అత్యంత మహిమాన్వితమైన యోగినీ ఏకాదశి వ్రతం చేసిన హేమమాలికి ఎంతటి భాగ్యం కలిగిందో తెలుసా? ఈ వ్రతంతో పాపాలు తొలగిపోతాయి!-what happens if we do this very powerful yogini ekadashi or nirjala ekadashi vratam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అత్యంత మహిమాన్వితమైన యోగినీ ఏకాదశి వ్రతం చేసిన హేమమాలికి ఎంతటి భాగ్యం కలిగిందో తెలుసా? ఈ వ్రతంతో పాపాలు తొలగిపోతాయి!

అత్యంత మహిమాన్వితమైన యోగినీ ఏకాదశి వ్రతం చేసిన హేమమాలికి ఎంతటి భాగ్యం కలిగిందో తెలుసా? ఈ వ్రతంతో పాపాలు తొలగిపోతాయి!

HT Telugu Desk HT Telugu

విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన వ్రతం యోగినీ ఏకాదశి వ్రతం. ఈ వ్రతం ఆచరించిన హేమమాలి దంపతులు ఆనందంగా జీవించసాగారు. ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంతటి ఫలం ప్రాప్తిస్తుందో, అంతటి ఫలం కేవలం ఒక్కసారి భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రాప్తిస్తుంది

అత్యంత మహిమాన్వితమైన యోగినీ ఏకాదశి (pinterest)

నిర్జల ఏకాదశిని వైఖానస ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాసం ఉంటారు. ఈ వ్రతం చేస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన తిథి ఏకాదశి. ప్రతి మాసానికి రెండు ఏకాదశులు వస్తాయి. అధిక మాసంతో కలిపి మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి. శిష్టులు ఏకాదశి వ్రతాన్ని కఠినంగా ఆచరిస్తారు.

దశమి నాడు రాత్రి విరాహారులై, ఏకాదశి నాడు నీరు కూడా పుచ్చుకోనకుండా, ద్వాదశి నాడు ఉదయం పారణయొనర్చి, ద్వాదశి నాడు నిరాహారులై ఉంటారు. అప్పుడే ఏకాదశి వ్రతం సంపూర్ణంగా ఆచరించినట్లవుతుంది. ఆ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవాడు అశ్వమేధ యాగఫలాన్ని, 60వేల సంవత్సరాలు తపమాచరించడం వల్ల కలిగే ఫలితాన్ని పొందుతాడని పురాణాలు తెలియజేస్తున్నాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఏకాదశి వ్రతం

ఏకాదశి వాడు అన్నం తింటే మహాపాతకాలు సంభవిస్తాయి. దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒకనాడు బ్రహ్మదేవుడి ఫాలము నుండి చెమటబొట్టు ఒకటి కింద పడింది. దాని నుంచి ఒక రాక్షసుడు జన్మించాడు. రాక్షసుడు నివాసం చూపించమని బ్రహ్మను అడిగాడు.

అప్పుడు బ్రహ్మ - నీవు ఏకాదశి నాడు భుజించేవారి కాల్యాన్నపు మెతుకులలో నివసించు అని పలికాడు. అందువల్ల ఏకాదశి నాడు అన్నము తినకూడదు అనేది ఒక ఆచారంగా ప్రచారంలోనికి వచ్చింది. ఏకాదశి వ్రతం అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఏకాదశి మహాత్మ్యం ఏమిటి?

ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మనిని ఇలా అడిగాడు “జగన్నాథా! జ్యేష్ఠ బహుళ ఏకాదశిని ఏ పేరుతో పిలుస్తారు? ఆ ఏకాదశి మహాత్మ్యం ఏమిటి? దయచేసి వివరంగా తెలియజేయండి.” ధర్మరాజు ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా జవాబిచ్చాడు.. “ధర్మరాజా! నీవు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చి నీ సందేహాలను తీర్చుతాను. సావధానంగా విను. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ లోకంలో సకల భోగభాగ్యాలను, పరలోకంలో ముక్తిని ప్రసాదించే ఏకైక వ్రతం యోగినీ ఏకాదశి.

ఏకాదశి వ్రతం

పురాణాలు ఈ ఏకాదశి వ్రతాంతాన్ని విశేషంగా వర్ణించాయి. పూర్వకాలంలో స్వర్గధామమైన అలకాపురి (అంకాపురి) అనే రాజ్యాన్ని కుబేరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. ప్రతి రోజూ భక్తిశ్రద్ధలతో శివునికి పూజలు చేసేవాడు. పర్వదినాల్లో అభిషేకాలు చేసేవాడు. శివుడికి పూజ చేయడానికి కావలసిన పుష్పాలను హేమమాలి అనే సేవకుడు మానస సరోవరం నుండి తీసుకువచ్చేవాడు. ఇది అతని నిత్యకార్యక్రమం.

ఇలా కొంత కాలం గడిచింది. ఒకనాడు హేమమాలి పుష్పాలను తెచ్చేందుకు బయలుదేరినపుడు, అతని భార్య విశాలాక్షి అందంగా కనిపించింది. వెంటనే అతనిలో కామాసక్తి కలిగింది. తన విధిని నిర్లక్ష్యం చేసి భార్యతో కాలక్షేపం చేయసాగాడు. సరససంభాషణలలో మునిగిపోయిన హేమమాలికి సమయం గడుస్తున్నదీ గుర్తుకురాలేదు. కుబేరుడు శివపూజ కోసం పుష్పాల కోసం ఎదురు చూశాడు. మధ్యాహ్న సమయం అయిపోయినా హేమమాలి రాలేదు. పుష్పాలు లేకపోవడంతో శివపూజను నిర్వహించలేక ఆగ్రహంతో సేవకులను పంపించాడు. సేవకులు హేమమాలి ఇంటికి వెళ్లగా, అతను భార్యతో సుఖసంభోగంలో లీనంగా ఉన్నాడు. వారు వెంటనే రాజుకు సమాచారం చెప్పారు.

కుబేరుడు కోపంతో తండ్రిలా మండిపోయాడు. "దుర్మార్గుడా! శివుని పూజకంటే నీ భార్య మిన్నగా కనిపించిందా? శివునికి అవమానం కలిగించినందుకు నిన్ను శపించుతున్నాను. నీవు భూలోకంలో నరుడిగా జన్మించి, భార్యా వియోగం అనుభవించు. కుష్టురోగంతో బాధపడుతూ అనేక కష్టనష్టాలు అనుభవించు" అని శాపం ఇచ్చాడు. ఇది యోగినీ ఏకాదశి వ్రత కథ యొక్క ప్రారంభ భాగం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శాప ఫలితంగా హేమమాలి భూమిపై నరుడిగా జన్మించాడు. అతడు కుష్టువ్యాధితో బాధపడసాగాడు. ఆకలిదప్పుల నివారణ కోసం అడవిలో సంచరించేవాడు. కానీ సరైన ఆహారం లభించక, నానా బాధలు అనుభవించసాగాడు. అతడి భార్య కూడా భూమిపై జన్మించింది. పూర్వజన్మ బంధం వలన ఆమె కూడా అడవిలో తిరుగుతూ హేమమాలిని వెతుకుతున్నది.

గత జన్మ తప్పు

హేమమాలికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. గత జన్మలో శివపూజ చేసిన ఫలితంగా, శివనామస్మరణ వల్ల అతడికి స్మృతి వచ్చి తన గతజన్మ తప్పును గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో ఆయన మార్కండేయ మహర్షి ఆశ్రమం వైపుగా వెళ్లాడు.

హేమమాలి దూరం నుంచే మార్కండేయ మహర్షిని దర్శించి భక్తిపూర్వకంగా వందనం చేశాడు. అతని వినయాన్ని చూసి మహర్షి ప్రీతి చెందినారు. హేమమాలిని దగ్గరకు రమ్మని పిలిచారు. హేమమాలి మహర్షి పాదాలపై పడిపోయి మొర పెట్టుకున్నాడు. మార్కండేయ మహర్షి అతన్ని ప్రేమతో పైకెత్తి ఇలా అడిగారు.

"నీకు ఈ కుష్టు వ్యాధి ఎలా సోకింది? పాపాత్ములకు మాత్రమే ఈ వ్యాధి వస్తుందనీ పెద్దలు చెబుతారు. నీవు ఏమయినా పాపపు పనులు దేశావా? ఆబద్దం చెప్పకుండా సత్యం చెప్పు," అని పలికాడు. దాంతో హేమమాలి తన పూర్వగాథను వివరించసాగాడు.

"మునివరా! నా పేరు హేమమాలి. కుబేర మహారాజు దగ్గర సేవకుడను. శివపూజ నిమిత్తం నిత్యం మానససరోవరానికి వెళ్లి పుష్పములను తెచ్చి మహారాజునకు ఇవ్వడం నా నిత్య కార్యక్రమం. నేను తెచ్చిన పుష్పాలతో రాజు శివపూజ చేసేవారు. నేను కూడా ఆ పూజను తిలకించేవాడిని, శివనామస్మరణ చేసేవాడిని. దాని ఫలితంగా నరుడిగా జన్మించినా, పూర్వజన్మ స్మృతి కారణంగా నేను మీకు జరిగింది వివరిస్తున్నాను.

వ్యాధితో బాధలు

ఒక రోజు నా భార్య విశాలాక్షి సౌందర్యానికి బానిసై, నా విధులను నిర్లక్ష్యం చేశాను. ఆగ్రహించిన కుబేర మహా నాకు శాపాన్ని ప్రసాదించాడు. ఆ శాపాన్ని అనుసరించి నేను భార్యకు దూరమయ్యాను. కుష్టు వ్యాధి బారినపడి అనేక కష్టాలను అనుభవిస్తున్నాను," అని జవాబిచ్చాడు. హేమమాలి పలుకులను ఆలకించిన మార్కండేయ మహర్షి, హేమమాలితో ఇలా అన్నాడు.. "నీవు ఉద్దరింపబడడానికి ఒక వ్రతాన్ని తెలియజేస్తాను. శ్రద్ధగా విను.

నీవు ఆచరించబోయే వ్రతం – యోగినీ ఏకాదశి వ్రతం. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన వ్రతం. దీనిని నిశ్చల భక్తితో ఆచరిస్తే, నీ సమస్త పాపాలు, దుఃఖాలు, రోగాలు సమూలంగా తొలగిపోతాయి," అని పలికాడు. ఆ మాటలకు అమితానంద భరితుడయ్యాడు హేమమాలి. మహర్షికి సాష్టాంగ దండప్రణామాలు గావించాడు.

యోగినీ ఏకాదశి వ్రతం

మార్కండేయ మహర్షి చెప్పిన ప్రకారం యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు హేమమాలి. భక్తి, శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించినందు వల్ల అతడి సమస్త పాపాలు తొలగిపోయాయి. అతని భార్య కనిపించింది. పూర్వరూపం లభించింది. కుష్టు రోగం తొలగిపోయింది. హేమమాలి దంపతులు ఆనందంగా జీవించసాగారు.

యోగినీ ఏకాదశి అత్యంత మహిమాన్వితమైంది. ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంతటి ఫలం ప్రాప్తిస్తుందో, అంతటి ఫలం కేవలం ఒక్కసారి భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రాప్తిస్తుంది. ఈ వ్రతాచరణ వల్ల సమస్త పాపాలు తొలగిపోవడమే కాక, మోక్షం ప్రాప్తిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.