Lord Rama: శ్రీరాముడికి విరూపాక్ష ఆలయానికి ఉన్న అనుబంధం గురించి తెలుసా?
Lord Rama: అయోధ్య శ్రీరాముడికి కర్ణాటకలోని విరూపాక్ష ఆలయానికి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అదేమిటంటే..
Lord rama: దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి విరూపాక్ష ఆలయం. కర్ణాటకలోని హంపి నగరంలో ఉన్న విరూపాక్ష ఆలయానికి శ్రీరామునికి సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ హంపి ప్రాంతాన్ని రామాయణ కాలం నాటి కిష్కింద నగరం అని పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడిని విరూపాక్ష రూపంలో పూజిస్తారు.
రాముడికి విరూపాక్ష ఆలయానికి మధ్య అనుబంధం
కిష్కింద నగరం అంటే నేటి హంపిగా పిలుస్తారు. ఈ స్థలానికి అయోధ్య రాముడికి చాలా అనుబంధం ఉందని అంటారు. రావణుడు సీతా దేవిని ఎత్తుకుని వెళ్లేటప్పుడు ఈ మార్గంలో సీతమ్మ తల్లి నగలు పడిపోయినట్టు పురాణాలు చెబుతున్నాయి. సీతాదేవిని వెతుక్కుంటూ రాముడు హంపికి వచ్చాడు. దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడ అనేక ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయని చెప్తారు. ఈ ఆలయంలో ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా శ్రీరాముడు తపస్సు చేసుకున్న విగ్రహాలు కనిపిస్తాయి. ఇలాంటి విగ్రహాలు మరే ప్రాంతంలోను లేవు.
రావణుడు వెళ్తున్న సమయంలో సీతాదేవి నగలు ఆ ప్రాంతంలో పడిపోయినాయట. వాటిని సుగ్రీవుడు రాముడికి చూపించగా అవి సీతమ్మ తల్లివేనని రాముడు గుర్తించాడు. అప్పుడు సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం వానర సైన్యం సహాయం తీసుకుని లంకకి ప్రయాణం అయినట్టు స్థల పురాణం చెబుతుంది. రాముడు లంకకి వెళ్ళే ముందు హంపిలోని విరూపాక్షుడిని పూజించి ఆశీర్వాదం తీసుకున్నాడని చెప్తారు.
లంకకి వెళ్ళిన రాముడు రావణుడి మీద యుద్ధం చేసి విజయం సాధించాడు. తర్వాత సీతా లక్ష్మణులతో తిరిగి అయోధ్యకి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఈ కిష్కింద నగరానికి వచ్చినట్టు చెప్తారు. ఈ నగరంలో కొన్ని రోజులు బస చేశాడు. వనవాస సమయంలో హంపిలో రాముడు నివసించిన జాడలు ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తాయి.
హంపి గుడిలో ఉన్న నంది విగ్రహం సుమారు ఒక కిలోమీటరు దూరం వరకు కనిపిస్తుంది. గుడి బయట ప్రాకారంలో ఏక శిలతో ఈ నంది విగ్రహం చెక్కారు. హంపి వీధికి పశ్చిమ చివర ఈ విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది. చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయం దర్శించుకునేందుకు ఎంతో మంది సందర్శకులు వస్తూ ఉంటారు. హంపి దేవాలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు వరకు ఉన్న తూర్పు గోపురంలో రెండు ఖానాలు రాతితో నిర్మించారు. మిగతా ఏడు ఇటుకలతో నిర్మించారు. ఈ తూర్పు గోపురం నుంచి లోపలికి ప్రవేశిస్తే బయట నుంచి లోపలికి వెళ్తుంటే ఆకాశం కనిపిస్తుంది.
వంట గది మరొక ప్రత్యేకత
తుంగ భధ్ర నది నుంచి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశిస్తుంది. అది గుడి వంట గదికి నీరు అందించి మరొక మార్గం ద్వారా బయటకి వెళ్లిపోయేలాగా నిర్మాణం చేశారు. ఈ ఆలయం అభివృద్దిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర చాలా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.