నదుల రజోదోషమంటే ఏమిటి? ఆషాఢ, శ్రావణ మాసాలలో నదీ స్నానాలు ఆచరించవచ్చా..?
నదుల రజోదోషం అంటే ఏంటి? ఆషాడ, శ్రావణ మాసాలలో నదీ స్నానాలు ఆచరించకూడదా? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
కర్కాటక సంక్రాంతి సూర్యోదయం తర్వాత అయితే సంక్రమణా నంతరమే పుణ్యకాలమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
రాత్రి అయితే పూర్వదినంగాని, పరదినమునగాని ఐదు ఘడియలు పుణ్యకాలమని చిలకమర్తి తెలిపారు. కర్కాటకంలో కేశఖండన నిషిద్ధమని చిలకమర్తి తెలిపారు. సింహ సంక్రాంతి - కర్కాటక సంక్రాంతి మధ్య నదులన్నీ రజస్వలలు. ఆ నదీస్నానం నిషిద్ధం. (అయితే ఇవి సముద్రం వైపు పోయే నదులకు ఎండాకాలంలో ఎండిపోయే నదులకు మాత్రమే అని చెప్పబడింది.) ఏవి ఎండా కాలంలో ఎండిపోతాయో, వాటిలో మాత్రమే వర్షాకాలంలో స్నానం చేయరాదు. (పదిరోజులు నిండేదాక.) స్మృతి సంగ్రహంలో ఇట్లా ఉంది.
ఏ నదులు 8 వేల ధనుస్సుల దూరం ప్రవహించటం లేదో అవి నది శబ్దంలో పిలువ తగినవి కావు. వాటిని 'గర్తములు' అని పిలవాలి. పల్లములు గుంటలు అనాలి. కర్కాటక సంక్రాంతి ఆదిలో మహానదులు మూడు రోజులు రజస్వలలు. నాల్గవ రోజు గంగానది వలె శుద్ధమౌతాయి. మహానదులనగా గోదావరి, భీమరథి, తుంగభద్ర, వేణిక, తాపి, పయోష్టి, ఇవి వింధ్యకు దక్షిణంలో ఉన్నట్టి మహానదులు, భాగీరథి, నర్మద, యమున, సరస్వతి, విశోక, విహస్త వింధ్యకు ఉత్తర భాగంలో ఉన్నట్టి మహానదులు. ఈ పన్నెండు మహానదులు దేవర్షుల క్షేత్రం నుండి ఉద్భవించినట్టివి. మదనరత్నంలో పురాణాంతరాల్లో చెప్పబడింది. దేవిక, కావేరి, వంజర ఈ మహానదులు కర్కాటకం ఆదిలో మూడు రోజులు రజో దుష్టమౌతాయని, కాత్యాయనుడు మాత్రం - కర్కాటాదిలో గోమతి, చంద్రభాగ, సతి, సింధు, సరయు, నర్మద ఈ నదులు మూడు రోజులు రజో దుష్టమౌతాయి అన్నాడు. ఇది గంగ మొదలయిన వాని కన్న ఇతరమైన నదుల విషయము. ఈ నది స్నానాల విషయమై - తీరవాసులకైతే రజోదోషం లేదని చిలకమర్తి తెలిపారు.
టాపిక్