Shodasa samskaralu: షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? ఏవి ఎప్పుడు, ఎలా చేస్తారు?-what are shodasa rituals which ones are done when and how ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shodasa Samskaralu: షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? ఏవి ఎప్పుడు, ఎలా చేస్తారు?

Shodasa samskaralu: షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? ఏవి ఎప్పుడు, ఎలా చేస్తారు?

HT Telugu Desk HT Telugu
May 23, 2024 05:00 PM IST

Shodasa samskaralu: షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? ఏవి ఎప్పుడు ఎలా చేస్తారు అనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర శర్మ తెలియజేశారు.

షోడశ సంస్కారాలు అంటే ఏమిటి?
షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? (pixabay)

Shodasa samskaralu: షోడశ అంటే పదహారు. సంస్కారమంటే మంచి చేయడం. మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేటంత వరకూ చేసే సంస్కారాలు పదిహేను ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఆత్మకు మంచి కలగాలని చేసే సంస్కార సంచయంతో కలిపి మొత్తం పదహారు అవుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అలా పాటించాల్సిన సంప్రదాయ విభాగాల్లో షోడశ సంస్కారాలు ఒకటి.

1. గర్భాధానం: స్త్రీ పురుష తొలి సమాగమం. మంచి ఆశించి జరిపే కార్యక్రమం.

2. పుంసవనం: బిడ్డ పుట్టాలని చంద్రుడు పురుష రాశి ఉన్నప్పుడు జరిపే సంస్కారం.

3. సీమంతం : తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్హును కోరుతూ చేసేది.

4. జాతకర్మ : బొడ్డు తాడు కోసే ముందు చేసే సంస్కారం.

5. నామకరణం : పేరు పెట్టడం.

6. నిష్క్రమణ : బిడ్డను తొలిసారి ఇంటి బయటకు తీసుకురావడం.

7. అన్నప్రాశన : మొదటిసారిగా ఘనాహారం తినిపించడం.

8. చూడాకరణ : పుట్టు వెంట్రుకలు తీయించడం.

9. కర్ణవేధ : చెవులు కుట్టించడం.

10. అక్షరాభ్యాసం: బిడ్డకు అక్షరాలు నేర్పించడం.

11. ఉపనయనం: పిల్లలను విద్యార్ధన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం.

12. వేదారంభం: చదువులను అభ్యసించడం, ఆరంభించడం.

13. కేశాంత: వయసు వచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడం.

14 సమావర్తన: చదువు ముగించుకుని గురుకులాన్ని వదిలిరావడం. దీనినే స్నాతకమంటారు.

15. వివాహం: గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టడం.

16. అంత్యేష్టి మరణానంతరం కుమారులు చేసే అగ్నిసంస్కారం అని చిలకమర్తి తెలిపారు.

మనకు పెద్దలు సూచించిన పదహారు సంస్కారాల్లో జాతకర్మ ఒకటి. జాతకర్మ అంటే పుట్టిన సంతానానికి చేసే క్రియ ఇది. ప్రస్తుత కాలంలో నామకరణంలోనే జాతకర్మను కూడా కలిపి చేస్తున్నారు. శాంతి నక్షత్రాలు, వ్యతీపాత యోగాలు లేకుండా సంతానం కలిగితే ఇష్టదైవాన్ని తలచుకుని, పెద్దల నుంచి తండ్రి ఆశీస్సులు పొందాలి. శిశువు గర్భంలో ఉండగా ఉమ్మనీరు తాగిన దోషం పోవడానికి, ఆయువు, బుద్ధికుశలత పెరగడానికి, పరమేశ్వర అనుగ్రహం కలగడానికి నేను ఈ జాతకర్మ చేస్తాను అని సంకల్పం చెప్పుకోవాలి.

ఎవరికైనా పాప ప్రక్షాళన చెసుకుంటే తప్ప మేలు జరగదని ధర్మసింధువు చెబుతోంది. నాభి కోయడానికి ముందే జాతకర్మ చేయాలి. శిశువు పుట్టినట్లు తెలిసిన వెంటనే అప్పటికప్పుడు ఇవన్నీ చేయలేకపోయినా మానసికంగా ఈ క్రియ చేసినట్టు భావించాలి. తరువాత దాన్ని ఆచరణాత్మకంగా జరిపించాలి. ఈ సంస్కారం తర్వాత మాత్రమే జ్యోతిష్ముణ్ణి పిలిపించి శిశువు జాతక విశేషాలు తెలుసుకోవాలి. జాతకర్మ తరువాతనే శిశువు జన్మ నక్షత్రం శాంతి నక్షత్రమైతే అయా గ్రహాల్ని మంత్ర జపాలతో తృప్తి పరచాలి. కాలాలు మారిపోతుంటే వీటిలో అనేక మార్పు చేర్పులు అనివార్యంగా వస్తున్నాయి. అయినప్పటికీ యథాశక్తి ఈ వైదిక సంస్కారాలను మార్పులు చేర్పులతో నిర్వహించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

టాపిక్