జపం అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏమిటి? ఎలా చేయాలి?
జపం చేయడం అంటే దైవాన్ని మనసులో తలుచుకుంటూ స్తుతించడం. రుద్రాక్ష, తులసి మాల వంటి వాటితో జపం చేస్తూ ఉంటారు. అసలు జపం అంటే ఏంటి? శాస్త్రం ప్రకారం ఎలా చేయాలి అనే దాని గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
భగవతారాధనలు పలు రకాలు. వాటిలో జపం ఒకటి. ‘దైవం మంత్రాధీనమై ఉంటుంది.’ ఆ మంత్రాన్ని పదేపదే స్మరించడమే జపమని ఆధ్యాత్మికవేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. గురువు నుంచి తీసుకున్న మంత్రమే సిద్ధిస్తుందని ఆయన తెలిపారు. నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయన్నారు.
జపం మూడు విధాలుగా చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. వాచికము, ఉపాంశువు, మానసికము అని మూడు విధాలుగా జపం చేయవచ్చన్నారు. వాచికము అంటే జపం చేసే మంత్రాన్ని పైకి అందరికీ వినిపించేలా చెప్పడం. శబ్దం పైకి రాకుండా పెదవులు కదుపుతూ చేసే జపం ఉపాంశువు. నాలుక, పెదవులు కదపకుండా మౌనంగా మనసులో చేసే జపం మానసికము. అయితే ఈ మూడింటిలోనూ మానసిక విధానమే ఉత్తమోత్తమైనదని ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు.
‘‘హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్
హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ’’
అని శాస్త్రం చెబుతోందని చిలకమర్తి తెలిపారు. అంటే ప్రాతఃకాలంలో జపం చేసేటప్పుడు చేతులు నాభి వద్ద ఉంచుకోవాలని, మధ్యాహ్న సమయంలో హృదయం వద్ద ఉంచుకొని, సాయం సమయంలో చేతులను ముఖం వద్ద ఉంచుకొని జపం చేయాలి.
తూర్పు, ఉత్తర దిక్కుల వైపు కూర్చుని మంత్రజపం చేయాలని ఆధ్యాత్మికవేత్త ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దర్భలు ఓషధుల సారమని, కనుక దర్భాసనంపై కూర్చుని జపం చేయాలని వేదం చెబుతోంది.
గాయత్రి, పురుషసూక్త మంత్రాల కన్నా విశిష్టమైన మంత్రాలేవీ లేవని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. గాయత్రి మంత్రాన్ని తండ్రే ఉపదేశిస్తాడు కనుక వేరే గురువు అవసరం లేదని, అందువలన ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్రాన్ని జపించవచ్చని ఆయన అన్నారు. ఏమంత్రాన్ని జపించినా జపించకపోయినా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గాయత్రీ మంత్రాన్ని జపించాలన్నారు. ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నిలబడి, సాయంత్రం సమయంలో కూర్చుని గాయత్రీ మంత్రాన్ని జపించాలన్నారు. నడుస్తూ జపం చేయరాదని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
లెక్కించకుండా జపం చేయరాదు
లెక్కించకుండా జపం చేయరాదని ఆంగీరస మహర్షి తెలిపినట్టు చిలకమర్తి వెల్లడించారు. వేళ్ళ కణుపులను లెక్కిస్తూ కానీ, తావళంలోని పూసలను లెక్కిస్తూ జపం చేయాలి. రుద్రాక్ష లేదా బంగారు పూసలు లేదా తులసి పూసలు, లేదా స్ఫటిక పూసలు లేదా దర్భపూసలు లేదా తామర పూసలతో చేసిన మాలనే తావళం అంటారన్నారు. ఈ తావళంలో 108, 54,27 పూసలు ఉండాలని స్మృతి చంద్రిక చెబుతోంది.
అన్నింటి కంటే రుద్రాక్షలతో చేసిన తావళం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని గౌతమ ధర్మ సూత్రాలు చెబుతున్నాయని ఆధ్యాత్మికవేత్త ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జపమాల రెండు కొసలను కలిపేది ‘సుమేరుపూస’ అంటారని, సుమేరు పూసను దాటి ముందుకు పోరాదని, అక్కడ వరకూ వచ్చాక వెనుకకు త్రిప్పి జపం చేయాలని ఆయన వివరించారు.
జపం చేసేటప్పుడు తావళం బయటకు కనిపించరాదని, దానిపై పొడి వస్త్రాన్ని కప్పాలి. ఉంగరపు వ్రేలు పైనుండి చూపుడు వ్రేలు వినియోగించకుండా బొటన వ్రేలితో తావళంలోని పూసలను లెక్కించాలి. వ్రేలి కణుపులను లెక్కించేటప్పుడు బొటన వ్రేలు అసలు వినియోగించరాదు. మధ్యవ్రేలి యొక్క మధ్య కణుపు నుంచి ప్రారంభించి, ఉంగరపు వ్రేలు మధ్యకణునుంచి జపం చేయాలని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
ఎవరికి ఏది ప్రణవం
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ‘ఓం’కారం ప్రణవంగా, ఇతర వర్ణాల వారికి, స్త్రీలకు ‘ఔం’కారం ప్రణవంగా కాళికా పురాణంలో చెప్పబడిందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఓంకారం వలన వచ్చే ఫలితమే ఓంకారంతో కూడా వస్తుందని, ప్రతి మంత్రానికి ఈ ప్రణవాక్షరాలు చేర్చి మంత్రజపం చేయాలని చిలకమర్తి తెలిపారు. శివపంచాక్షరి జపానికి కాలనియమం, దీక్ష, హోమాలతో పనిలేదు దీనికి అందరూ అర్హులేనని అగస్త్య సంహితలో ఉందని పంచాంగకర్త ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్