Varahi navaratri 2024: వారాహీ నవరాత్రుల విశిష్టత ఏమిటి?వారాహీ అనుగ్రహ అష్టకం చదవడం వల్ల ప్రయోజనాలు
Varahi navaratri 2024: వారాహీ నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు అనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
Varahi navaratri 2024: ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో శ్రీ వారాహీ అమ్మవారిని భక్తులు పూజిస్తారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారని చిలకమర్తి తెలిపారు.

శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి. ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుంటుంది. అందువలన ఈమె వరాహ స్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అనగా వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుందని చిలకమర్తి తెలిపారు.
వారాహీ అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల (నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి(బృహద్వారాహి) అని అంటారు.
అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత అని చిలకమర్తి తెలిపారు.
1. ఉన్మత్త వారాహీ
2. బృహత్ వారాహీ
3. స్వప్నవారాహీ
4. కిరాతవారాహీ
5. శ్వేత వారాహీ
6. ధూమ్రవారాహీ
7. మహావారాహీ
8. వార్తాలి వారాహీ
9. దండిని వారాహీ
10. ఆది వారాహీగా అమ్మవారిని భక్తులు పూజిస్తారని చిలకమర్తి తెలిపారు.
ఈ వారాహీ దేవి స్తోత్ర పఠనం వల్ల సర్వ దుఃఖములు నశిస్తాయి. శ్రీ వారాహీదేవిని మనసున తలచినంతనే వారి శత్రువులు నిగ్రహింపబడతారు. తన భక్తులకు ఎనలేని శుభాలు కలిగించును. తన భక్తులయందు ఎల్లప్పుడు దయ కలిగి ఉంటుంది, కోరిన ఫలములు శీఘ్రమే ప్రసాదించును. తన భక్తులకు విఘ్నములు, ఆపదలు కలుగకుండా ఎల్లవేళల యందు కాపాడును.
శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం
ఈ అష్టకం చదువుకోవడం వల్ల విఘ్నాలు తొలగి విజయాలు, శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
ఈశ్వర ఉవాచ
మాతర్జగద్రచననాటకసూత్రధారస్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ |ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్ కో న్యః స్తవం కిమివ తావకమాదధాతు
నామాని కింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండః యల్లేశలంబితభవాంబునిధిర్యతో యత్ త్వన్నామసంస్మృతిరియం న నునః స్తుతిస్తే
త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా నందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః మాతర్నమామి సుదీనాని సదేశ్యముం త్వామభ్యర్థయే రమితి పూరయతాద్దయాలో
ఇంద్రేందుమౌలివిధికేశవమౌలిరత్న రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే చేతో నతౌ మమ సదా ప్రతిబింబితా త్వం భూయా భవాని భవనాశిని భావయే త్వామ్
లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తేర్వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసాత్వం దేవి వామతను భాగహరా హరస్య
త్వామంబ తప్తకనకోజ్జ్వలకాంతిమంతర్యే చింతయంతి యువతీతను మాగలాంతామ్
చక్రాయుధాం త్రినయనాం వరపోతృవక్రాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః
త్వత్సేవనస్థలితపాపచయస్య మాత ర్మోపి యస్య న సతో గణనాముపైతి దేవాసురోరగనృపూజితపాదపీఠః కస్యాః శ్రియః స ఖలు భాజనతాం న ధత్తే
కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం
కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయామ్
కిం దుర్భరం త్వయి సకృత్ స్మృతిమాగతాయాం
కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసామ్
ఇతి శ్రీ వారాహ్యనుగ్రహాష్టకమ్