మహాలయ పక్షములు లేదా పితృ పక్షములు అంటే ఏమిటి? ఈ సమయంలో ఏమి చేయాలి?-what is mahalaya paksham or pitru pakshm what to do at this point ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  What Is Mahalaya Paksham Or Pitru Pakshm What To Do At This Point

మహాలయ పక్షములు లేదా పితృ పక్షములు అంటే ఏమిటి? ఈ సమయంలో ఏమి చేయాలి?

HT Telugu Desk HT Telugu
Sep 29, 2023 11:32 AM IST

మహాలయ పక్షములు లేదా పితృ పక్షములు అంటే ఏంటో తెలుసా? ఈ సమయంలో అసలు ఏం చేయాలి? ఆధ్యాత్మివేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు

మహాలయ పక్షములు లేదా పితృ పక్షములో ఏం చేయాలి
మహాలయ పక్షములు లేదా పితృ పక్షములో ఏం చేయాలి

మానవుడు దేవతారాధనకు ఎంతటి ప్రాధాన్యత యిస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు ఇవ్వాలని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గతించిన వారికోసం పితృకర్మలు ఆచరించడం, తర్పణాలు విడిచిపెట్టడం మన సనాతన ధర్మంలో సాంప్రదాయం. ఏ వ్యక్తి అయినా వారి ఇంటిలో కొన్ని కారణాల వలన గతించిన తిథులలో పితృ కర్మలు ఆచరించడం కుదరని పక్షంలో, అలాగే కొన్ని దుర్హటనలు ఎవరినైనా కోల్పోయినటువంటి పరిస్థితులలో వారి ఎప్పుడు చనిపోయారో తెలియని స్థితులు ఏర్పడినపుడు అటువంటి వారికి భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షాలు చాలా ప్రాధాన్యమైనవి అని చిలకమర్తి తెలియచేశారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రతీ మాసంలో అమావాస్యకు పితృతర్పణాలు విడచిపెట్టాలి. అలా ప్రతీ మాసం విడచిపెట్టలేనటువంటివారు భాద్రపదమాసంలో వచ్చేటటువంటి మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య రోజు గనుక ఆ గతించిన పితృదేవతలకు తర్పణాలు కార్యక్రమాలు ఆచరిస్తే ఆ సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుందని పురాణాలు తెలియచేసినట్లుగా చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మహాలయమనగా మహన్‌ - ఆత్యంతి కోలయో యత్ర = మహాలయః అని వ్యుత్పత్తి. అట్టి మహాలయము ఎందుకు ఆచరించాలి? దాని ప్రాశస్త్యము ఏమిటి? మన పితృదేవతలు ఆషాఢమాసము రెండు పక్షములు మొదలు తిరిగి భాద్రపద కృష్ణ పక్షము వరకు గల ఐదు పక్షములు మన పితృదేవతలు ఎన్నో ఇక్కట్లు పాలగుచుందురట. అందులకు గల కారణం సూర్యుడు కన్యా తులారాశుల నుండి వృశ్చికరాశి వచ్చు వరకు ప్రేతపురి శూన్యముగా నుండునని, అందువల్ల ఆ కాలమందు మన పితృదేవతలు అన్నోదకములు కాంక్షిస్తూ భూలోకమున వారి వారి గృహముల చుట్టు ఆత్రంగా తిరుగుచుందురు అనియు భారతము పేర్కొనుచున్నది అని చిలకమర్తి తెలిపారు.

అందువల్లనే మరణాంతరము నిర్వర్తించే ఈ కర్మలకు అంతటి ప్రాధాన్యత కలిగియున్నది కాబట్టి అంత్యకాలమందు కర్ణుడు, కృష్ణ పరమాత్మను చివరిగా ఒక కోరిక కోరినాడట. కృష్ణా! నా జన్మవృత్తాంత రహస్యము దయతో ధర్మరాజుకు సవిస్తరముగా వివరించి వారిచే తనకు పిండ ప్రదానములు గావించమని కోరినాడట. ఆ కోరికను పరమాత్మ అంగీకరించి ధర్మరాజుచే ఆ కార్యక్రమము చేయించినాడట. అలా ధర్మరాజు 77 వేలమందికి పిండప్రదానాదులు గావించి వారికి సద్గతుు కల్పించినాడు. కావున ఈ కర్మలు నిర్వర్తించుట అనునది మానవుల యొక్క విధి. ఇందు ప్రతిఫలం ఆశించరాదు. నూరు యజ్ఞాలు చేయడం కన్న మన వంశ వృక్షానికి కారకులయిన పితృదేవతల తర్పణాలే ఎంతో ముఖ్యమైనవిగా చెప్పబడినవి. ఈ విషయమందు అలక్ష్య భావన ఎంతమాత్రము కూడదు అని దైవజ్ఞులు చెప్తారు.

ఇక ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమనియు, దక్షిణాయణము పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసము. మహాలయమంటే భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు. దీన్ని పితృపక్షంగా, మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిథి త్రయోదశి, అనగా వర్షబుతువునందు భాద్రపద కృష్ణ త్రయోదశి మఘా నక్షత్రంతో కూడి వున్నప్పుడు దేనితో కూడిన ఏ పదార్థంతో శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందట. అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అన్ని వర్ణముల వారు వారి శక్తిని బట్టి చతుర్దశి తిథిని విడువకుండా పదిహేను రోజులు ఆచరించెదరు.

శక్తిని లేనివారు తమ పెద్దలు మరణించిన తిథినిబట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించెదరు. గతించిన వారి తిథి గుర్తులేనపుడు మహాలయ అమావాస్యే నిర్ణయింపదగినది. బుతుదోషము వల్ల గాని, కాలదోషము వల్ల గాని, జాతామృతశౌతమ అస్పర్భ గలిగినప్పుడు కూడా ఈ అమావాస్యయే పితృకర్మలన్నింటికీ ప్రామాణిక దినము అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.