Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశిని 'పుత్రద ఏకాదశి' అని ఎందుకు అంటారు? ఆ రోజు శుభ ఫలితాలు కోసం ఇలా చేయండి
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని నదీస్నానం చేసి విష్ణ్వాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని రోజంతా హరి నామస్మరణంతో కాలం గడపాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు
కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని 'ముర' అనే రాక్షసుడు రాజ్యపాలన చేసేవాడు. ఇతడు తాళజంఘుడు అనే వాని కుమారుడు. బ్రహ్మను గురించి ఘోరమైన తపమాచరించి మెప్పించాడు. అతని తపస్సునకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అయోనిజ అయిన స్త్రీ వల్ల తప్ప, ఇంకెవరి చేతిలోనూ మరణం రాకూడదని వరం పొంది బలవంతుడయ్యాడు. వరగర్వంతో విర్రవీగి దేవతలను, ఋషులను, మానవులను పీడించసాగాడు. అతని దుశ్చేష్టలను భరించలేని దేవతలు శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. వారి ప్రార్ధన ఆలకించిన విష్ణువు మురాసురునిపై దండెత్తి యుద్ధమాచరించాడు.
యుద్ధం చాలాకాలం జరిగి విష్ణువు అలసిపోయి 'సింహవతి' అనే గుహలో ప్రవేశించాడు. అతని సంకల్పంతో ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి, ఆ రాక్షసుని సంహరించింది. అందుకు విష్ణువు సంతోషించి వరం కోరుకోమనగా 'తిథులన్నింటిలో అత్యంత ప్రీతిపాత్రం కావాలని, శ్రేష్ఠత్వం ఇవ్వాలని, ఈనాడు ఉపవాసం ఉన్నవారికి మోక్షం ఇవ్వాలని' వరం కోరుకున్నది.
ఆనాటి నుంచి ఏకాదశి పవిత్రమైన తిథిగా ఉద్భవించి ప్రధానమైన తిథి అయింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి పాప ప్రక్షాళన జరిగి సకల శుభాలు కలగాలని, జన్మాంతరంలో వారికి వైకుంఠప్రాప్తి కలగాలని వరం కోరింది. అప్పుడు మురారి తథాస్తు అన్నాడు. నాటి నుంచి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఆచారంగా మారింది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వైకుంఠ ఏకాదశిని 'పుత్రద ఏకాదశి' అని కూడా అంటారు. దీని విశిష్టత తెలిపే కథ ఒకటి ఉంది. పూర్వం భద్రావతి అనే నగరాన్ని సుకేతువు అను రాజు పరిపాలిస్తుండేవాడు. అతని భార్య పేరు శైవ్య. వారికి చిరకాలం వరకు సంతానప్రాప్తి కలగలేదు. ఒకనాడు సుకేతువు దీర్ఘాలోచనలో పడిపోయాడు. పూర్వజన్మలో చేసిన కర్మల ననుసరించి సంతానం-ధనం సంప్రాప్తిస్తాయని అంటారు.
ఇహ పరలోకము లందు కూడా శాంతి చేకూరుతుందని అంటారంటూ ఆలోచిస్తూ మంత్రి, తదితరులకు ఎవరికీ చెప్పకుండా అశ్వాన్ని అధిరోహించి కాననములకు వెళ్లిపోయి, పుత్ర సంతానం కోసం మహావిష్ణువును స్తుతిస్తూ తపమాచరించగా, అతని తపమునకు మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై మహారాజుకు పుత్రసంతానం కలిగేటట్లు వరమిచ్చాడు. కొంతకాలంలోనే పరంధాముని వరంచే సంతానం కలిగింది. ఏకాదశి తిథి నాడు పుత్రుడు కలగడం వల్ల ఆ తిథిని పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. ఇది పుత్రదా ఏకాదశి మహాత్మ్యం అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వైకుంఠ ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని నదీస్నానం చేసి విష్ణ్వాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని రోజంతా హరి నామస్మరణంతో కాలం గడపాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.. విష్ణుసహస్రనామ పారాయణ, గీతాపారాయణ మొనరించాలి. ఏకాదశికి ముందు రోజు దశమి నాడు ఒంటిపూట భోజనం చేసి, మరుసటి రోజు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని షోడశోపచారాలతో అష్టోత్తర, శతనామాలతో పూజించాలి. త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ
"యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం"
అని స్తుతిస్తూ తులసిమాతను పూజించాలి. విష్ణువుకు తులసీదళాలతో మాల సమర్పించి నమస్కరించాలి. పిదప విష్ణ్వాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుని యధాప్రకారం పూజించాలి. మరునాడు ద్వాదశి
పారాయణ చేసి, శక్తికొలది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేయాలి. ముక్కోటి ఏకాదశి నాడు జాగారం చేసి, పూజించి ముక్తిని పొందమని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఉపవాసమంటేనే ఉపవాసం ఉప యనగా సమీపంలో, వాసం అనగా నివసించడం అంటే భగవంతుని సమీపంలో ఉండి దైవానుగ్రహం పొందమని అర్థం.
నవవిధ భక్తిమార్గాలలో ఏ మార్గాన్ని అనుసరించి అయినా ఈశ్వరుని చేరుకోవచ్చు. అన్నింటి కావాల్సిన, అత్యంత ముఖ్యమైన లక్షణాలు చిత్తశుద్ది, ఏకాగ్రత. కనుక అందరం ముక్కోటి ఏకాదశి నాడు శ్రీమహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని, ఏకాగ్రతతతో ఆ పరాత్పరుని సేవిద్దాం. జీవన్ముక్తులమవుదాం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం