Weekly Horoscope: ఈ వారం వారఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం మారాలనే ఆలోచనలు వస్తాయి
Weekly Horoscope Telugu: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకూ ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
రాశిఫలాలు (వారఫలాలు) 8.12.2024 నుంచి 14.12.2024 వరకు
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం
మాసం: మార్గశిరము
మేషం:
ఈ వారం మేష రాశి వారికి కొంత అనుకూలముగా ఉంటుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కార్యజయం కలుగుతుంది. స్నేహాలు, పరిచయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాల గురించి మరింతగా తెలుసుకుంటారు. హనుమాన్ వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం:
వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని కార్యక్రమాల నిమిత్తం చేస్తున్న ప్రయత్నాల్లో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకుంటాయి. కార్యాలయంలో మారుతున్న వాతావరణం మీకు ప్రతికూలంగా అనిపిస్తుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు వస్తాయి. శక్తికి మించిన బరువు బాధ్యతలు మీ మీద వేసుకుంటారు. మన బాధ్యతలు మనం సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించేవారు ఎక్కువ అవుతారు.
మిథునం:
ఈ వారం మిథున రాశి వారు కొంతమందితో ప్రయోజనాలను ఆశించి వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో నిత్య దీపారాధన చేయడం మంచిది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులు, బంధువులతో కలిసి శుభ కార్య వ్యవహారాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
కర్కాటక రాశి వారు ఈ వారంలో శుభ కార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సహోదర, సహోదరిలతో మాట తూలకుండా జాగ్రత్త వహిస్తారు. కోర్టు వ్యవహారాలు, తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలరు ధరించండి. మోసం చేస్తున్నవారికి సదుపాయాలు అమర్చాలన్న విధంగా వస్తున్న తీర్పు మీకు ఏమాత్రం నచ్చదు, అలాగని వాస్తవాలను నిరూపించలేరు.
సింహం:
ఈ వారం సింహ రాశి వారిలో రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నామినేటెడ్ పదవుల కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించగలుగుతారు. కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టాలన్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పాల్గొంటారు. మీ ప్రవర్తన ఇతరుల ప్రశంసలు అందుకుంటుంది.
కన్య:
కన్యా రాశి వారికి ఈ వారంలో మీ నేతృత్వంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొన్ని వ్యాపార సంస్థలు నడపటం సంతోషం కలిగిస్తుంది. అయిన వాళ్లతో సఖ్యత లేకపోవడం నిరాశకు కారణం అవుతుంది. కొంతమంది మీకు చేసే రికమండేషన్, సిఫార్సులు ఆమోదించలేక అవస్థలు పడతారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లబ్ధి పొందుతారు.
తులా:
ఈ రాశి వారు ఈ వారంలో కోపతాపాలకు దూరంగా ఉండండి. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మంచి నిర్ణయం తీసుకుంటారు. సంతాన సంబంధమైన సమస్యలు వస్తాయి. అనుకోని విధంగా వాళ్ల జీవితాల్లో వస్తున్న మార్పులకు మీరు కుంగిపోతారు. వాళ్ల భవిష్యత్తు గురించి చింతిస్తారు. ఎరుపు వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయడం మంచిది.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారు వ్యాపార విస్తరణ వ్యవహారాలలో అనూహ్యమైన ప్రజల ఆదరణ, ఆదాయం అందుకుంటారు. కొంత మందిని కటకటాల వెనక్కి పంపే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. చేతికి కుబేర కంకణం ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ఆలోచనల ద్వారా అంతంత మాత్రపు ఫలితాలే అందుతాయి. చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు.
ధనుస్సు:
ఈ రాశి వారు ఈ వారం వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తరచూ వాహన ప్రమాదాలకు గురవటం లేదా రిపేర్లు సంభవించటం జరుగుతుంది. స్నేహితుల ద్వారా మీరు అనుకున్న కొన్ని పనులు నెరవేర్చుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఆ బొట్టు ధరించండి. కళా, సాహిత్యకారులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
మకరం:
మకర రాశి వారు ఈ వారం సహోద్యోగులు, సహచర బృందంతో సన్నిహితంగా మెలగుతారు. వాళ్ల ద్వారా ఎప్పటికప్పుడు కీలకమైన సమాచారం అందుకుంటారు. శత్రువర్గంలోని కొంత మంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. ప్రతి ఒక్క విషయం వ్యక్తిగతంగా కాక వృత్తి/ వ్యాపార పరంగా మన ఎదుగుదలకు సోపానమవుతాన్న విధంగా ఆలోచనలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభం:
కుంభ రాశి వారు ఈ వారం రాత పూర్వకమైన పత్రాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఉన్నత చదువుల కోసం రాసే పరీక్షల్లో మంచి మెరిట్ మార్కులని సంపాదిస్తారు. ప్రతిరోజు ప్రథమ తాంబూలం దేవీ దేవతలకు సమర్పించండి. సొంత నిర్ణయాల కన్నా పెద్దలు చెప్పిన నిర్ణయాల ప్రకారంగా నడుచుకొని వివాహం చేసుకుంటారు. శుభ వార్తలు వింటారు.
మీనం:
ఈ రాశి వారు ఈ వారం కుటుంబ సమేతంగా విహార యాత్రలు చేస్తారు. రుణ సంబంధమైన బాధలు బాధిస్తాయి. రుణాలు తీర్చేందుకు చేసే ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఎప్పటికప్పుడు నూతన బాధ్యతలు, అవసరాల వల్ల రుణాలని తీర్చలేని పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం పట్ల ప్రేమ కనబరుస్తారు. వారితో ఎక్కువ సమయం గడపాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.