Maha shivaratri 2024: మాస శివరాత్రి, మహా శివరాత్రికి ఉన్న తేడా ఏంటి? మహా శివరాత్రి విశిష్టత ఏంటి?
Maha shivaratri 2024: నెలకి ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. అసలు శివరాత్రులు ఎన్ని రకాలు, వాటి ప్రత్యేకత ఏంటి? మహా శివరాత్రి విశిష్టత ఏంటి అనేది పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలిపారు.

Maha shivaratri 2024: పంచాంగ రీత్యా , సిద్ధాంత పంచాంగ గణితం అధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘ మాస బహుళ పక్ష రోజు 8 మార్చి 2024 రోజు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభంగా జరుపుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రిగల) చతుర్దశినాడు “మాస శివరాత్రి" గా జరుపుకుంటారు. పరమ శివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. ఆరోజున శివాలయాలలో దీపం వెలిగించడం వలన విశేష ఫలము లభిస్తుంది. ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివరాత్రినాడు ఆచరించవలసిన విధులు.
శివరాత్రులు ఎన్ని రకాలు
శివరాత్రులు ఐదురకాలు. అవి..
1. నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు.
2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షములలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం.
3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాస శివరాత్రి.
4. మహా శివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వథ్రేష్టమన శివరాత్రి.
5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో నివసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా ఉపవాసం చేయాలి. భోగానందాన్ని విస్మరించి, యోగా నందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివ జ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన అధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహా శివరాత్రి ఆంతర్యం. మహా శివరాత్రి నాటి అర్థరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిరుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివుడు అభిషేక ప్రియుడు కావున మాసశివరాత్రులు/మహాశివరాత్రినాడు రుద్రాభిషేకాలు, శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదయం సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్ర వ్రతం అంటారు. సోమవారం 'ఇందు ప్రదోషం'గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనము. 16 సోమవారములు నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరుతాయని చిలకమర్తి తెలియచేశారు.
శివలింగం ఆవిర్భావం
ఒకనాడు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదము ఇద్దరి మధ్య తలెత్తింది. ఆవాదన తీవ్రతరం కావడం చూసి దేవతలు అందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది. ఆ లింగంలోని శివుడు బయల్వెడలి ఈ లింగం ఆది, అంతాలను కనుగొన్నవారు గొప్ప అని నిర్ణయిస్తాను అన్నాడు. దానికి సరేనంటూ బ్రహ్మ హంస వాహనారూఢుడై ఊర్థ్వ ముఖంగా పైభాగం వైపు బయల్దేరుతాడు.
విష్ణువు శ్వేత వరాహరూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకొనేందుకు అథోముఖంగా క్రింది వైపునకు బయల్దేరతాడు. వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది, అంతాలను తెలుసుకోలేక పోయారు. ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకీ (మొగలి) పుష్పాన్ని చూశాడు. అతను కేతకీ పుష్పముతో “నువ్వు పైనుండే వస్తున్నావుకదా! నాకొక సాయం చేయాలి. నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి” అన్నాడు. దానికి కేతకీ పుష్పం సరే అన్నది.
ఇద్దరూ కలసి క్రిందికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది. 'నేను శివలింగపు చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి” అని బ్రహ్మ గోవును అడుగుతాడు. ఆయన మాట తీసివేయలేక గోమాత సరేనంటుంది. లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా "నేను అలింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను. దానికి ఈ కేతకీ పుష్పము, గోమాతలే సాక్ష్యం” అంటాడు. శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడు చూశాడని చెబుతుంది. అదే విషయం గోమాతను అడుగగా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది.
తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కానీ, పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు కేతకీ పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు. గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని, వెనుక భాగాన్ని చూస్తే పాపపరిహారం జరుగుతుందని శపిస్తాడు.
విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వ (సర్వ్ర)వ్యాపకత్వము అనుగ్రహిస్తాడు. అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణికోటిని రక్షించే భారము, భోగ, మోక్షములనిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు. బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు. ఆ సహ్యాద్రి పర్వతములలోని శివలింగమే త్యంబకేశ్వరుడు. ఇదీ లింగోద్భవ కథనం. అష్టాదశ పురాణాలలోని కూర్మ వాయు, శివ పురాణాలలో ఈ కథ చెప్పబడిందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపము అయినప్పటికీ శివ రూపమే సనాతనము. ఇదియే సకల రూపములకు మూలము. శ్రీహరి మహాదేవుని వామ భాగము నుండి, బ్రహ్మ దక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యెను. సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు, ప్రకృతి పురుషులకు అతీతుడు, నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ.
గుణనిధి అనే ఒక దుర్వ వ్రైసనపరుడు. నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రినాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్తరీయపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జత చేసి ఆవునెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు.
శివలింగం విశిష్టత
బతుకంతా దుళ్ళీలుడై నడచినా శివరాత్రినాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితం దక్కింది. మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించాడు. ఆపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్బాలకుడై శివుడికి ప్రాణ సఖుడయ్యాడన్న కథ భథ్రీనాథుడి కాశీ ఖండంలో ఉందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నదీ ఈరోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడిని శ్రీ కృష్ణుడు ప్రార్ధించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివి అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్ధాలు.
“శు అంటే శివుడని, విఅంటే శక్తి అని “శివపదమణిమాల” చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్ష మాలతో 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.
క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. నిర్ణయసింధులోని నారద సంహితలో శివరాత్రి వ్రతవిధానం గురించి ఉంది. మార్మండేయుడు, నత్మీరుడు, సిరియాళుడు, చిరుతొండనంవి, తిన్నడు, శక్మనైనారు, అక్కమహాదేవి, బెజ్ఞ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.