Hamsa yogam: బృహస్పతి ఇచ్చే హంస యోగం.. జాతకంలో ఈ యోగం ఉంటే మీరు కోటీశ్వరులు అయినట్టే
Hamsa yogam: దేవగురువు బృహస్పతి వల్ల ఈ అద్భుతమైన హంస యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి. ఇది జన్మ చార్ట్ లో ఉంటే జీవితం ఏ మలుపు తీసుకుంటుందో తెలుసుకుందాం.
Hamsa yogam: గ్రహాల సంచారం వల్ల అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. నిర్ధిష్ట విరామం తర్వాత గ్రహాలు రాశులను మారినప్పుడు ఇవి ఏర్పడతాయి. అలాగే శుభ గ్రహాలు నిర్ధిష్ట గృహాలలో సంచరించినప్పుడు యోగాలు వస్తాయి. అటువంటిదే ఈ హంస యోగం.
దేవగురువు బృహస్పతి వల్ల ఏర్పడే అత్యంత అదృష్టమైన యోగం హంసయోగం. జ్యోతిష్య శాస్త్రంలో అరుదైన, అత్యంత పవిత్రమైన పంచ మహాపురుష యోగాలలో హంసయోగం ఒకటిగా పరిగణిస్తారు. మీ జాతకంలో హంస యోగం ఉంటే అదృష్టవంతులుగా మారతారు. జ్ఞానం పెరుగుతుంది. విజయం లభిస్తుంది. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రేయస్సు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు.
హంస యోగం అంటే ఏంటి?
హంస యోగం అనేది ధనుస్సు, కర్కాటకం, మీన రాశులలో లగ్నం నుండి కేంద్ర గృహాలలో ఒకటి, నాలుగు, ఏడు, పదవ గృహాలలో దేవగురువు బృహస్పతి ఉన్నప్పుడు ఈ హంస యోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో హంస యోగం అనేది ఒక వ్యక్తి జన్మ చార్ట్ లో అనుకూలమైన గ్రహాల కలయిక ఉనికిని సూచిస్తుంది. ఈ యోగం జీవితం మీద ప్రయోజనకరమైన, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
హంస యోగం ప్రయోజనాలు
హంస యోగం ఉన్న వ్యక్తి జీవితంలో అనేక గొప్ప ప్రయోజనాలను పొందుతాడు. జ్ఞానం పెరుగుతుంది. జీవితంలోని ఎంతటి కఠినమైన సవాళ్లను అయినా చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. దేవ గురువు అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం, జ్ఞానం పెరుగుతుంది.
ధనుస్సు, మీనం, కర్కాటక రాశుల వారికి ఇది చాలా ముఖ్యమైనది యోగంగా పరిగణిస్తారు. జాతకంలో ఈ యోగం ఉంటే మీ కీర్తి, ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతాయి. ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు. డబ్బుకు లోటు ఉండదు. దాతృత్వ కార్యక్రమాలు చేస్తూ అందరి ఆశీర్వాదాలను పొందుతారు. హంస యోగం ఉన్న వ్యక్తులు తమ నైపుణ్యాలను విస్తరించుకుంటూ వస్తారు. వారి తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
జాతకంలో హంసయోగ ప్రభావం
ఈ హంస యోగం కేంద్ర గృహంలోని ఒకటి, నాలుగు, ఏడు, పదో ఇంట్లో బృహస్పతి ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఒకటో ఇంట్లో బృహస్పతి ఉంటే గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి. అదే నాలుగో ఇంట్లో బృహస్పతి ఉంటే తల్లి, ఇల్లు, ఆస్తి నుంచి ఆనందాన్ని పొందుతారు. ఏడవ ఇంట్లో బృహస్పతి ఉంటే సద్గుణాలు కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పదో ఇంట్లో బృహస్పతి ఉంటే బోధన లేదా తత్వశాస్త్రంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు.
ఈ హంస యోగం జాతకంలో ఉంటే సానుకూల మనస్తత్వంతో ఉంటారు. ఈ యోగం ఆర్థిక శ్రేయస్సు, సమృద్ధితో ముడిపడి ఉంటుంది. డబ్బుని ఆకర్షించే మార్గాలు మీ ముందు తారసపడతాయి. మీరు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల వల్ల భారీగా లాభాలు గడిస్తారు. అదృష్టానికి ఇక అడ్డే ఉండదు. ఈ యోగం ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.