కర్మ ఫలం అంటే ఏమిటి? పాపపుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయి ?బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
జీవితంలో జరిగే చాలా విషయాలకు ఏం చేస్తా కర్మ అని సర్దుచెప్పుకుంటూ ఉంటారు. కర్మఫలితాలు అనుభవించక తప్పదని పెద్దలు కూడా అంటారు. కర్మం ఫలం అంటే ఏంటి? పాపపుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భారతదేశం కర్మభూమి,పుణ్యభూమి, యోగభూమి(దైవ భూమి)అంటారు. ప్రతి జీవీ ఏదో ఒక కర్మను ఆచరించక తప్పదు. కర్మలు రెండు రకాలు. సత్కర్మలు, దుష్కర్మలు. సత్కర్మకు లభించే ఫలం పుణ్యం. దుష్కర్మకు లభించేది పాపం అని ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ కర్మఫలాన్ని ఈలోకంలో కాని, పరలోకంలో కాని ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు అన్నారు.
హైందవ సంప్రదాయం ప్రకారం పరలోకంలో స్వర్గం, నరకం అనేవి ఈ కర్మఫలాన్ని అనుభవించే స్థానాలని ఆయన పేర్కొన్నారు. సత్కర్మలను ఆచరించినవారు స్వర్గానికి, దుష్కర్మలు చేసినవారు పాపానికి పోతారని, ఆ కర్మఫలం నియమిత కాలం అయ్యేసరికి తిరిగి జన్మిస్తారన్నారు. అప్పటికీ పుణ్యఫలం ఉంటే మానవాది ఉత్తమ జన్మలు, పాపఫలం ఉంటే హీనజన్మలు లభిస్తాయన్నారు. అన్నిటిలోకి మానవ జన్మే ఉత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే మానవుడు బుద్ధి జీవి అన్నారు. తన కర్మాచరణద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఒక్క మానవునకే ఉందన్నారు. యాగ,దాన,తపో, ధర్మాచరణ వంటి సత్కర్మల ద్వారా పుణ్యాన్ని ఆర్జించవచ్చన్నారు.
‘‘పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం’’ అంటే ఇతరులకు ఉపకారం చేస్తే అది పుణ్యం, ఇతరులను వేధిస్తే అది పాపం అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. మనం చేసే సత్కర్మ, దుష్కర్మల ఫలితాలను మనమే అనుభవించవలసి ఉంటుందన్నారు. పాపకర్మ ఫలాన్ని తగ్గించుకునేందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉందన్నారు. తెలియక చేసిన దుష్కర్మ ఫలితాన్ని పూర్తిగా పోగొట్టుకొనేందుకు లేదా తగ్గించుకునేందుకు ప్రాయశ్చిత్తం ఒక సాధకమని ఆయన తెలిపారు. అయితే ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మళ్ళీ అటువంటి పనులు చేయరాదని, ప్రాయశ్చిత్తం చేసుకున్నాక తెలిసీ అటువంటి పనులు చేస్తే ప్రాయశ్చిత్తం నిష్ఫలమవుతుందని ప్రభాకర చక్రవర్తిశర్మ అన్నారు.
చేసిన పాపం కానీ, పుణ్యంకానీ ఇతరులకు చెబితే పోతుందన్నారు. చేసిన చెడు పనులను ఇతరులకు చెప్పి, ఇకపై చేయబోనని కచ్చితంగా నిర్ణయించుకొని అమలు చేస్తే అది ప్రాయశ్చిత్తం అవుతుందన్నారు. మళ్ళీ అవే పనులు చేస్తే నిరర్థకమవుతుందని ఆయన అన్నారు. దానినే గజస్నానం అంటారన్నారు. ఏనుగు నీటితో చక్కగా స్నానం చేసి పరిశుభ్రమవుతుందని, కానీ మరుక్షణంలో బురద పూసుకుంటుందని, అప్పుడు అది చేసిన స్నానం వ్యర్థమే కదా అన్నారు. ఈ గజ స్నానం మాదిరిగానే మానవుడు చేసిన తప్పుడు పనులకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తర్వాత తిరిగి అవేపనులను చేస్తాడన్నారు. ఈ విషయం శ్రీమద్భాగవతం 6వ స్కంధం 1వ అధ్యాయంలో ఉందని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అందులో శుక పరీక్షిత్తు సంవాదంలో శుకుడు
‘‘ కర్మణా కర్మనిర్హారో నహి అత్యంతిక ఇష్యతే/
అవిద్వదధికారత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనమ్//’’
కర్మలద్వారా కర్మనాశనం ఎప్పటికీ జరుగదు. ఒక కర్మకు మరొక కర్మ ఎప్పటికీ విరుగుడు కాదు. ఏ కర్మకయినా దాని ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. దానినుంచి పుట్టే సంస్కారాన్ని మనసులో పేరుకుంటుంది. ప్రాయశ్చిత్తం కూడా ఒక కర్మే. అది అశుభ కర్మ ఫలాన్ని నిర్మూలించినా లేదా తగ్గించినా అటువంటిది మళ్ళీమళ్ళీ చేయకుండా నివారించలేదు. అలా చేసే సంస్కారాన్ని అది నాశనం చేయలేదు. ఎందుకంటే అజ్ఞానం వల్ల ఆ సంస్కారం నశించలేదు. మరి దుష్కర్మలను చేసే సంస్కారాన్ని తొలగించుకోవడం ఎలా? అంటే సాధన ఒక్కటే మార్గం అని ఆయన చెప్పారు. ఆ సాధనాలు ఏమిటంటే.. యమనియమాలు, తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, సత్యనిష్ఠ అని ఆధ్మాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సాధన ద్వారా చిత్తశుద్ధి, దానిద్వారా జ్ఞానం కలుగుతుంది. భక్తిద్వారా, ఆత్మసమర్పణ ద్వారా పాపాలను తొలగించుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.