వ్యాసకృత మహాభారతంలో సావిత్రి కథ మనకు కనిపిస్తుంది. అశ్వపతి, మాలినిల కుమార్తె సావిత్రి. తల్లిదండ్రుల ఆలనా పాలనలో అల్లారుముద్దుగా పెరుగుతుంది. ఒకనాడు చెలికత్తెలతో విహరిస్తుండగా, సాల్వపతి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుడు, విగతచక్షుడైన తండ్రిని తల్లిని కావడిలో మోస్తూ తీసుకువెడుతూ కనిపించాడు.
తల్లిదండ్రులను ప్రేమగా చూస్తున్న సత్యవంతుణ్ణి వివాహమాడాలని భావిస్తుంది సావిత్రి. వివాహమైన సంవత్సరానికే సత్యవంతుడు మరణిస్తాడని తెలిసి కూడా అతనినే వివాహమాడాలని నిశ్చయించుకుంటుంది. తల్లిదండ్రులను కూడా ఒప్పించి అతనినే పెళ్లాడి వనసీమకు కాపురానికి వెళ్తుంది. వారి అన్యోన్య దాంపత్య జీవితం సంవత్సర కాలం పూర్తవుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒకనాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లిన సత్యవంతుడు సొమ్మసిల్లిపోతాడు. హఠాత్తుగా యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఉపవాసదీక్షాపరురాలైన సావిత్రి అనుక్షణం అతనిని కంటికి రెప్పలా కాపాడుకోసాగింది. యముడు సత్యవంతుని ప్రాణాలను తన వెంట తీసుకుని వెడుతున్నాడు. సావిత్రి యముడిని అనుసరిస్తూ నీలమేఘాన్ని పోలే రంగులో నల్లని కాటుక వంటి ఆకారం, భీతిగొలిపే కోరలు, రక్తవర్ణంలో ప్రకాశిస్తున్న నేత్రాలు… చూడగానే నాలుగు అడుగులు వెనుకకు వేసేటట్లు కనిపిస్తున్నాయి.
ప్రళయకాలంలో మండిపడే అగ్నిజ్వాలా అన్నట్లున్నాడు. అతనిని చూసిన సావిత్రి హడలిపోయింది. తన భయాన్ని కప్పిపుచ్చుకుని ధైర్యాన్ని తెచ్చుకొని ఆ దివ్య పురుషుడికి నమస్కరించి — "అయ్యా! మీరెవరు? ఎందుకోసం ఇక్కడకు వచ్చారు?" అంటూ చేతులు జోడించి అడిగింది.
సావిత్రి తీరుకు దయాళుడైన యముడు — "అమ్మాయీ! నేను యమధర్మరాజును. ఎవ్వరికీ కనబడని నేను నీ పాతివ్రత్య మహిమ వల్ల నీకు కనిపించాను. నీ భర్తకు ఇప్పుడు మరణం ఆసన్నమవడం చేత అతనిని తీసుకుని వెడుతున్నాను," అని చెప్పి వెళ్లసాగాడు. యమధర్మరాజు మాటలను ఆలకించిన సావిత్రి నడవ శక్యం కాకపోయినా వెంబడించింది. తన వెంట వస్తున్న సావిత్రిని చూసి ఆశ్చర్యపోయిన యమధర్మరాజు ఆమెతో — "అమ్మాయీ! నా వెంటబడి ఎందుకు వస్తున్నావు? నీకేం కావాలి?" అన్నాడు.
సావిత్రి యముని పలుకులు విని అధైర్యపడక ధైర్యం తెచ్చుకుని — "ప్రభూ! మీకు తెలియని ధర్మం ఎక్కడైనా ఉన్నదా? భర్తలు ఎక్కడికి వెళ్తే భార్యలు అక్కడికి వెళ్లాలి గదా! నా మనవి ఆలకించి నాకు హితం చేకూర్చమని" పలికింది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
హితాన్ని చేకూర్చమని పలికిన సావిత్రిని చూసి యమధర్మరాజు ఆమెతో — "సావిత్రీ! ధర్మబద్ధమైన నీ మాటల తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నీ సత్ప్రవర్తన మెచ్చుకుంటూ నీకు వరమివ్వాలని సంకల్పించాను. నీ పతి ప్రాణం తప్ప ఏదైనా వరం కోరుకో. తప్పక ప్రసాదిస్తాను" అని పలికిన ప్రసన్నుడైన సమవర్తిని చూసి, భక్తితో నమస్కరించి అత్తమామలకు రాజ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటుంది.
"తథాస్తు!" అని పలికి వరం ప్రసాదించి వెడుతుండగా, తిరిగి సావిత్రి యముడిని అనుసరించింది. ఆమె అచంచలమైన దృఢదీక్షకు సంతోషించి, మరొక వరం కోరుకొమ్మనగా తన తండ్రికి రాజ్యాన్ని ప్రసాదించమని వేడుకోగా, యముడు — "ఆ కోరిక నెరవేరుగాక!" అని పలికి తిరిగి నరక లోకానికి పయనమయ్యాడు.
అంతట ఆమె తిరిగి యమునినే అనుసరించింది. అది గమనించిన యముడు సావిత్రి రాకను ఆపదలచి — "సావిత్రీ! నా వెంట రావద్దు. ఇక్కడి నుంచి తిరిగి మరలిపో! ఈ త్రోవ కఠినాతి కఠినమైనది. ఎవరికీ ప్రవేశించడానికి శక్యం కానిది. నీవు కోరిన వరాలను ప్రసాదించాను గదా! సంతృప్తి చెందిన మరలిపో" అని ఆదేశించాడు.
అయినా సావిత్రి ఆయనను అనుసరించి, ముచ్చటగా మూడో వరం ఇమ్మని అభ్యర్థించింది. అందుకు యముడు సంతసించి — "సాధ్వీమణీ! ధర్మబద్ధమైన నీ మాటలు వినసొంపుగా ఉన్నాయి. నీ సుగుణసంపత్తి నన్ను ఆనందపరచింది. అందుచేత నీకు మరొక వరాన్ని ప్రసాదిస్తున్నాను, కోరుకొమ్ము" అనగా, తనకు పుత్రుని ప్రసాదించమని కోరుకొంటుంది.
అందుకు యముడు అంగీకరించగానే — "భర్త లేకుండా సంతానభాగ్యం ఎలా కలుగుతుంది మానవ లోకంలో?" అనడంతో సావిత్రి పాతివ్రత్యాన్ని అర్థం చేసుకున్న యముడు ఆమె పతిప్రాణాలను ప్రసాదిస్తాడు. సావిత్రి యమునికి భక్తిపూర్వకంగా నమస్కరించి, సత్యవంతుడు పడివున్న వటవృక్షం వద్దకు వచ్చి ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటుంది. విగతజీవుడైన సత్యవంతుడు పునర్జీవితుడవుతాడు.
సావిత్రి భర్త ప్రాణాలను దక్కించుకున్న శుభదినమైన పౌర్ణమి నాడు భక్తి ప్రపత్తులతో ఆ జగజ్జననిని మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా అర్చించి, ఆ తల్లి దీవెనలను పొందింది. అత్తమామలు, తల్లిదండ్రులు అందరిచేతా మన్ననలు పొంది, మహాసాధ్వి అని కొనియాడబడి చిరకాలం భర్తకు సేవలు చేస్తూ సుఖించింది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆదర్శ మహిళగా వినుతికెక్కిన సావిత్రిని ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళామణి తన పతి ఆయురారోగ్యం కొరకు, తన మాంగల్యభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించి దీర్ఘ సుమంగళీభవులవుతారని ఆశిద్దాం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000