంగవేత్త, నిత్యసార్థివ శ్రీలింగ పూజాతత్పరుడు అయిన వేదప్రియుడు అను బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి దేవప్రియుడు, సుమేదసుడు, సుకృతుడు, ధర్మవాహుడు అను నలుగురు కుమారులు కలిగారు. వారి సుగుణముల వలన ఉజ్జయినీ నగరమే బ్రహ్మతేజముతో కళకళలాడింది.
అయితే ఉజ్జయినికి దగ్గరలో నున్న రత్నమాలా అనే పర్వతమున దూషణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తపస్సు చేసి బ్రహ్మ నుండి వరములను పొందాడు. ఆ వర గర్వముతో దేవతలను ఓడించి పారద్రోలాడు. దౌర్జన్యంతో యజ్ఞాది క్రతువులను చేసేవారిని హింసించి యజ్ఞధ్వంసం చేసేవాడు. ప్రజలు వేదోక్త ధర్మాలను వదలిపెట్టారు. పుణ్యతీర్ధములు నిస్సారములయ్యాయి. కాని ఉజ్జయిని (అవంతికానగరం)లో మాత్రం వైదిక ధర్మము చెడిపోలేదు.
సిరిసంపదలతో కళకళలాడేది. దానిని ఆ రాక్షసుడు చూచి సహించలేకపోయాడు. దేవతలు, రాజాధిరాజులు నా ఆజ్జలను తలదాల్చుచుండగా ఈ ఉజ్ఞయినిలోని వారు పాటించడం లేదు. వారిని శిక్షించవలసినదే.. వేద ధర్మమును, పూజలను విడిచిపెట్టి నా శరణు కోరిన సరే లేకపోతే ఉజ్జయిని వాసుల జీవితములు ముగిసినట్లే అని వారికి చెప్పిరండని నలుగురు మంత్రులను పంపించాడు. వారు ఉజ్జయినికి వెళ్ళి ప్రజలకు, వేదప్రియుని నలుగురు కొడుకులకు దూషణుని మాటలు చెప్పారు. కాని వారు దూషణుని మాటలను లెక్కచేయలేదు, భయపడలేదు.
దూషణుడు నగరమును దండెత్తకమానడని తలచిన ఉజ్జయిని నగరములోని బ్రాహ్మణులు, వేదప్రియుని కొడుకులు ప్రజలకు ధైర్యము చెప్పి తాము పార్ధివ శివ లింగమును నిర్మించి యధాశాస్త్రముగా, ఏకాగ్రచిత్తులై శివపూజ చేస్తున్నారు. ఆ ధూషణాసురుడు తన సైన్యముతో వచ్చి వారిని చంపుడని తన సైనికులను ఆజ్ఞాపించాడు. తానును బ్రహ్మ హత్యకు తలపడి కత్తిచేతబట్టి వచ్చాడు. బ్రాహ్మణులను బాధపెడుతున్నాడు. అయినా వారు దీక్ష వదలక శివుని పూజిస్తూనే ఉన్నారు.
ఆ సమయమున పార్ధివ శివలింగ ప్రతిష్ట జరిగిన చోటున భయంకరమగు శబ్దముతో పెద్ద అఘాధం (గొయ్యి) ఏర్పడింది. దానిలో నుండి మహేశ్వరుడు ఉద్భవించి “ఓరీ దూషణా! నీవంటి దుర్మార్గులను, సాధుహంసకులను నశింపజేయడానికి మహా కాళరూపుడనై వచ్చాను” అని చెప్పి ఒక్క హుంకారముతో ఆ దూషణాసురుని, అతని సేనలను సంహరించాడు. చావగా మిగిలినవారు పారిపోయారు. శివసాక్షాత్కారము వలన రాక్షసుల బాధలు తొలగిపోయాయి. దేవతలు పుష్ప వర్షము కురిపించారు.
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు వచ్చి మహాకాళేశ్వరుని పూజించారు. బ్రాహ్మణులు నమస్కరించారు. అప్పుడు శివుడు వరము కోరుకోమన్నాడు. వారు మహాకాళేశ్వరా నీవు ఈ స్థలమున జ్యోతిర్లింగముగా వెలసి భక్తుల అభీష్టములను తీర్చుచు, వారికి మోక్షమును ప్రసాదింపుచుండుము అని కోరారు. ఇట్లు పరమేశ్వరుడు ఉజ్జయినిలో మహాకాలేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగమై వెలసి భక్తుల కోరికలను తీరుస్తూ, చిత్తశుద్ధిని, ముక్తిని ప్రసాదిస్తున్నాడు.
సూతుని వలన పై గాధను వినిన సౌనకాది మునులు మహాకాళేశ్వరుడిని ఆరాధించి భక్తుల చరిత్ర చెప్పుమని అడిగారు. దానికి సూతుడిట్లు చెప్పుచున్నాడు.
ఒకప్పుడు ఈ ఉజ్జయినీ నగరాన్ని మహాశివభక్తుడైన “చంద్రసేనుడు” అనే రాజు పరిపాలించేవాడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నుడైయున్న సమయంలో శ్రీకరుడు అనే అయిదేండ్ల గోపబాలకుడు తన తల్లితో అక్కడికి వచ్చి రాజు చేస్తున్న పూజను చూశాడు. తను కూడా అలాగే శివుని పూజించాలనుకొని ఆ బాలుడు తిరిగి వచ్చుచు దారిలో దొరికిన ఒక గులకరాయిని తీసికొచ్చి దానినే శివలింగముగా భావించి దానికి అభిషేకము, చందన పుష్పాదులతో పూజను అతి శ్రద్ధగా చేస్తూండేవాడు.
ఒకనాడు ఆ బాలుడు ధ్యానములో బాహ్య స్కృతిలేనంతగా నుండగా అతని తల్లి భోజనమునకు రమ్మని చాలాసార్లు పిలిచి, చివరకు విసిగిపోయి శివలింగమును, పూజాద్రవ్యాలను తీసిపారవేసి బాలుని బలవంతముగా భోజనమునకు తీసుకెళ్ళ బోయింది. కాని ఆ బాలుడు విలపిస్తూ శంభో! మహాదేవ అని ఎలుగెత్తి పిలవసాగాడు. తల్లి చేయునది లేక ఇంటికి పోయింది. బాలుడట్లు ఆక్రందనము చేస్తూ మూర్చపోయాడు.
శివుడు కరుణించి ఆ బాలుని పునర్జీవితుడిని చేశాడు. బాలుడు కనులు తెరిచేసరికి ఒక దివ్యమందిరము, అందు జ్యోతిర్లింగము కనపడగా బాలుడు మరింత సంతోషముతో శివుడిని స్తుతించాడు. తిరిగి బాలునికై వచ్చిన అతని తల్లి జరిగినదంతయు కనులారా చూచినదై బిడ్డని ఎత్తుకొని మైమరచింది. రాజైన చంద్రసేనుడికీ విషయము తెలిసి వెంటనే వచ్చి బాలుని కొనియాడాడు.
ఆ సమయమున అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమై అక్కడ చేరిన భక్తులందరితో “భక్తులారా! ఈ ప్రపంచమున పరమశివుని మించిన పరతత్వము ఇంకొకటి లేదు. మహర్షులు వేల సంవత్సరములు తపస్సు చేసినా పొందలేని మహాఫలమును ఈ బాలకుడు పొందాడు. ఇది ఆ దయామయుని కృపాఫలమే. మీరును ఈ భగవద్దర్శన పూజాదులతో కృతార్థులవండి. ఈ బాలకుని వంశమున ఇతనికి యెనిమిదవ తరమువాడుగా ఈ శ్రీకరుడను బాలకుడే నందగోపుడను పేరును తిరిగి పుడతాడు. అతని వాత్సల్యము ప్రేమలను పొందుటకు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి నానావిధలీలలతో భక్తులనాదుకొంటాడు” అని చెప్పి అంతర్థానమయ్యాడు. తర్వాత చాలాకాలం చంద్రసేన, గోపాలకులు శ్రీమహాకాలుడిని పూజిస్తూ ముక్తిని పొందారు.
ఉజ్జయినీ క్షేత్రములో దర్శించవలసిన ప్రముఖ ఆలయాలు
1 మహాకాళేశ్వర మందిరం, 2. హరిసిద్ధిదేవి, 3. ఐడా గణేశ్, 4. గోపాల మందిరం 5. గఢ్ కాళికా, 6. భరహరి గుహ, 7. కాలఖైరవుడు 6. సాందీపని ఆశ్రమం 9. సిద్ధవటము 10. మంగళనాధుడు 11. నక్షత్ర వేదశాల 12. శిప్రానది మొదలగునవి. స్కందపురాణములో ఉజ్జయినిగా పిలువబడే అవంతికా క్షేత్రములో శివలింగముల సంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది 84. అవంతికా ఖండమున ఒక్కొక్క శివలింగము గూర్చి ఒక్కొక్క అధ్యాయము చొప్పున వర్ణింపబడింది.
2. మహాకాళేశ్వర మందిరము : ఉజ్జయినీ వెళ్ళేటటువంటి వారు దర్శించవలసిన ముఖ్య క్షేత్రం ఉజ్జయినీ మహాకాళ మందిరము. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రము. మహాకాలుడుగా కాలానికి అధిపతిగా సూచింపబడిన క్షేత్రము. అఖండ భారతానికి మధ్య స్థానము నవగ్రహాలలో సూర్యుని స్థానముగా మహాకాళేశ్వరుని గురించి చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు.
3. హరిసిద్ధిదేవి : విక్రమాధిత్యుడు నిత్యం కొలిచిన దేవి హరిసిద్ధి మాత. రుద్ర సరోవరమునకు దగ్గరలో విశాల ప్రాకారంతో హరిసిద్ధి దేవి మందిరమున్నది.
ఇది అవంతికా శక్తి పీఠము, విక్రమాదిత్యుడు ఆరాధించిన భవానీ ఈమెయే. గుజరాత్‌లోని మూలద్వారకావల సముద్రతీర పర్వత శ్రేణిలో మరొకదేవి ఉంది. రెండును ఒకే ఆకారములో నుండుట విశేషము. ఇచటి దేవీ పీఠమున నున్నది శ్రీ చక్రము. దాని వెనుక అన్నపూర్ణా మందిరము, దాని తూర్పుద్వార సమీపమున చిన్నబావి, మధ్యలో స్తంభము, దగ్గరలో సప్తసాగరమనే సరస్సు, హరిసిద్ధి మందిరము వెనుక అగస్తేశ్వర మందిరము గలవు. మహాకాళ మందిరం నుండి ప్రధాన వీధికి వెళ్లు తోవలో 24 స్తంభముల మండపము ప్రాచీన సింహ ద్వారా శిధిలావశేషము ఉంది. భద్రకాళీదేవి ఇచటనే ఉంది.
4. గోపాలమందిరం : ఇది మధ్యవీధిలో ఉంది. ఇందులో రాధాకృష్ణ, శంకర మూర్తులున్నాయి. ఈ మందిరాన్ని రాజాదౌలత్ సింధియా భార్య బాయజాబాయి కట్టించింది.
5. గఢకాలికా : అష్టాదశ శక్తి పీఠాలలో ఉజ్జయినీ క్షేత్రంలో వెలసిన శక్తి పీఠం గఢకాలికా శక్తి పీఠం. కాళిదాసుకు గఢకాలికగా అమ్మవారు దర్శనమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రం గఢకాలికా మందిరము. గోపాలమందిరం నుండి మార్గమున్నది. ఇది నగరానికి మైలు దూరంలో ఉంది. మహాకవి కాళిదాసు ఈ కాళిని ఆరాధించియే మహాకవి అయ్యాడు. కాళీమందిర సమీపంలో స్థిరగణేశ మందిరము, దానికెదురుగా ప్రాచీన హనుమన్మందిరము ఉన్నవి. అచట శ్రీమహావిష్ణుని విగ్రహము, దాని సమీపములో గౌరభైరవమూర్తి, దానికి దగ్గరలో మహాశ్శశానం ఉన్నాయి.
6. భర్తృహరి గుహ : మహాకాళీ దేవళమును కుత్తరంగా రెండు ఫర్లాంగుల దూరంలో భర్తృహరి గుహ, అతని సమాధి ఉన్నాయి. ఒక సందులో నుండి గుహలోకి ప్రవేశించవలసి యుండును.
7. కాలభైరవ క్షేత్రము: నగరం నుండి మూడు మైళ్ళ దూరంలో శిప్రానది యొడ్డున ఒక దిబ్బపై కాలభైరవాలయమున్నది.
8. సిద్ధవటము : కాలభైరవ క్షేత్రమునకు తూర్పు భాగమున శిప్రానది అవతలి యొద్దువ సిద్ధవటమును ప్రసిద్ధ స్థానమున్నది. ఇక్కడి వటవృక్షము మొదట్లో నాగబలి నారాయణ బలి మొదలైనవి సమర్పించి సిద్ధవటము నారాధిస్తారు.
9. సాందీపని ఆశ్రమం : (అంకపదము): శ్రీకృష్ణుడు తన బాల్యమునందు విద్యాభ్యాసము చేసిన ప్రదేశము ఉజ్జయినీ క్షేత్రం. శ్రీకృష్ణుడు కుచేలుడు కలసి సాందీప మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసము చేసిన ప్రదేశాన్ని ఉజ్జయినీలో దర్శించవచ్చు. గోపాలమందిరము నుండి రెండు మైళ్ళ దూరంలో మంగళనాధ క్షేత్రమునకు వెళ్ళు త్రోవలో ఉన్నది. దీనికి దగ్గరలో విష్ణు సాగరము, పురుషోత్తమ సాగరము ఉన్నాయి. చిత్రగుప్తుని ప్రాచీన స్థానమిచటనే ఉన్నది. సాందీపని ఆశ్రమమున కావల జనార్థనమందిరమున్నది.
11. నక్షత్ర వేధశాల (యంత్ర మహల్): ఇది శిప్రానది దక్షిణ తీరమున ఇప్పుడు జీర్ణావస్థలో ఉంది. అందలి యంత్రములు నేటికినీ కొన్ని ఉపయోగిస్తాయి.
పై స్థలములు కాక ఇంకా యెన్నో శివాలయాలు, శక్తి ఆలయాలు, తీర్ధములు (చెరువులు మొదలగునవి) భైరవాలయాలు, రుద్రక్షేత్రాలు ఉన్నాయి.
స్కంద పురాణ ప్రకారం ఇచట మరణించిన వారికి తిరిగి జన్మముండదు కావున ఇది ఊషరక్షేత్రమని, పాపాలను నశింపజేస్తుంది కావున క్షేత్రమనీ, మహాశ్శశానమనీ, మహాకాళవనమనీ, మోక్షప్రదమైనదని ఉజ్జయినిగా పేరొందిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.