Katyayani vratam: శ్రీ కాత్యాయనీ వ్రతము అంటే ఏమిటి? ఈ వ్రతం ఎవరు ఆచరించాలి?-what is sri katyayani vratam who should practice it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Katyayani Vratam: శ్రీ కాత్యాయనీ వ్రతము అంటే ఏమిటి? ఈ వ్రతం ఎవరు ఆచరించాలి?

Katyayani vratam: శ్రీ కాత్యాయనీ వ్రతము అంటే ఏమిటి? ఈ వ్రతం ఎవరు ఆచరించాలి?

HT Telugu Desk HT Telugu

Katyayani vratam: కాత్యాయనీ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించడానికి పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సవివరంగా చెప్పారు.

కాత్యాయనీ వ్రతం అంటే ఏంటి?

Katyayani vratam: కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు (పెళ్ళి కానివారు) ఆచరించవచ్చును. ఒకసారి వివాహము రద్దు అయినవారు ఆచరించవచ్చును. ఒకసారి వివాహము అయి కొన్నిదినములకే భర్తపోయినవారు ఆచరించవచ్చును.

ఒకసారి వివాహము అయి విడాకులు తీసుకున్నవారు ఆచరించవచ్చును. తరుచుగా వివాహ ప్రయత్నములు విఫలమగుచున్నవారు ఆచరించవచ్చును. మీ మనస్సుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు ఆచరించవచ్చును. అన్నివిధాల తగిన సంబంధము కోసం అన్వేషణ చేస్తున్నవారు ఆచరించవచ్చును. కుజ దోషము జాతకచక్రములో ఉన్నవాళ్ళు ఈ వ్రతం ఆచరించవచ్చు.

కుజ మహర్దశ, అంతర్దశ, విదశ జరుగుచున్నవారు ఆచరించవచ్చును. రాహు మహర్దశ, అంతర్దశ, విదశ జరుగుచున్నవారు ఆచరించినా మంచిదే. ఎంతమంది పెళ్ళికొడుకులు చూసిన నచ్చని వారు ఆచరించవచ్చును. ఆర్థిక స్తోమత లేక (కట్నం ఇవ్వలేక) వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును. జాతక చక్రములో రాహు కేతు దోషములు కలవారు ఆచరించవచ్చును. స్త్రీ జాతకచక్రములో సప్తమ, అష్టమ స్థానములలో పాప గ్రహములు ఉండి వివాహ ప్రయత్నములు సఫలం కాని వారు ఆచరించవచ్చును. నిశ్చితార్ధం అయి పెళ్ళి వాయిదా పడుచున్నవారు ఆచరించవచ్చును అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కాత్యాయనీ వ్రతం ఆచరించడానికి నియమాలు

మంగళవారము నాడు ఈ వ్రతము ఆచరించవలెను. మంగళవారము, కృత్తికాన క్షత్రము కలిసి వచ్చినచో మంచిది. మంగళవారం కృతికా నక్షత్రము, షష్టి తిధి కలిసి వచ్చినచో మరీ మంచిది. నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితి పర్వదినములలో ఈ వ్రతము ఆచరిస్తే మంచిది. దేవీ నవరాత్రులలో కూడ ఈ వ్రతము ఆచరించవచ్చును. బంగారముతోగాని, పసుపు కొమ్ములతోగాని వారి శక్తానుసారముగా మంగళసూత్రములు కలశానికి అలంకరించవలయును.

కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యంగా ఉంచాలి. ఏడు చెరుకు ముక్కలను (తొక్కతీసినవి) కూడా నైవేద్యంగా ఉంచాలి. వ్రతము పూర్తిచేసిన తరువాత వ్రత కథ విని అక్షితలు అమ్మ వారి మీద ఉంచి పిదప ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకొని ఆశీర్వాదము తీసుకొని రాత్రి భోజనము చేయవలెను. 7 మంగళవారాలు భక్తితో జరుపవలెను. మధ్యలో ఏ వారమైన ఆటంకము వచ్చినచో ఆపై వారము జరుపుకొనవలెను. 8వ మంగళ వారము నాడు ఉద్యాపన జరుపుకొనవలెను.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోయవలెను. వీలు కాని వారు ఉదయం ముత్తైదువుల గృహమునకు వెళ్ళి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానమునకు ఇచ్చి రావలెను. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు 7 అప్పాలను, 7 చెరుకు ముక్కలు, 7 రవికలను వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి) వారిచే అక్షతలు వేయించుకొని ఆశీస్సులు పొందవలెను.

వ్రత విధానం

ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజచేయవలెను. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును ఉంచి కలశములో పవిత్రమైన నీరు సగము పోయవలెను. అమ్మవారి విగ్రహం లేదా ప్రతిమగా రూపాయి ఉంచవలెను. ఇంటిలో తూర్పువైపున ఈశాన్య దిక్కున శుభ్రముచేసి ముగ్గులు వేసి ఎర్రకండువా పరచి దానిమీద బియ్యం పోయవలెను. బియ్యంపైన రాగిచెంబుగాని, ఇత్తడి చెంబుగాని ఉంచి టెంకాయను ఉంచి దానిని ఎర్రని రవిక కీరిటంలా పెట్టాలి. (కలశస్థాపన చేయాలి). ఈ వ్రతములో ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్టం. వ్రతము అయిన తరువాత వండిన భోజన పదార్థములు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకొనవలయును.

వ్రతమండపములో పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి. సాయంకాలము ఈ వ్రతము ఆచరించవలెను. పగలంతా ఉపవాసము ఉండవలెను. వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి. పగలు నిద్రపోరాదు. చివరివారములో పుణ్యస్త్రీలకు దక్షిణ తాంబులాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను సమర్పించాలి. ఆర్థిక స్తోమత లేనివారు వ్రతం ఆచరించలేనివారు ఏడుగురు వివాహం కాని కన్యలకు 7 పుస్తకములను ఇచ్చిన మంచిదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి