Ugadi Astro Tips: ఉగాది నాడు ఖచ్చితంగా చేయాల్సిన 6 పనులు.. ఇక ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు!-ugadi astro tips do these 6 things for happiness through out the year ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Astro Tips: ఉగాది నాడు ఖచ్చితంగా చేయాల్సిన 6 పనులు.. ఇక ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు!

Ugadi Astro Tips: ఉగాది నాడు ఖచ్చితంగా చేయాల్సిన 6 పనులు.. ఇక ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు!

Peddinti Sravya HT Telugu

Ugadi Astro Tips: ఈసారి మార్చి 30న కొత్త సంవత్సరం మొదలు కాబోతోంది. ఉగాది నాడు కొన్ని పనులు చేయడం వలన ఏడాదంతా కలిసి వస్తుంది. సమస్యలు లేకుండా సంతోషంగా జీవించొచ్చు. ఉగాది నాడు ఈ పనులని కచ్చితంగా చేస్తే ఏడాది మొత్తం సుఖసంతోషాలతో ఉండొచ్చు.

ఉగాది నాడు ఖచ్చితంగా చేయాల్సిన 6 పనులు (pinterest)

కొత్త తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది. ఈసారి మార్చి 30న కొత్త సంవత్సరం మొదలు కాబోతోంది. విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. అయితే, ఉగాది నాడు కొన్ని పనులు చేయడం వలన ఏడాదంతా కలిసి వస్తుంది.

సమస్యలు లేకుండా సంతోషంగా జీవించొచ్చు. ఉగాది నాడు చాలామందికి ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుందనేది తెలియదు. అయితే, ఈ పనులు చేస్తే మాత్రం మీ దశ తిరిగినట్లే.

విశ్వావసునామ సంవత్సరం

విష్ణుమూర్తికి విశ్వావసు అనే పేరు కూడా ఉంది. విశ్వావసునామ సంవత్సరం మంగళవాచకం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అన్నిచోట్ల కూడా క్షేమం కలుగుతుందట. ఈ సంవత్సరంలో పంటలు బాగా పండి, రైతులు సంతోషంగా ఉంటారు. రైతులు అభివృద్ధి చెందుతారు. ఈ సంవత్సరం బట్టల వ్యాపారులకి కూడా కలిసి వస్తుంది.

ఉగాది నాడు ఈ పనులని కచ్చితంగా చేస్తే ఏడాది మొత్తం సుఖసంతోషాలతో ఉండొచ్చు

  1. ఉగాది నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తైలస్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి.
  2. ఈరోజు కొత్త బట్టలు కట్టుకుని మంగళప్రదంగా తయారవ్వడం మంచిది.
  3. ఉగాది నాడు ధ్వజారోహణ చేయడం మంచిది. అంటే కాషాయం జెండాను తీసుకువచ్చి ఇంటికి కడితే చాలా మంచి జరుగుతుంది.
  4. ఉగాది నుంచి నాలుగు నెలల పాటు చలివేంద్రాన్ని పెట్టడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది, ఈ నాలుగు నెలలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలివేంద్రాన్ని పెడితే బాటసారులకి సహాయపడుతుంది. పైగా పితృదేవతలు కూడా సంతోషపడతారట. జంతువులు, పక్షులకి కూడా నీళ్లు ఏర్పాటు చేయొచ్చు దాని వలన కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
  5. ఉగాది నాడు వేపాకుని ఖచ్చితంగా తినాలి. ఎలాగో మనం వేపాకుని ఉగాది పచ్చడిలో వేసుకుంటాం. కాబట్టి ఉగాది పచ్చడిని కచ్చితంగా తినేటట్టు చూసుకోండి. ఉగాది పచ్చడి తినేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం కూడా ఉంది. 'శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ.. సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్'. ఉగాది పచ్చడి తినేటప్పుడు ఇలా ఈ శ్లోకాన్ని చదువుకుని, ఉగాది పచ్చడి తింటే మంచి జరుగుతుంది.
  6. ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం చూసినట్లయితే వేపతో పాటుగా షడ్రుచులను సేవించాలని ఉంది. కాబట్టి ఉప్పు, పులుపు, తీపి, వగరు ఇలా షడ్రుచులను ఉగాది పచ్చడిలో జోడించాలి. ఆ తర్వాత ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం