ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. విధుల్లో మరింత శ్రద్ధ చూపాలి, శ్రీ దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి-weekly horoscope from mesha rasi to meena rasi june 15th to june 21st ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. విధుల్లో మరింత శ్రద్ధ చూపాలి, శ్రీ దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి

ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. విధుల్లో మరింత శ్రద్ధ చూపాలి, శ్రీ దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి

HT Telugu Desk HT Telugu

ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 15.06.2025 నుంచి 21.06.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఈ వారం రాశి ఫలాలు (freepik )

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 15.06.2025 నుంచి 21.06.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: జ్యేష్ట మాసం, తిథి : కృ. చవితి నుంచి కృ. ఏకాదశి వరకు

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం విశేషంగా కలసివస్తుంది. ఆత్మీయత, అనురాగంతో కుటుంబసభ్యులందరినీ మెప్పిస్తారు. తీర్థయాత్రలు విరివిగా చేస్తారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు మరింత వెలుగులోకి వచ్చే సమయం. చిన్ననాటి స్నేహితులతో మంచి చెడ్డా విచారిస్తారు. ఆదాయానికి మొదట్లో కొంత లోటు ఏర్పడినా తిరిగి పుంజుకుంటారు. ఎంతో కాలంగా అజ్ఞాతంగా ఉండి మీకు చేయూతనిస్తున్న వ్యక్తి తారసపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇంటి నిర్మాణాలపై సందిగ్ధత తొలగుతుంది. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. వృత్తులు, వ్యాపారాలలోని వారికి మరింత వెసులుబాటు, రాజకీయవేత్తలు, సాంకేతిక వర్గాలు, వైద్యులు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆరోగ్య విషయాలపై నిర్లక్ష్యం వద్దు, ఆహార విహారాదులపై శ్రద్ధ చూపండి. మనోనిబ్బరంతో ముందుకు సాగండి. సుబ్రహ్మణ్యాష్టక పఠనం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ వారం ఇంటా బయటా ఎదురులేని పరిస్థితుల మధ్య గడుపుతారు. రాబడి, ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలలో మెరుగుదల కనిపిస్తుంది. తండ్రి లేదా ఆయన తరఫువారి ద్వారా ధన, ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు విజయాలు వరిస్తాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. వృత్తులు, వ్యాపారాలలోని వారికి శుభదాయకమే.

ద్వితీయార్థం కత్తిమీద సాముగా నడుస్తుంది. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని కొందరు మోసగించే యత్నాలు చేయవచ్చు. అయితే వాస్తవం గ్రహించి మేల్కొనడంతో బయటపడతారు. ఆదాయం, ఖర్చులకు పొంతన ఉండదు. ఆరోగ్యం కూడా కొంత సహకరించక ఇబ్బందిపడవచ్చు. అయితే పట్టుదల, ధైర్యంతో నెట్టుకొస్తారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. తరచూ తీర్థయాత్రలు జరుపుతారు. ఆదిత్యహృదయం పఠనం ఉత్తమం.

మిథున రాశి

ఆపదలో ఉన్న వారికి చేయూతనందిస్తారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలన్నీ తీరతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేయడం. గతంలో నిలిచిపోయిన ఆస్తి పంపకాలు వంటివి ఫలప్రదం అయ్యే అవకాశముంది. వ్యతిరేకులను సైతం మీదారికి తెచ్చుకోవడంలో విజయం సాధిస్తారు. కొత్త వాహనాలను ఇష్టపడి వాటిని సొంతం చేసుకుంటారు.

ఇంటి నిర్మాణాలపైనా దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో పలుకుబడి మరింత పెంచుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చే సూచనలు. వృత్తులు, వ్యాపారాలలోని వారు మరింత రాణిస్తారు. ద్వితీయార్థం నుండి ముఖ్య కార్యక్రమాలలో నిదానం అవసరం. అలాగే, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. శివాష్టకం పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ వారం గతం కంటే మరింత ఉత్సాహంగా గడుపుతారు. అప్పులు ఎట్టకేలకు తీరి ఊరట చెందుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరేందుకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. సోదరులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వివాదాలు అత్యంత ఆశ్చర్యకరంగా పరిష్కారమవుతాయి. ప్రముఖుల చేదోడుగా నిలిచే సందర్భం. రాబడికి ఎటువంటి లోటు రాకుండా గడిచిపోతుంది. స్నేహాలు పెరిగి సంతోషంగా గడుపుతారు.

తొందరపాటు మాటలకు స్వస్తి చెప్పి అందర్నీ ఆకట్టుకునేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగాలు లభించే సమయం. శత్రువులను ఆదరించి మీ ఔదార్యాన్ని చాటుకుంటారు. కుటుంబసభ్యులు మీపట్ల మరింత సానుకూల వైఖరి ప్రదర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలోని వారికి కలిసివచ్చే కాలమనే చెప్పాలి. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహ రాశి

రాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా ఖర్చులు అధిగమిస్తారు. కొన్ని ఆరోపణల నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగూ మీకు ఉపయుక్తమవుతుంది. ఇంటర్వ్యూలు అందుకున్న నిరుద్యోగులకు శుభదాయకమే. వివాహాది వేడుకల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టర్లు ఎట్టకేలకు అనుకున్న టెండర్లను దక్కించుకుంటారు.

స్థిరాస్తి విషయంలో ఆశాజనకమైన ఒప్పందాలు కుదురుతాయి. కీలక వ్యక్తి ద్వారా అవసరమైన సహాయం అందుకుంటారు. మీ ఆత్మీయత, అనురాగాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. కాశీ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలకు పయనమవుతారు. వృత్తులు, వ్యాపారాలలోని వారికి అనుకూలమైన కాలం. మధ్య మధ్యలో కొన్ని చికాకులు, ఆరోగ్య సమస్యలు ఎదురైనా సర్దుకుంటాయి. శ్రీ నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య రాశి

కన్య రాశి వారు ఈ వారం అనుకున్న లక్ష్యాలు నెరవేరడానికి కొంత కష్టించాల్సిన అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో ఇతరుల సహాయం అర్థిస్తారు. వీనికు చేదోడుగా నిలుస్తారనుకున్న స్నేహితులు చివరి క్షణంలో రక్తహస్తం చూపవచ్చు. ఆదాయానికి మొదట్లో కొంత ఇబ్బంది ఏర్పడినా క్రమేపీ సర్దుకుంటుంది. కొన్ని ప్రయాణాలను చివరిలో వాయిదా వేస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరూ భాగస్వాములవుతారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం సడలనీయకుండా పట్టుదలతో ముందుకు సాగండి. ఉద్యోగులు మాత్రం విధుల్లో మరింత శ్రద్ధ చూపాలి. శ్రీ దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

తుల రాశి

తుల రాశి వారికి మొదట కొంత వ్యతిరేక పరిస్థితులు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే సందర్భం, ఖర్చుల విషయం, ఆరోగ్యాలపై జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ముఖ్య వ్యవహారాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక బంధువుల తాకిడి అధికమై ఊపిరి పీల్చుకోలేని విధంగా ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి రాలేరు. కుటుంబంలో ఒత్తిడులు పెరిగి సతమతమవుతారు.

బాధ్యతల విషయంలో రాజీ వద్దు. శ్రమైనా వాటిని పూర్తి చేయడం మంచిది. ఇక క్రమేపీ అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. ఆదాయం విషయంలో ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. వ్యాపారాలలోని వారికి అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆంజనేయ స్వామిని పూజిస్తే మేలు కలుగుతుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు ఈ వారం ముఖ్య వ్యవహారాలను ఇతరుల సాయం లేకుండానే పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. బంధువర్గం మీపట్ల మరింత ప్రేమానురాగాలు కురిపిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని గత సంఘటనలు నెమరు వేసుకుంటారు. కుటుంబంలో మీరంటే అందరూ ఇష్టపడే విధంగా మసలుకుంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు.

సేవానిరతితో అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. వివాహాది వేడుకలకు హాజరై ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ద్వితీయార్థంలో స్వల్ప అనారోగ్యం, కొన్ని సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు. చిత్రవిచిత్ర సంఘటనలు, వ్యక్తులు తారసపడవచ్చు. తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ సలహాలకు మరింత విలువ ఇస్తారు. ఆస్తుల పంపకాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగే అవకాశం. అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు పాటుపడతారు. స్నేహితులు సైతం మీ విజయాలకు సహాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు సైతం ఆశ్చర్యపడేలా ముందడుగు వేస్తారు. అనుకున్న ఆదాయం లభించి ఖర్చులు అధిగమిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలోని వారికి మరింత సంతోషదాయకమని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యయప్రయాసలు. కనకధారా స్తోత్రం పఠించండి.

మకర రాశి

ఈ రాశి వారు ఈ వారం మీరు ఏ పని చేపట్టినా సమయానికి పూర్తి చేస్తారు. మీ వెలుగులోకి వచ్చే కాలం. సోదరులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా కరిస్తున్న కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. రాబడి అనూహ్యంగా పెరిగి అవసరాలకు ఆదుకుంటుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కోర్టు కేసులు చివరిదశకు చేరడం ఉత్సాహాన్నిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాలకు ఎదురు ఉండదు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. చివరి వారం ఆరోగ్యం, ముఖ్య వ్యవహారాల పట్ల నిర్లక్ష్యం వద్దు. అంగారకస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఈ వారం బంధువులతో తరచూ వివాదాలు నెలకొనే సమయం. ప్రతి వ్యవహారంలోనూ మరింత నిదానం అవసరం. ఆదాయం, వ్యయాలు సమానస్థాయిలో ఉండి ఊపిరి పీల్చుకుంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో ప్రతిష్ఠంభన. కాంట్రాక్టర్లకు కొంత నిరుత్సాహమే మిగులుతుంది. కుటుంబసభ్యులు మీ శక్తిసామర్థ్యాలను గుర్తించకపోవడంతో మదనపడతారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. తరచూ ప్రయాణాలు సంభవం కావచ్చు. అయితే ద్వితీయార్ధమంతా శుభదాయకంగా గడుస్తుంది. యుక్తి, సమర్థతతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మికంగా కొంత ధనం అందవచ్చు. వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మీన రాశి

మీన రాశి వారు ఏ వ్యవహారం అనుకున్నా విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి, హోదాలు మరింత పెరుగుతాయి. సమాజంలో మీకు ఎదురులేని విధంగా ఉంటుంది. కుటుంబంలోనూ మీ మాటంటే వేదవాక్కుగా భావిస్తారు. సోదరులు మీకు మరింత సహకరిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ముందుకు సాగుతారు. విద్యార్థులు విజయాల తీరంలో పయనిస్తారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు లభించి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఒక మిత్రుని ద్వారా ఊహించనివిధంగా సహకారం అందుతుంది. తరచూ తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వివాహయత్నాలు మరింత కలసి వస్తాయి. వృత్తులు, వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులు సత్తా చాటుతారు. చివరి వారం ఖర్చులు తప్పవు. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. కాలభైరవాష్టకం పఠించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.