ముండకోపనిషత్తు అథర్వవేదంలోని మంత్రభాగానికి చెందినదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 'ముండనం' అంటే తలను గొరిగించుకోవడం అని మనకు తెలిసిన అర్థంలోనే ఈ పదం వాడబడింది.
'ముండకం' అంటే ఆవిధంగా గొరిగేవ్యక్తి లేదా సాధనం. ముండనం తర్వాత ఒక అగ్ని ఉన్న పాత్రను తలపై పెట్టుకుని గురువు వద్దకు వెళ్ళడం అథర్వణవేదాన్ని నేర్చుకునే విద్యార్థికి విధిగా ఉండేదట. దీన్ని శిరోవ్రతం అని ప్రస్తుత ఉపనిషత్తు కూడా వర్ణిస్తుంది. తలను పరిశుభ్రంగా పెట్టుకోవడం అంటే బుద్ధిని పరిశుభ్రంగా పెట్టుకోవడం, బుద్ధిలోని రాగద్వేషాలు మొదలైన మాలిన్యాన్ని కడిగివేసుకోవడమని చిలకమర్తి తెలిపారు.
ఈ ఉపనిషత్తులో మూడు భాగాలు ఉన్నాయి. ప్రతి భాగానికి ముండకం అని పేరు. ఒక్కొక్కముండకంలో రెండు ఖండాలు. అంటే మొత్తం ఆరు ఖండాలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క ఖండంలో దాదాపు పదిమంత్రాలున్నాయి. మనిషికి ప్రపంచాన్ని గూర్చి ఎంతో విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానాన్నంతా మన ఇంద్రియాలు, మనస్సు సేకరిస్తాయి. ఈ విజ్ఞాన భాండాగారం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ విజ్ఞానాన్ని సేకరిస్తున్న ఇంద్రియాలు, మనస్సుల వెనుక ఉన్న శక్తి ఏమిటి? చైతన్యం, లేదా తెలివి అనేది మన శరీరం, బుద్ధిలో ఏర్పడే ఒకానొక పరిణామమా లేదా ఆ చైతన్యమే శరీరాన్నీ, బుద్ధినీ నడిపిస్తోందా అనేది మౌలికమైన ప్రశ్న.
భారతీయ తత్త్వశాస్త్రంలో ఉపనిషత్తుల కాలం నుండి రుషులు ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ వచ్చారు. శుద్ధచైతన్యమే ఎల్లప్పటికీ అన్నికాలాలకూ అతీతంగా ఉన్న తత్త్వమనీ, ఆ చైతన్యంలో ప్రకటమయ్యేదే ఈ సృష్టి అనీ మన ఉపనిషత్తుల ప్రతిపాదన. సృష్టిలోని ప్రాణుల్లో ఆలోచించే వ్యక్తి మనిషే కాబట్టి మనిషి తను ఏవిధంగా ఈ రూపంలోకి వచ్చాడు అని తెలుసుకోవడం అతని కర్తవ్యం. బయట ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకోవచ్చు.
తన సృష్టిని గూర్చి తెలుసుకోవడానికి కూడా మనస్సే సాధనం. మనిషికే వేదాంతంలో జీవుడు అని పేరు. ఈ జీవుడికీ, సృష్టికీ (జగత్తుకూ) సంబంధమేమిటి, సృష్టికర్త అంటే ఎవరు, జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి సాధన చేయాలనేది ఉపనిషత్తుల్లోని విషయమని చిలకమర్తి అన్నారు. తన స్వరూపాన్ని తెలుసుకుంటే మిగతా అన్నీ తెలిసినట్లే. ఇదే భావనతో ఉపనిషత్తు మొదలవుతుంది. ఏ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే మిగతావన్నీ తెలిసిపోతాయో అదేదో చెప్పండి అనే ప్రశ్నతో మొదటిముండకం ప్రారంభమవుతుంది.
మనిషి ఆచరించాల్సిన కర్మలు, నియమాల్ని గురించి చెప్పే వేదాలు, వేదాంగాలు, మిగతా శాస్త్రాలు అన్నీ మనిషి బుద్ధితో తెలుసుకునేవే. మనిషి స్వరూపం వీటితో తెలియదు. అందువల్ల వీటన్నింటినీ కలిపి అపరావిద్య (తక్కువస్థాయి విజ్ఞానం)గా లెక్కగట్టారు. దీనికి భిన్నంగా పరమాత్మ స్వరూపాన్ని తెలిపే విద్యను పరావిద్య అన్నారు. పరమాత్మను తన స్వరూపంగా తెలుసుకోవడమే మోక్షం. ఈ పరావిద్య ఉపనిషత్తుల్లో చెప్పబడింది.
పరబ్రహ్మ లక్షణమేమిటి అని మొదటి ముండకమే చెబుతుంది. అది ఇంద్రియాలకూ, మనస్సుకూ అందనిది, దేశ, కాలాల వల్ల పరిమితం కానిది. అయినా ఇది జగత్తుకంతా జగత్తుకు ఉపాదాన కారణమూ, నిమిత్త కారణమూ రెండూ ఇదే. జగత్తు దీనికన్నా భిన్నమైనది కాదు. జ్ఞానస్వరూపమైన పరమాత్మనుండియే ఈ జగత్తంతా ఏర్పడిందని మొదటి ఖండం చెబుతుంది.
వేదాల్లో చెప్పిన యజ్ఞాలు, తపస్సు మొదలైన కర్మలన్నీ మంచి ఫలితాన్నిచ్చేవే. అభ్యుదయాన్ని కోరుకునేవాడికి అభ్యుదయాన్నిస్తాయి, నిష్కామంగా కర్మలు చేసేవాడికి చిత్తశుద్ధినిస్తాయి. కర్మలవల్ల పొందే దేవలోకం మొదలైనవన్నీ అశాశ్వతాలే. పరమాత్మజ్ఞానమొక్కటే శాశ్వతమైనది కావున దాన్ని తెలుసుకోవడానికి గురువును ఆశ్రయించమని మొదటి ముండకం చెబుతుంది.
రెండవ ముండకంలో బ్రహ్మతత్త్వాన్నీ, సృష్టినీ చెబుతూ మరికొన్ని ఉదాహరణలున్నాయి. ఈ జగత్తంతా పరమాత్మయే అని మొదటి ఖండం చెప్పగా అట్టి పరమాత్మను తెలుసుకోవడానికి ఓంకారమనే సాధనంతో ప్రయత్నించమని రెండవ ఖండం చెబుతుంది. ఓంకారమే ధనస్సు, మన ఆత్మయే బాణాన్ని నేరుగా పరమాత్మయందు నిలిచేటట్లు వదలాలి దీన్ని తెలుసుకుంటే మన సంశయాలన్నీ నశిస్తాయి. పరమాత్మ చైతన్యం వల్లనే అని ఉపమానం. ఈ పరమాత్మ మన బుద్ధి అనే గుహలోనే వ్యక్తమవుతుంది. అన్నిప్రాణుల మనస్సు, ఇంద్రియాలు చైతన్యాన్ని అంటే తెలివిని కలిగి ఉన్నాయి.
మూడవ ముండకం మరొక ఉపమానాన్నిస్తుంది. ఒకేచెట్టుపై రెండు పక్షులు. ఒకటి ఫలాన్ని తింటుంది, మరొకటి తినకుండా కేవలం ద్రష్టగా ఉంటుంది. దేహము, ఇంద్రియాలు, నేను అనుకునేది జీవుడు. ఇదే కర్మఫలాన్ని తింటూ పక్షి. దేహము, ఇంద్రియాల్ని ప్రకాశింపజేసే చైతన్యమే మరొక పక్షి. నిజానికి ఈ రెంటి స్వరూపమూ ఒకటే. రెండింటి తత్త్వమూ చైతన్యమే. కానీ ఈ విషయం తెలియక జీవుడు దుఃఖపడుతూ ఉంటాడు. కర్మయోగంతో చిత్తశు ద్ధినీ, ధ్యానమార్గంలో ఏకాగ్రతనూ పొందిన తర్వాతనే జ్ఞాని అయిన గురువు వద్ద వేదాంతవాక్యాల అర్థాన్ని అవగాహన చేసుకోగలడు. తన స్వరూపం పరమాత్మ స్వరూపం కన్నా వేరుకాదని తెలుసుకోవడమే మోక్షం. పరమాత్మను ఎక్కడో బయట ఉన్న వ్యక్తిగా కాకుండా తన బుద్ధి అనే గుహలోనే ఉండి చైతన్యరూపంగా ప్రకాశిస్తున్న తత్త్వమే అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. దీనికి సాధకుని చిత్తనైర్మల్యం, తీవ్రజిజ్ఞాస అవసరం. దీన్నే ఆధ్యాత్మికబలం అంటుంది ఉపనిషత్తు అని అధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్