వార ఫలాలు.. ఈ వారం వీరికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి
Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జూన్23వ తేదీ నుంచి జూన్29వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

రాశిఫలాలు (వార ఫలాలు) 23.06. 2024 నుండి 29.06.2024 వరకు
సంవత్సరం : శ్రీ క్రోధి నామ, ఆయనం : ఉత్తరాయణం, మాసం : జ్యేష్టము
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారంలో వాహనపరమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. భూముల క్రయవిక్రయాల విషయంలో తగినంత జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తె అవకాశం ఉంది. నూతన పరిచయాల పట్ల కాస్త ఆలోచనతో వ్యవహరించండి. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లో సంయమనం పాటించండి. అనవసరపు ఆలోచనలు చేయకండి. ముఖ్యమైన పనులపై ధ్యాస పెట్టండి. పెద్దల ప్రోత్సాహం మెండుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నర సింహస్వామి ఆలయాన్ని సందర్శించడం వల్ల మంచి జరుగుతుంది.
వృషభ రాశి
వార ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండనుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్యలకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలకు అనువైన సమయం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించండి. శివారాధన, ఈశ్వరుని దర్శనం శుభప్రదం.
మిథున రాశి
గతంతో పోలిస్తే ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తిపరమైన బాధ్యతలు, శ్రమ పెరిగినా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వారం ఆరంభంలో ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ అనుకూల ఫలితాలనే సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా ఉండనుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గురు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టడం ఎంతో అవసరం. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రామాలయాన్ని సందర్శించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈవారం ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. తోటివారి పట్ల ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన సంభాషణల వల్ల అభిప్రాయభేదాలు తలెత్తె అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు కొంత పరిష్కారం అవుతాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కన్యా రాశి
ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. అనుకోని ఖర్చులు ఉండొచ్చు. వ్యాపారాభివృద్ధికి సంబంధించిన పనులను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలతో మనసు ప్రశాంతంగా మారుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పైఅధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది. కొత్త పరిచయాలతో అనుకున్న పనులు పూర్తవుతాయి. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. మంచీచెడ్డలు చర్చిస్తారు. సమాజంలో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. భూ లావాదేవీలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈవారం దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మనసు పెట్టి వాటిని పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారులతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచుకోండి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శివారాధన శుభప్రదం.
మకర రాశి
పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కుంభ రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆండదండలు లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన అవకాశం. రావలసిన డబ్బు చివరి నిమిషంలో చేతికి అందుతుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.
మీన రాశి
వార ఫలాల ప్రకారం ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. గత వారంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు రావచ్చు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువవుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. స్థిర చరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.