Polala amavasya vratam: పోలాల అమావాస్య వ్ర‌తం అంటే ఏమిటి? ఈ వ్ర‌తం ఆచ‌రిస్తే క‌లిగే ఫ‌లితాలు ఏమిటి?-what is polala amavasya vratam what is significance of this vratam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Polala Amavasya Vratam: పోలాల అమావాస్య వ్ర‌తం అంటే ఏమిటి? ఈ వ్ర‌తం ఆచ‌రిస్తే క‌లిగే ఫ‌లితాలు ఏమిటి?

Polala amavasya vratam: పోలాల అమావాస్య వ్ర‌తం అంటే ఏమిటి? ఈ వ్ర‌తం ఆచ‌రిస్తే క‌లిగే ఫ‌లితాలు ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Sep 02, 2024 06:31 AM IST

Polala amavasya vratam: శ్రావణ మాసంలో వచ్చే చివరి అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ వ్రతం ఎలా ఆచరించాలి, దీన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

పోలాల అమావాస్య వ్రతం అంటే ఏంటి?
పోలాల అమావాస్య వ్రతం అంటే ఏంటి?

Polala amavasya vratam: శ్రావ‌ణ‌మాసంలో వ‌చ్చే అమావాస్య‌ను పోలాల అమావాస్య అంటార‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ‌ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు. పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవత. దాదాపు ప్రతి ఊరి పొలిమేర్లలో అమ్మవారు కొలువుదీరి పూజలందుకుంటూ ఉంటుంది.

పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందనీ, సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం అని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అటువంటి దేవతను పూజిస్తూ వ్రతం చేసే పర్వదినమే పోలాల అమావాస్య అని చిల‌క‌మ‌ర్తి పేర్కొన్నారు. కేవలం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ పిల్లలకు అపమృత్యుభయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందేలా చేసే పుణ్యదినమే ఇది అని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో వ‌చ్చే అమావాస్యనే పోలాల అమావాస్యగా పిలుస్తార‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. దీనికే పోలా అమావాస్య, పోలాలమావాస్య, పోలాంబవ్రతం వంటి పేర్లు కూడా ఉన్నాయి. పోలాల అమావాస్య ఆచరణ వెనుక ఆసక్తి కరమైన గాథ ప్రచారంలో ఉంది.

పోలాల అమావాస్య కథ

పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండే వారు. వారికి ఏడుగురు కుమారులు ఉన్నారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. గ్రామంలో విడి విడిగా కాపురాలు పెట్టుకున్నారు. తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ ఏడు మంది శ్రావణమాసం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలు ఆచరించారు. ఆ మాసంలోని చివరి రోజు అయిన అమావాస్య నాడు పోలాంబవ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వ్రతం రోజు ఉదయాన్నే ఏడవ కోడలి కుమారుడు మరణించాడు. అందువల్ల వ్రతం చేయలేక పోయారు.

మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ మరణించింది. దీనితో వ్రతం చేయలేక పోయారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం.. ఆ రోజు ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం, వ్రతం చేయలేక పోవడం.. ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరు మంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడ లేని దుఃఖం కలుగుతూ ఉండేది.

మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని, వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా.. చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంటిలో ఉంచి తోడి కోడళ్ళతో కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంలో వ్రతం చేస్తూ ఉన్నా.. తాను మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలాగే గడిచింది.

చీకటి పడి గ్రామం సద్దు మణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుని, గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి, తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించ సాగింది. ఇట్టి స్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామ సంచారం ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి, ఆ సమయంలో ఏడుస్తూ తన వద్ద కూర్చోడానికి కారణం అడిగింది. దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది. వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి, పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువమని చెప్పింది.

ఏడవ కోడలు అదే విధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది. మరునాడు ఉదయం గ్రామంలోని వారందరకూ ఈ విషయం వివరించింది. అందరూ సంతోషించారు. అంతే కాకుండా అప్పటి నుంచీ అందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ప్రారంభించినట్లు లోకంలో కథనం.

వ్ర‌త విధానం

వ్రతం రోజు తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఇంటిని శుభ్ర పరచుకుని, మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి ఇంటికి చేరుకుని వ్రతం చేయవలెను. పసుపుతో పోలేరమ్మను చేసుకుని పూజ చేయదలచిన చోట ఏర్పాటు చేసుకున్న పీఠంపై బియ్యంపోసి దానిపైన ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత, అమ్మవారిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి.

సాధారణంగా గౌరీదేవికి పూజ చేస్తారు. పూజ ముగించిన తర్వాత పసుపు రాసిన దారానికి పసుపు కొమ్మును కట్టి 'తోరం' తయారు చేసుకుని పూలతో పూజించాలి. తోరమును ఒక దానిని అమ్మవారికి సమర్పించాలి. మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి. తర్వాత 'పెరుగన్నము' నైవేద్యంగా సమర్పించడంతో పాటూ ఆ రోజు దానినే ఆహారంగా స్వీకరించాలి. తిరిగి సాయంత్రం, మరునాడు పూజ చేసి వ్రతం ముగించాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానానికి అప మృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం అని ఆధ్యాత్మిక వేత్త చిల‌క‌మ‌ర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ