తమిళ‌నాడులోని మహిమాన్విత సుబ్ర‌హ్మ‌ణ్య‌ క్షేత్రం స్వామి మ‌లై విశిష్ట‌త ఏమిటి-what is special about the glorious subrahmanya kshetra swami malai in tamil nadu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  తమిళ‌నాడులోని మహిమాన్విత సుబ్ర‌హ్మ‌ణ్య‌ క్షేత్రం స్వామి మ‌లై విశిష్ట‌త ఏమిటి

తమిళ‌నాడులోని మహిమాన్విత సుబ్ర‌హ్మ‌ణ్య‌ క్షేత్రం స్వామి మ‌లై విశిష్ట‌త ఏమిటి

HT Telugu Desk HT Telugu
Aug 04, 2024 08:00 AM IST

తమిళనాడులో వెలిసిన మహిమాన్విత సుబ్రహ్మణ్య క్షేత్రం ఎలా వెలిసింది? ఈ క్షేత్ర విశిష్టత గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

సుబ్ర‌హ్మ‌ణ్య‌ క్షేత్రం స్వామి మ‌లై విశిష్ట‌త
సుబ్ర‌హ్మ‌ణ్య‌ క్షేత్రం స్వామి మ‌లై విశిష్ట‌త (pinterest)

తమిళ‌నాడులోని మహిమాన్విత సుబ్ర‌హ్మ‌ణ్య క్షేత్రం స్వామిమలై సుబ్రహ్మణ్యస్వామి వెలసి ఉన్న ప్రసిద్ధ పుణ్య క్షేత్రమ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

ఇది తమిళనాడులో ఉన్న తంజావూరు జిల్లాలో కుంభ కోణం సమీపంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆరు ప్రసిద్ధక్షేత్రాలలో ఇది ఐదవదని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి శివుడికి ప్ర‌ణ‌వ‌మంత్రం అర్థాన్ని తెలియ‌జేశాడు. ఇక్క‌డ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని స్వామినాథ స్వామి పేరుతో కొలుస్తారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. స్వామినాథ అంటే గురుస్వ‌రూప‌మ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

ఈ క్షేత్రం అర‌వై మెట్ల‌పై ఉన్న కొండ‌మీద కొలువై ఉంది. ఈ అర‌వై మెట్లు మ‌న అర‌వై సంవ‌త్స‌రాల వ‌య‌సుకు సంకేత‌మ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. కొండపైన సుబ్రహ్మణ్యుని ఆలయం వెలుపల విఘ్నేశ్వరస్వామి వారి మందిరం ఉంది. స్థ‌ల‌పురాణం ప్ర‌కారం.. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు కైలాసం వైపు వెళుతూ ఉండగా సుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుణ్ణి ఆపి "బ్రహ్మమనగా ఏమి?, ప్రణవమునకు అర్థం తెలుసా?!" అని అడిగాడు.

సుబ్రమణ్య స్వామి ఆవిర్భావం

“బ్రహ్మమనగా నేనే” అన్నారు చతుర్ముఖ బ్రహ్మ. మీరు నాలుగు ముఖములతో వేదములు చెబుతున్నారు. కానీ బ్రహ్మం అర్థం కాలేదు అని బ్రహ్మదేవుణ్ణి చెరసాలలో బంధించాడు సుబ్ర‌హ్మ‌ణ్యుడు. వెంట‌నే ప‌ర‌మ శివుడు వ‌చ్చి నాయ‌నా! బ్ర‌హ్మగారికి జ్ఞానంలో కించిత్ దోషం ఉండి ఉండొచ్చు. అంత‌మాత్రాన వారిని శిక్షించ‌రాదు అని చెప్ప‌గా సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి వెంట‌నే బ్ర‌హ్మ దేవుణ్ణి విడిచిపెట్టేశాడు.

అంతట సుబ్రహ్మణ్యుడు పరమశివునితో "తండ్రీ! నేను బ్రహ్మగారిని బంధించి పెద్ద తప్పు చేశాను. నేను మీ పుత్రుడను అయినంతమాత్రాన సృష్టికర్తను బంధించవచ్చునా? నేను వారిని బంధించి అవమానించాను. నేను ఇలా చేసి ఉండకూడదు. ఏది ఏమైనా నావల్ల మహాపరాధం జరిగింది. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా నేను సర్పరూపం దాల్చి భూలోకంలో ఉంటాను" అని చెప్పి సర్పరూపం దాల్చి భూలోకం చేరాడు సుబ్రహ్మణ్యుడు.

అలా స్వామి సర్పరూపంతో ఉండగా కొందరు ఆకతాయిలు, పిల్లలు వచ్చి ఆ సర్పాన్ని (సుబ్రహ్మణ్యుణ్ణి) రాళ్ళతో కొట్టసాగారు. అప్పుడు పార్వతీదేవి షష్ఠీవ్రతం చేయించింది. దాంతో సుబ్రహ్మణ్యుడికి సర్పరూపం పోయి తేజోమయుడైన సుబ్రహ్మణ్యుని రూపం వచ్చింది అని పురాణాలు తెలియ‌జేస్తున్నాయని ఆధ్యాత్మిక వేత్త చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

స్వామి మలై విశిష్టత

స్వామిమ‌లై అంటే దేవుని కొండ అని అర్థం. మొదట్లో 'స్వామి' అనే పదం సుబ్రహ్మణ్యుడికే వర్తింపజేసి చెప్పేవారు. ఎందుకంటే 'స్వామి' అంటే గురుస్వరూపం అని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. తనతండ్రి పరమశివునికే ప్రణవార్ధం బోధించి తాను ఇక్కడ గురుస్వరూపం పొందాడు సుబ్రహ్మణ్యుడు. అలా పుత్రునితో ప్రణవార్ధం చెప్పించుకొని తనయుని తెలివితేటలు చూసి శివుడు మురిసిపోయిన పవిత్రప్రదేశం ఈ క్షేత్రమేన‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. గొప్ప తపోనిధి, సప్తర్షులలో ఒకరు అయిన అగస్త్యమహర్షికి ద్రవిడ వ్యాకరణం బోధించి సుబ్రహ్మణ్యుడు ఆ మహర్షికికూడా గురువుగా మారింది కూడా ఈ క్షేత్రంలోనే.

పరమశివుడు పుత్రుని నుండి ప్రణవార్థం చెప్పించుకోడానికి మరో కారణంకూడా చెప్పబడింది. భృగుమహర్షి గొప్ప తపస్సంపన్నుడు. భృగు మహర్షి ఒకమారు తపస్సు ప్రారంభించే ముందు తన తపస్సునెవరైనా భంగంచేస్తే వారు వారికి అప్పటివరకు ఉన్న జ్ఞానాన్ని కోల్పోవునట్లు వరం పొంది తపస్సు ప్రారంభించాడు. మహర్షిగారి తపోనిష్ఠ అధికమై తీవ్రరూపం దాల్చి అన్నిలోకాల్లోనూ తాపం పెరిగింది. దాంతో దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నారు.

అప్పుడు శివుడు తపోదీక్షలో ఉన్న భృగుమహర్షివద్దకు వెళ్ళి మహర్షి నుండి ఆ తపోజ్వాలను ఆపడం కోసం తన అరచేతిని మహర్షి శిరస్సుపైన పెట్టాడు. అలా మహర్షితలపై చెయ్యి పెట్టగానే అప్పటివరకు శివునిలో ఉన్న జ్ఞానమంతా పోయింది. దానివల్ల అప్పట్నుంచి శివుడు జ్ఞాన శూన్యుడయ్యాడు. అందువల్ల బాలసుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారిని బంధించిన సందర్భంలో సుబ్రహ్మణ్యుడితో మాట్లాడి బ్రహ్మగారిని విడిపింపజేసి పిమ్మట తన పుత్రునికే తాను శిష్యుడై ప్రణవార్ధాన్ని తెలుసుకున్నాడు. పోయిన జ్ఞానాన్ని అలా తిరిగి పొందాడు శివుడు. అలా తన తండ్రియైన శివునికి ప్రణవార్ధాన్ని బోధించిన ఆ మహాపుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు వెలిశాడు. భక్తుల కోర్కెలు తీరుస్తూ నిత్యం సేవలందుకొంటున్నాడని చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు

ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ