Vastu tips: ఇంటి నైరుతి మూలలో అస్సలు ఉండకూడని వస్తువులు ఏంటి? ఎలాంటి వస్తువులు ఉంచితే శుభప్రదం
Vastu tips: వాస్తు శాస్త్రంలో తూర్పు, పడమరలతో సహా 8 దిక్కులకు విభిన్న ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం అన్నీ సరిగ్గా ఉంటే ఇంట్లో శుభఫలితాలుంటాయి. కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారు. అలా ఇంట్లో నైరుతి మూలలో ఏమి ఉంచితే మంచిది?
వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం సహా ఈశాన్య దిశ, ఆగ్నేయ దిశ, వాయువ్య దిశ, నైరుతి దిశ అంటూ మొత్తం 8 దిక్కులుంటాయి. వాస్తు ప్రకారం.. వాస్తులోని ఇంట్లోని వస్తువులను సరైన దిశలో ఉంచాలని నమ్ముతారు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది. ముఖ్యంగా నైరుతి మూలలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాస్తు ప్రకారం నైరుతి మూలకు రాహువు, కేతువులు అధిపతులు. ఈ దిశలో భూమి మూలకం ప్రముఖమైనది. అందుకే ఈ దిశ చాలా సున్నితమైనది అలాగే శక్తితో కూడి ఉంటుందని నమ్ముతారు. కనుక నైరుతి దిశలో వస్తువులను పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రముఖ వాస్తు సలహాదారులు ఆచార్య ముకుల్ రస్తోగి ఇంటి నైరుతి మూలలో ఏమి ఉండాలి..? ఏమేం ఉండకూడదు అనే విషయాలను వివరంగా తెలిపారు.
నైరుతి మూలలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు?
- ఇంటి నిర్మాణంలో మాస్టర్ బెడ్ రూం అనేది ఇతర బెడ్ రూంల కంటే కాస్త విశాలంగా ఉండాలి. యజమాని మాత్రమే ఉండే ఈ మాస్టర్ బెడ్ రూమ్ ఇంటికి నైరుతి దిశగా ఉండటం ఉత్తమం. ఇంట్లోని చిన్న వయస్కులు ఈ దిశలో ఉంటే వారికి హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- నైరుతి మూలలో వాటర్ ఫిల్టర్లు, ట్యాపులు వంటి నీటి వనరులు ఎప్పుడూ ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల ఇంట్లోకి వచ్చే ధనం నీరులా జారిపోతూనే ఉంటుంది. నిల్వ ఉండదని నమ్మిక.
- ఈ దిశలో మరుగుదొడ్లు, స్నానాల గదులు కూడా ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా ఉండటం వల్ల కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- వంట గది అంటేనే అగ్నికి మూలం. కనుక వాస్తు ప్రకారం వంట గది కూడా నైరుతి దిశలో ఉండటం నిషేధం. ఇలా నిర్మించడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది.
- ఈ దిశలో గుంతలు, బోరుబావులు, బావులు, ప్రార్థనా స్థలాలు కూడా వాస్తు ప్రకారం ఉండకూడదు.
- మొత్తం ఇంటిలోని గదుల సమతుల్యతలో నైరుతి మూల ఎక్కువ బరువు కలిగి ఉండాలి. కనుక భారీ లగేజీని, బరువైన వస్తువులను ఈ దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం పెరుగుతుందని నమ్ముతారు.
- ఇంటి పైభాగానికి చేరుకునేందుకు మెట్లను నైరుతి మూలలో నిర్మించాల్సి వస్తే, అవి కచ్చితంగా సవ్యదిశలో అంటే గడియారం ముల్లు తిరిగే దిశగా ఉండేలా చూసుకోవాలి.
- ఈ దిశలో వాలు ఉండకూడదు. ఎల్లప్పుడూ భూమి వాలును ఈశాన్య దిశలో ఉంచాలి. లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
- మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నైరుతి దిశ ఎప్పుడూ చీకటిగా ఉండాలి. గాలి వెలుతురు తగలక పోతే ఈ దిశ ప్రతికూల శక్తులను నిలయంగా మారే అవకాశాలున్నాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్