Vrishchika Rashi 2024: వృశ్చిక రాశి నూతన సంవత్సర రాశి ఫలాలు.. గురు బలం ఉంది
Vrishchika Rashi 2024: వృశ్చిక రాశి వారికి 2024 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 2024వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి కలసివచ్చునని వివరించారు.
2024వ సంవత్సరం వృశ్చికరాశి వారికి గోచారపరంగా నాలగవ స్థానములో శని సంచారం (అర్ధాష్టమ శని ప్రభావం) ఉన్నప్పటికి గురుడు కళత్ర స్థానములో అనుకూలంగా సంచరించుట వలన వృశ్చిక రాశికి 2024 సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
2024 సంవత్సరం వృశ్చిక రాశికి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు ఆరో స్థానములో సంచరించుట వలన అ సమయంలో కుటుంబ సమస్యలు, అరోగ్య సమస్యలు శత్రుబాధ అధికముగా ఉండును. మే నుండి డిసెంబర్ వరకు గురుడు కళత్రములో అనుకూలంగా ఉండటం చేత వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభ ఫలితములను మరియు అనుకూల ఫలితాలను ఇచ్చును.
వృశ్చికరాశి ఉద్యోగస్తులకు 2024 సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు 2024 ద్వితీయార్థం వ్యాపారపరంగా కలసివచ్చును. రైతాంగం మరియు సినీరంగాల వారికి 2024 సంవత్సరం మధ్యస్థముగా ఉన్నది.
వృశ్చికరాశి స్త్రీలకు 2024 సంవత్సరం ప్రథమార్థం శత్రుపీడ ఉంటుంది. అయితే ద్వితీయార్థం అన్ని విధాలుగా కలసివచ్చును. మొత్తం మీద 2024 వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వృశ్చిక రాశి 2024 పేమ జీవితం
2024 సంవత్సరంలో వృశ్చికరాశి వారికి ప్రేమ వ్యవహారాలు యందు కలసివచ్చేటటువంటి సంవత్సరం. జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం ఆనందముగా, ఆహ్లాదకరంగా గడిపెదరు. శత్రువుల వలన కొంత బాధ కలుగును. వృశ్చిక రాశి వారు ప్రతీ ఒక్కరిని గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించవద్దని సూచిస్తున్నాను.
వృశ్చిక రాశి 2024 ఆర్థిక విషయాలు
2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్ధికపరంగా కలసివచ్చును. జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరో స్థానమునందు గురుని ప్రభావం వలన ఆర్థికపరంగా కొంత ఇబ్బందులు, ఖర్చులు అధికమగును. మే నుండి డిసెంబర్ వరకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి మరియు లాభము కలుగును. వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం ద్వితీయార్థం ఆర్థికపరంగా లాభం చేకూర్చును.
వృశ్చిక రాశి 2024 కెరీర్
2024 సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు కెరీర్ పరంగా అనుకూలమైన సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రు బాధ కొంత ఉన్నప్పటికి ప్రమోషన్లు, ధనలాభం వంటివి అనుకూల ఫలితాలను ఇచ్చును. వృశ్చిక రాశి వారికి 2024 కెరీర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యస్థ ఫలితములు, మే నుండి డిసెంబర్ వరకు అనుకూల ఫలితములు కలుగును.
వృశ్చిక రాశి 2024 ఆరోగ్యం
2024 సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మధ్యస్థముగా ఉన్నది. మొదటి ఆరు నెలలు వృశ్చిక రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలుగు సూచనలు గోచరిస్తున్నవి. 2024 ద్వితీయార్థంలో అరోగ్యము అనుకూలించును. వృశ్చిక రాశివారు 2024లో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మంచిది. వృశ్చిక రాశి వారు అరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి 2024 పరిహారాలు
వృశ్చిక రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు నవగ్రహాలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.