జూన్ 26 నుంచి వారాహి నవరాత్రులు.. ఈ తొమ్మిది రోజులు తేలికగా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!-varahi navaratrulu starts from june 26th check puja vidhanam and see how to receive matha blessings which problems goes ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 26 నుంచి వారాహి నవరాత్రులు.. ఈ తొమ్మిది రోజులు తేలికగా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!

జూన్ 26 నుంచి వారాహి నవరాత్రులు.. ఈ తొమ్మిది రోజులు తేలికగా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

వారాహి నవరాత్రుల సమయంలో పూజలు చేసి, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వలన ఐశ్వర్యం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి, శుద్ధికరణకు కూడా ఇది మంచి సమయం. జూన్ 26 నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతాయి. ఈ తొమ్మిది రోజులు తేలికగా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

జూన్ 26 నుంచి వారాహి నవరాత్రులు (pinterest)

ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి నవరాత్రులను జరుపుతారు. ఈసారి వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి? ఆ రోజు ఏమేం చేయాలి? ఆ తొమ్మిది రోజులు చేయవలసిన పూజలు, నైవేద్యాలు మొదలైన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2025 వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి?

ఆషాఢ పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజులు పాటు వారాహి నవరాత్రులు జరుపుకోవాలి. ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 4 వరకు వచ్చాయి. చాలా మంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని నిష్ఠగా వారాహి నవరాత్రులను జరుపుతారు.

వారాహి నవరాత్రులు నిర్వహించడం వలన కలిగే లాభాలు ఏంటి?

  1. వారాహి నవరాత్రుల సమయంలో పూజలు చేసి, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వలన ఐశ్వర్యం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి, శుద్ధికరణకు కూడా ఇది మంచి సమయం.
  2. వారాహి మాత భక్తులు ఈ పండుగ సమయంలో ఉపవాసం చేస్తూ, నిష్ఠగా పూజలు చేస్తారు.
  3. దిష్టి దోషాలు, దృష్టి దోషాలు, నరఘోష, మానసిక సమస్యలు, అయాసం, ఆందోళనలను తొలగించడానికి వారాహి మాతకు పూజ చేయడం మంచిది.
  4. అలాగే వారాహి మాతను ఆరాధించడం వలన గుర్తింపును పొందవచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి. సత్ఫలితాలను కూడా పొందవచ్చు.

వారాహి అమ్మవారికి ఎలా పూజ చేయాలి?

వారాహి నవరాత్రులను సాధారణంగా మన ప్రాంతాలలో జరిపారు. చాలా మంది ఇళ్లల్లో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు. అయినా సరే అమ్మవారికి ఈ నవరాత్రుల సమయంలో పూజ చెయ్యచ్చు. అందులో తప్పు లేదు. పూజ చేసేటప్పుడు చిన్న ఫోటోని పెట్టి, ఎర్రటి పూలను సమర్పించి, అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారికి నవరాత్రులు కనుక, సులభంగా మనం పూజ చేసుకోవచ్చు.

నివేదన

దీపం, దూపం, అష్టోత్తరం, నైవేద్యం, హారతితో పూజను పూర్తి చేసేయవచ్చు. సులభంగా పూజ చేసినా అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేయాలి. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కనుక పానకం, వడపప్పు తప్పక పెట్టండి. పులగం, పాయసం ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు పెడతారు. పండ్లు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. దసరా పూజలో అమ్మవారికి తొమ్మిది రోజులు పాటు చేసినట్టు చెయ్యక్కర్లేదు.

సులభంగా, మంచి రోజులు కావడంతో, అమ్మవారికి పూజ చేసుకుని నివేదన చేయవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా పైన చెప్పినట్లుగా పూజ చేయొచ్చు. నవరాత్రులు పూర్తయిన తర్వాత తొమ్మిదో రోజు గానీ, పదో రోజు గానీ అమ్మవారి చిత్రపటాన్ని పైన పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆ పటాన్ని వాడుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.