Holi 2024: కామదహనం అంటే ఏంటి? హోలీ రోజు కాముని దహనం ఎందుకు చేస్తారు?
Holi 2024: హోలీ పండుగని కాముని దహనం, ఫాల్గుణ పౌర్ణమి, కాముని పున్నమి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అసలు ఈ కాముని దహనం ఏంటి? హోలీ రోజు ఎందుకు చేస్తారనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Holi 2024: ధర్మానికి విరుద్ధం కాని కామం ఉండడం తప్పుకాదు. కామం ఉండాల్సిందే కానీ ధర్మబద్ధంగా ఉండాలని పురాణ వచనం. హోలీ పండుగ అనగానే గుర్తుకు వచ్చేది కామదహనం. దీనినే కాముని పున్నమి అని కూడా అంటారు. కాముని బొమ్మను పౌర్ణమి రాత్రి దహనం చేస్తారు. కాముడు అంటే మన్మథుడు. అతన్ని దహించివేయడం ఈ కథలోని ఇతివృత్తం. ఇది అనేక పురాణాల్లో ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కాళిదాసు రచించిన కుమారసంభవం అనే కావ్యంలోని ఇతివృత్తం కూడా ఇదే.
స్కందపురాణం ప్రకారం మన్మథుడు అంటే మనస్సును మధించేవాడు. ఇదొక వ్యక్తి కాదు, మనలో ఉన్న కామానికి ప్రతీక. దానిని ఎంత అదుపులో ఉంచితే అంత మంచిదని చెప్పడమే ఈ కథలోని సారాంశం.
కాముని దహనం వెనుక కథ
తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురిచేశాడట. దానికి పరిష్కారం శివపార్వతులకు కలిగే పుత్రుడే. శివుడు తపస్సులో మునిగి ఉన్నవాడు. పర్వతరాజైన హిమవంతుని కూతురే పార్వతి. వారిద్దరికీ పెళ్లి కుదిర్చితే వారికి కలిగే పుత్రుడే తారకాసురుడిని సంహరించగలుగుతాడు. నిత్యం తపస్సులో ఉండే శివుడికి పార్వతితో పెళ్లి జరిపించడం దేవతలకు సమస్య అయింది.
తపస్సు చేస్తున్న శివుడికి దేవతల కోరికపై పార్వతి సేవ చేయడానికి ఒప్పుకుంటుంది. వేళకు సరిగా తపస్సుకు కావలసిన పూలు, పళ్ళు, నీరు అందించడం మొదలైన పనులు చేస్తూ ఉంటుంది. అయినా శివుడు ఆమెను కన్నెత్తి చూడలేదు. తపస్సు నుండి మేలుకొని పార్వతిని చూసేలా ఇంద్రాది దేవతలు శివుడిలో కామాన్ని ప్రేరేపించేలా చేయమని మన్మథుడిని కోరారు.
పార్వతి సపర్యలు చేసే సమయంలో మన్మథుడు తన పూలబాణాల్ని శివుడిపై యోగించాడు. శివుడి మనస్సు చలించింది కానీ వెంటనే నిగ్రహించి అలా కావడానికి కారణమేమిటి అని తన దివ్య దృష్టితో చూశాడు.
మన్మథుడు తన తపస్సును భంగం చేసినందుకు కోపించి శివుడు తన మూడవ కంటిని తెరచి మన్మథున్ని భస్మం చేశాడు. ఆ తర్వాత శివుడు పార్వతిని పరీక్షించడం, పార్వతి కొన్ని ప్రశ్నలు అడగడం ఆ తర్వాత వారిద్దరి తారకుడిని అంటే అజ్ఞానాన్ని చంపడం తరువాతి కథ. పెళ్లి జరిగింది. వారికి కలిగిన పుత్రుడే స్కందుడు. అతడు స్త్రీ పురుషుల సంబంధం గొప్పతనాన్ని వివరించడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం.
వివాహం కేవలం కామాన్ని తీర్చుకోవడానికే కాదని ఇందులోని పరమార్థం. కామాన్ని పూర్తిగా నిరాకరించకుండా ధర్మం కోసమే కామం అని చెప్పడమే ఈ కథలోని అంతరార్థం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.