Vat savitri vratham: రేపే వట సావిత్రి వ్రతం, శని జయంతి.. శుభ ముహూర్తం, పాటించాల్సిన నియమాలు ఏంటి?
Vat savitri vratham: జూన్ 6వ తేదీ వైశాఖ అమావాస్య రోజు శని జయంతి, వట సావిత్రి వ్రతం వచ్చాయి. ఈరోజు పాటించాల్సిన నియమాలు, ఆచరించాల్సిన పద్ధతులు గురించి తెలుసుకుందాం.
Vat savitri vratham: జూన్ 6వ తేదీ వైశాఖ అమావాస్య వచ్చింది. ఈరోజే శని జయంతి, వట సావిత్రి వ్రతం కూడా వచ్చాయి. అకాల మరణం నుంచి భర్తలను రక్షించుకోవడం కోసం పెళ్లయిన ప్రతి స్త్రీ వట సావిత్రి వ్రతం ఆచరిస్తుంది. ఈరోజు వివాహిత స్త్రీలు మర్రి చెట్టును పూజించి సత్యవంతుడు, సావిత్రి కథలను వినడం వల్ల భర్త దీర్ఘాయుష్షుతో ఉంటాడని నమ్ముతారు.
వైశాఖ అమావాస్య తిథి
వైశాఖ అమావాస్య తిథి జూన్ 5 వ తేదీ బుధవారం సాయంత్రం 6.58 గంటల నుంచి గురువారం జూన్ 6వ తేదీ సాయంత్రం 5:30 వరకు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
వట సావిత్రి పూజకు శుభ ముహూర్తం
వట సావిత్రి పూజకు జూన్ 6వ తేదీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12.18 గంటల వరకు ఉంది. మధ్యాహ్నం రాహుకాలంలో పూజ చేయకూడదు.
పూజా విధానం
అమావాస్య రోజు భక్తులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరిస్తే మంచిది. లేదంటే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా కంగాజలాన్ని కలిపి స్నానం చేయాలి. తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు దానధర్మాలు చేయాలి.
వట సావిత్రి వ్రతం రోజున స్వచ్ఛమైన ఆవుపాలను నీటిలో కలిపి మర్రి చెట్టుకు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. మర్రిచెట్టులో విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు నివాసం ఉంటారని చెబుతారు. అందుకే మర్రి చెట్టును పద్ధతి ప్రకారం పూజిస్తే జీవితంలోని అన్ని రకాల ఆటంకాలు తొలగుతాయి.
మరి చెట్టును వటవృక్షం అంటారు. సావిత్రి తన భర్త ప్రాణాల కోసం యముడి వెంట పడిందని అంటారు. ఆ సమయంలో సత్యవంతుడి శరీరాన్ని మర్రి చెట్టు కింద ఉంచిందని చెప్తారు. అందుకే ఈ చెట్టు కింద సత్యవంతుడు, సావిత్రి విగ్రహాలు పెట్టి పూజ జరిపించాలి. తర్వాత రక్షా సూత్రం తీసుకుని మర్రి చెట్టు చుట్టూ ఏడు లేదా 11 సార్లు చుట్టాలి. అనంతరం వట సావిత్రి వ్రతం కథ వినడం లేదా చదవడం చేస్తే చాలా మంచిది.
నాలుగు శుభ యోగాలు
గ్రహాల పరంగా కూడా శని జయంతి రోజు నాలుగు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. శని జయంతి రోజు సర్వార్థ సిద్ది యోగం ఉంటుంది. అలాగే చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. రోహిణి నక్షత్రం, ధృతీయోగం, గజకేసరి యోగం, లక్ష్మీ యోగం అనే నాలుగు యోగాలు ఉన్నాయి.
శని జయంతి రోజు పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఎల్లప్పుడూ పూర్వీకులు ఆశీస్సులు పొందుతారు. వారి పేరిట దానధర్మాలు చేయడం మంచిది.
శని జయంతి పరిహారాలు
ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషం నుంచి బయటపడేందుకు శని జయంతి శుభప్రదమైన రోజు. ఈ రోజు ఉదయాన్నే శని ఆలయానికి వెళ్లి ఆవనూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయడం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం పొందుతారు. అలాగే పూర్వీకులని స్మరించుకుంటూ ఆలయంలో పూజారికి పాలు, తెలుపు రంగు మిఠాయిలు పంచి పెట్టాలి. ఏదైనా దేవాలయంలో మర్రి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించాలి. వృద్ధాశ్రమాలు, కుష్టు వ్యాధి గృహాల్లో మీ శక్తి మేరకు ఆహార పదార్థాలు దానం చేయాలి. కందిపప్పు కిచిడీ ప్రసాదం పంపిణీ చేయాలి. శనికి సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల సడే సతీ, దయ్యా దోషాల ప్రభావం తగ్గుతుంది. శని జయంతి రోజు నల్ల కుక్కకు ఆవనూనెతో కలిపిన రోటీ తినిపించాలి. ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుంది.