Goddess lakshmi devi: లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేశారంటే మీ ఇంట సిరిసంపదలు నిలుస్తాయి
Goddess lakshmi devi: శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు. అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజ చేయడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలు నిలుస్తాయి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏ పూలతో పూజ చేయాలో తెలుసుకుందాం.
Goddess lakshmi devi: పువ్వులు సమర్పించకుండా ఏ పూజ పూర్తి కాదు. దేవతలు, దేవుళ్ళకు ఇష్టమైన విధంగా పూలు సమర్పించి పూజ అందరూ పూజ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని నమ్ముతారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడు, దేవతకు అంకితం చేశారు.
శుక్రవారం సంపదల దేవతగా భావించే లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారికి కటాక్షం ఉంటే ఇంట్లో ధనానికి కొదువ ఉండదు. సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన ఖీర్ నైవేద్యంగా సమర్పించి పూజిస్తే చాలా సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే అలవాటులో భాగంగా కొన్ని పూలు అమ్మవారికి సమర్పిస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఏంటి? అమ్మవారికి ఎలాంటి పూలు సమర్పించకూడదో తెలుసుకుందాం.
ఈ పూలతో పూజ చేస్తే అంతా శుభమే
లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. మందారం, గులాబీ వంటి పూలు సమర్పించడం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది. ఇవి మాత్రమే కాకుండ తామర పువ్వులు సమర్పించవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి త్అమర్ పువ్వులోనే కూర్చుంటుంది. అందుకే ఈ పువ్వు పూజకు ఉపయోగించుకోవచ్చు. మందార పువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని, ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు.
ఇవి మాత్రమే కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన గన్నేరు పూలు సమర్పించవచ్చు. ఈ పూలతో పూజిస్తే ఇంట్లో సిరిసంపదలకు ఎటువంటి లోటు ఉండదు. గన్నేరు పూల చెట్టు ఇంట్లో పెంచుకున్నా మంచిది. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎర్ర గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగ సమస్య తీరుతుంది. సంపద వృద్ధి చెందుతుంది.
ఎరుపు, పసుపు రంగుల గన్నేరు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వీటితో పాటు బంతి పూలు, చామంతి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ఈ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే నేల మీద పడిన పూలు ఎప్పడూ పూజకు ఉపయోగించకూడదు. పూజకు ఉపయోగించే ముందు పూలు తడపకూడదు. లక్ష్మీదేవికి పూలతో పాటు పూజలో శంఖం, శ్రీఫలం, గవ్వలు పెట్టడం వల్ల కూడా కోరిన కోరికలు నెరవేరతాయి. ఆ కుటుంబం మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.
ఇవి అసలు వద్దు
లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలు అసలు సమర్పించకూడదు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందలేరు. జిల్లేడు చెట్టు పూలు పూజలో ఉపయోగించకూడదు. వాటితో పాటు నంది వర్దనం, చంపా, రత్ని పూలను లక్ష్మీదేవి , పార్వతీ దేవికి కూడా సమర్పించకూడదు. తెలుపు రంగు బిళ్ళ గన్నేరు పూలు పూజకు ఉపయోగించకూడదు. వీటిని సమర్పించి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు, ప్రతికూలతను ఇంట్లోకి తెచ్చుకున్నట్టే అవుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.